PM RAHAT Scheme For Road Accident Victims: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట ఎంతో కీలకం, దీనిని "గోల్డెన్‌ అవర్‌" అని పిలుస్తారు. బాధితుడిని గంట లోపే ఆసుపత్రికి చేర్చగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశాలు రెట్టింపు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు PM RAHAT (Road Accident Victim Hospitalisation and Assured Treatment) పథకాన్ని ప్రారంభించింది.

కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమల్లోకి వచ్చింది. 

రూ.1.50 లక్షల వరకు క్యాష్‌లెస్‌ చికిత్సఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు క్యాష్‌లెస్‌ చికిత్స అందుతుంది. ప్రమాదం జరిగిన రోడ్డు ఏ కేటగిరీకి చెందినదనే పట్టింపు లేదు. బాధితుడి ఆసుపత్రి ఖర్చులు 7 రోజుల వరకు లేదా రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది.

తీవ్ర గాయాలున్న వారికి ఆసుపత్రిలో చేరిన తర్వాత 48 గంటల వరకు స్టెబిలైజేషన్‌ ట్రీట్‌మెంట్‌ అందుతుంది. తీవ్రమైన పరిస్థితి కాకపోతే 24 గంటల వరకు ఫాలోఅప్‌ చికిత్స ఉంటుంది. అయితే ఈ క్యాష్‌లెస్‌ చికిత్స కొనసాగాలంటే 24 లేదా 48 గంటల్లోపే పోలీసుల ధృవీకరణ తప్పనిసరి.

112కు కాల్‌ చేస్తే అంబులెన్స్‌ప్రమాదం జరిగిన చోట ఉన్న వ్యక్తులు 112 నంబర్‌ డయల్‌ చేసి అత్యవసర హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయొచ్చు. ఈ నంబర్‌ ఇప్పటికే ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌తో అనుసంధానమై ఉంటుంది. కాల్‌ అందుకున్న వెంటనే సమీప ఆసుపత్రి వివరాలు అందించి, అంబులెన్స్‌ను సంఘటన స్థలానికి పంపిస్తారు. మొదటి స్పందన బృందం, పోలీసులు, ఆసుపత్రి కలిసి సమన్వయంతో పని చేస్తే బాధితుడికి తక్షణ చికిత్స అందుతుంది. ఈ సమన్వయం ఈ పథకంలో చాలా కీలకం.

డిజిటల్‌ సిస్టమ్‌ ఎలా పనిచేస్తుంది?ఈ పథకానికి ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ & మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. నేషనల్‌ హెల్త్‌ అథారిటీ ట్రాన్సాక్షన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (TMS 2.0) ను, మోర్త్‌ ఎలక్ట్రానిక్‌ డిటైల్‌డ్‌ యాక్సిడెంట్‌ రిపోర్ట్‌ (eDAR) ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించారు. ప్రమాద రిపోర్ట్‌, ఆసుపత్రిలో చేరిక, పోలీసు ధృవీకరణ, చికిత్స, క్లెయిమ్‌ ప్రాసెసింగ్‌, చివరి చెల్లింపు వరకు అన్నీ డిజిటల్‌గా లింక్‌ అవుతాయి. దీంతో పారదర్శకత పెరుగుతుంది.

ఆసుపత్రులకు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు?బాధితుల ఆసుపత్రి ఖర్చులను మోటార్‌ వెహికల్‌ యాక్సిడెంట్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వం చెల్లిస్తుంది. వాహనానికి ఇన్సూరెన్స్‌ ఉన్నట్లయితే సంబంధిత బీమా సంస్థ కొంత భాగాన్ని భరిస్తుంది. ఇన్సూరెన్స్‌ లేని వాహనం లేదా హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి ఖర్చులు చెల్లిస్తుంది. స్టేట్‌ హెల్త్‌ ఏజెన్సీ క్లెయిమ్‌ను ఆమోదించిన తర్వాత 10 రోజుల్లో ఆసుపత్రికి డబ్బులు అందుతాయి.

ఫిర్యాదుల పరిష్కారం ఎలా?ఈ పథకానికి సంబంధించిన సమస్యలు వస్తే గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ ఆఫీసర్‌ బాధ్యత వహిస్తారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమని చెప్పొచ్చు. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ '112' కు ఒక్క కాల్‌ చేస్తే ప్రాణ రక్షణ చికిత్స అందించవచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు అవుతోంది, ప్రజలకు చాలా పెద్ద ఊరటగా మారనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.