Maruti Suzuki e-Vitara Launch: భారతదేశం గ్రీన్ మొబిలిటీ దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం గుజరాత్‌లోని హన్సల్పూర్‌లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించి, దేశీయంగా తయారైన తొలి ఎలక్ట్రిక్ SUV e-Vitaraని లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ఇది భారత్ స్వావలంబన యాత్రలో, గ్రీన్ మొబిలిటీ హబ్‌గా మారే ప్రయత్నంలో ప్రత్యేకమైన రోజు. భారత్‌లో తయారైన e-Vitara కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా, ప్రపంచంలోని 100కి పైగా దేశాలకు ఎగుమతి అవుతుంది” అని వెల్లడించారు.
Maruti Suzuki e-Vitara ప్రత్యేకతలు
మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ SUV.
e-Vitara రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
49 kWh బ్యాటరీ - 7 kW AC ఛార్జర్‌తో 6.5 గంటలు, 11 kW ఛార్జర్‌తో 4.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
61 kWh బ్యాటరీ - 7 kW ఛార్జర్‌తో 9 గంటలు, 11 kW ఛార్జర్‌తో 5.5 గంటల్లో ఛార్జింగ్ పూర్తి అవుతుంది.
రెండు వేరియంట్లు కూడా DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండటం వల్ల కేవలం 45 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
వాహనానికి 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, గూడ్‌యర్ టైర్లు ఫిట్ చేశారు.
ఇ-విటారా ధర
మారుతి సుజుకీ, ఇ-విటారా ధరను అధికారికంగా ఇంకా నిర్ణయించలేదు. ధర ఎంత అనే విషయం అతి త్వరలోనే తెలుస్తుంది. అయితే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేటు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పోటీ కార్లు
ఇ-విటారాను ఈ రోజే లాంచ్ చేసినప్పటికీ, ఈ రోజు నుంచే మార్కెట్‌లో అందుబాటులో ఉండదు. ఈ రోజు నుంచి ఈ కారు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. మరో 10 రోజుల లోపు, అంటే సెప్టెంబర్ 3, 2025 నుంచి భారతీయ కస్టమర్లకు ఇ-విటారా డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే యూకేలో లాంచ్ అయిన e-Vitara, భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, మహీంద్రా BE.6 వంటి మోడళ్లకు బలమైన పోటీ ఇవ్వనుంది.
గుజరాత్‌లో బ్యాటరీ ఉత్పత్తి
e-Vitara లాంచ్‌తో పాటు, గుజరాత్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తి కూడా ప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. దీని ద్వారా దేశీయ బ్యాటరీ తయారీ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం అవుతుందని, దిగుమతులపై ఆధారపడకుండా భారత్ స్వయం సమృద్ధి దేశంగా మారుతుందని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్ కేవలం ఎలక్ట్రిక్ కార్ల తయారీలోనే కాకుండా, కీలకమైన బ్యాటరీ టెక్నాలజీలో కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఇవ్వగల స్థాయికి చేరుకుంటుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ SUVగా e-Vitara లాంచ్ అవడం భారత ఆటోమొబైల్ రంగానికి మైలురాయి. ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా, భారత్‌ను గ్లోబల్ EV మార్కెట్లో ఒక ప్రధాన ప్లేయర్‌గా నిలబెట్టబోతుంది.