Phone Number Update In Driving Licence Online: ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు  కేంద్ర రవాణాశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌లో నమోదైన మొబైల్‌ నంబర్‌ను ఇకపై ఆన్‌లైన్‌లోనే సులభంగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అనుబంధంగా ఉండే ఫోన్ నంబర్‌ ఆధారంగా OTP వెరిఫికేషన్‌తో లాగిన్‌ అయ్యే విధానం అమలులో ఉంది. కానీ చాలా మంది వాహనదారులకు పాత నంబర్లు మారడంతో వారు సేవలు పొందలేకపోతున్నారు. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న రవాణా శాఖ డిజిటల్ సేవలను మరింత మెరుగుపరిచి వాహనదారులకు సేవలు అందించేందుకు అప్‌డేట్ అయ్యింది. డ్రైవింగ్ లైసెన్స్‌ సంబంధిత సేవల్లో ‘ఫోన్ నంబర్ మార్పు’ ప్రక్రియను ఇప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌లో చేసుకునే విధంగా మార్పులు చేర్పులు చేసింది.       

Continues below advertisement


డ్రైవింగ్ లైసెన్స్‌ పొందిన వ్యక్తులు, తమ ఫోన్ నంబర్ మారితే లేదా పాత నంబర్ పనిచేయకపోతే, కొత్త నంబర్ నమోదు చేయడం చాలా అవసరం. ఎందుకంటే లైసెన్స్‌కు సంబంధించి OTP ఆధారిత సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లాగిన్, అపాయింట్‌మెంట్ బుకింగ్, రెన్యువల్, అడ్రస్‌ మార్చడం వంటి అనేక అంశాల కోసం ఫోన్ నంబర్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఫోన్‌ నెంబర్‌తో అటాచ్‌ కాకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.           


ఫోన్‌ నంబర్‌ను ఎలా మార్చాలి?     


వాహనదారుడు, ముందుగా sarathi.parivahan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ "Driving Licence Services" విభాగంలోకి ప్రవేశించాలి. తర్వాత లైసెన్స్ జారీ అయిన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత, "Update Mobile Number" ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి.        


అదే పేజీలో ఆధార్ నంబర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్ నంబర్‌, మీ పుట్టిన తేది వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాలి. ఇప్పుడు మీ కొత్త ఫోన్ నంబర్‌ను నమోదు చేయాలి, కొత్త నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTP ని సంబంధింత గడిలో నమోదు చేసి సబ్మిట్‌ చేయాలి. సబ్మిట్‌ చేసిన వెంటనే, మీ ఫోన్‌ నంబర్ విజయవంతంగా మారుతుంది. ఆ తర్వాత వాహనదారుడు అన్ని లైసెన్స్ సేవలను కొత్త నంబర్‌తో యాక్సెస్‌ చేయవచ్చు.      


ప్రయోజనాలేంటి?     


ఈ డిజిటల్ సదుపాయం వల్ల ప్రజలు ఇకపై RTO కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదు. సమయం, ప్రయాణ ఖర్చులు, ఆఫీసు ఎదుట ఎదురు చూడడం వంటి వేళాపాళా లేని ఇబ్బందులు తప్పుతాయి. పైగా, హాయిగా ఇంట్లో ఫ్యాన్‌ కింద కూర్చునే మీ ఫోన్‌ నంబర్‌ను మార్చుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.      


మొత్తంగా, రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త వెబ్‌ సర్వీస్‌ను ప్రజల అవసరాలను గుర్తించి రూపొందించారు. భవిష్యత్‌లో మరిన్ని లైసెన్స్ సేవలు కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లోకి వస్తాయని అంచనా.