Petrol quality adulteration checking tips: ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారుల్లో మరో ఆందోళన కూడా పెరుగుతోంది. అదే పెట్రోలు & డీజిల్ నాణ్యత. పెట్రోలు బంకుల్లో నింపే ఇంధనం స్వచ్ఛంగా ఉందా? కొలత ప్రకారమే పోస్తున్నారా? అనే సందేహాలు చాలామందిని వేధిస్తున్నాయి. ఎందుకంటే కల్తీ ఇంధనం వల్ల కేవలం డబ్బు నష్టపోవడమే కాదు, వాహనం మైలేజీ తగ్గిపోవడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం, మరమ్మతుల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కొన్ని సందర్భాల్లో ఇంధనం నాణ్యంగా ఉన్నప్పటికీ పరిమాణంలో మోసం చేసే ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వినియోగదారుల హక్కులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తోంది. ప్రతి పెట్రోలు బంక్‌లో ఇంధన నాణ్యత & కొలతలను పరీక్షించే పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
ఫిల్టర్ పేపర్‌తో పెట్రోలు స్వచ్ఛత పరీక్ష
పెట్రోలులో కల్తీ ఉందా, లేదా అనే విషయాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. ఇందుకోసం ఫిల్టర్ పేపర్ పరీక్ష ఉపయోగపడుతుంది. పెట్రోలు బంక్‌లో ఫిల్టర్ పేపర్‌ను మీరు అడిగి తీసుకోవచ్చు, దానిని అక్కడి సిబ్బంది తప్పనిసరిగా అందించాలి.
ఫిల్టర్ పేపర్‌పై రెండు లేదా మూడు చుక్కల పెట్రోలు వేయాలి. స్వచ్ఛమైన పెట్రోలు అయితే అది ఎలాంటి మరకలు లేకుండా పూర్తిగా ఆవిరైపోతుంది. ఒకవేళ పెట్రోలులో కిరోసిన్ లేదా ఇతర పదార్థాల కల్తీ ఉంటే కాగితంపై నల్లటి లేదా జిడ్డు మరకలు కనిపిస్తాయి. అలా కనిపిస్తే ఇంధన నాణ్యతపై అనుమానం వ్యక్తం చేయవచ్చు.
డెన్సిటీ టెస్ట్‌తో నాణ్యత నిర్ధారణ
ప్రతి పెట్రోలు బంక్‌లో ఇంధన సాంద్రతను కొలిచే హైడ్రోమీటర్ అనే పరికరం ఉంటుంది. దీనితో పెట్రోలు & డీజిల్ నాణ్యతను పరీక్షించవచ్చు.
సాధారణంగా పెట్రోలు డెన్సిటీ 710 నుంచి 770 మధ్య ఉండాలి. డీజిల్ డెన్సిటీ 810 నుంచి 870 మధ్య ఉండాలి. ఈ ప్రమాణాలకు చాలా దూరంగా రీడింగ్ వస్తే ఇంధనంలో కల్తీ జరిగి ఉండే అవకాశం ఉంటుంది.
ఇంధనం నింపే ముందు సిబ్బందిని డెన్సిటీ పరీక్ష చూపించాలని కోరే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉంది. బంక్ యాజమాన్యం ఈ వివరాలను అందించాల్సిందే.
కొలతల్లో మోసాన్ని ఎలా గుర్తించాలి?
ఇంధనం నింపే ముందు మీటర్ డిస్‌ప్లేలో "0" కనిపిస్తున్నదా లేదా అనేది తప్పనిసరిగా గమనించాలి. చాలా మంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో డిస్‌ప్లేలో రీడింగ్ సరిగ్గా కనిపించినా, యంత్రాల్లో ట్యాంపరింగ్ చేసి కొలతల్లో తేడా వచ్చేలా చేసే ఘటనలు కూడా బయటపడుతున్నాయి. అలాంటి సందర్భాల్లో 5 లీటర్ల జార్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
5 లీటర్ల జార్ టెస్ట్ అంటే ఏమిటి?
ప్రతి పెట్రోలు బంక్‌లో ధృవీకరించిన 5 లీటర్ల కొలత జార్ తప్పనిసరిగా ఉండాలి. ఇంధనం పరిమాణంపై అనుమానం వస్తే సిబ్బందిని ఆ జార్‌లో 5 లీటర్లు నింపాలని కోరవచ్చు. జార్‌లో 5 లీటర్ల మార్క్ వరకు ఇంధనం రాకపోతే కొలతల్లో తేడా ఉన్నట్లు భావించవచ్చు. ఇది వినియోగదారుల కోసం అత్యంత నమ్మకమైన పరీక్షగా గుర్తించబడుతోంది.
మోసం జరిగితే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
ఇంధన నాణ్యతలో లోపాలు, కల్తీ లేదా కొలతల్లో మోసం జరిగినట్లు అనుమానం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. తూనికలు & కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అలాగే బంక్‌లో ప్రదర్శించే కస్టమర్ కేర్ నంబర్లకు కూడా సమాచారం ఇవ్వవచ్చు. ఫిర్యాదు సమయంలో బిల్లు, తేదీ, సమయం వంటి వివరాలు ఉంటే చర్యలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇంధనం నింపేటప్పుడు కేవలం ధర మాత్రమే కాకుండా నాణ్యత & పరిమాణంపైనా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. చిన్న జాగ్రత్తలతో పెద్ద నష్టాలను నివారించవచ్చు. పెట్రోలు బంక్‌లో మీ హక్కులను తెలుసుకుని వినియోగించుకుంటే కల్తీ ఇంధనం & కొలతల మోసాల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
