EV Road Trip Planning India: సుదూర ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ వాహనం (EV) అద్భుతమైన ఎంపికే, కానీ భారతీయ హైవేలపై ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత, ఛార్జర్ పనితీరు, రేంజ్ గురించిన ఆందోళన కొనుగోలుదారులను వెనక్కి లాగుతున్నాయి. నిజానికి, సరైన ప్రణాళిక, అధునాతన యాప్‌ల వినియోగం, కొన్ని కీలకమైన బ్యాకప్ ట్రిక్స్ తెలిస్తే, పెట్రోల్ కార్ల కంటే EV రోడ్‌ట్రిప్‌లు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు మీ EVతో దేశమంతా చుట్టేయాలనుకుంటే, ఈ గైడ్ మీకు కచ్చితంగా సహాయపడుతుంది.

Continues below advertisement

ప్రయాణానికి ముందు కారును సిద్ధం చేయండి!

రోడ్ ట్రిప్‌కు ముందు మీ EVని అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఏ కారు కంపెనీ అయినా చెప్పే క్లెయిమ్డ్ రేంజ్ కంటే, వాస్తవ ప్రపంచంలో 10% నుంచి 20% వరకు రేంజ్ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి:

• ఏసీ వాడకం (AC Usage): వేసవిలో ఏసీని ఎక్కువగా వాడితే రేంజ్ తగ్గుతుంది.

Continues below advertisement

• టైర్ ప్రెజర్ (Tire Pressure): సరైన టైర్ ప్రెజర్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయించడం తప్పనిసరి.

• బరువు (Load), టెర్రైన్ (Terrain): కారులో ఉన్న లోడ్, మీరు ప్రయాణించే రోడ్డు పరిస్థితులు (కొండలు, ఎత్తు పల్లాలు) రేంజ్‌పై ప్రభావం చూపుతాయి.

ప్రయాణానికి ముందు 3 ముఖ్యమైన పనులు:

1. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్: మీ EV సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు రేంజ్‌పై మెరుగైన ప్రభావాన్ని చూపుతాయి.

2. పోర్టబుల్ ఛార్జింగ్ కేబుల్: ఈకేబుల్‌ను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవాలి.

3. 100% ఛార్జ్: కేవలం లాంగ్ ట్రిప్స్‌కు వెళ్లేటప్పుడు మాత్రమే బ్యాటరీని 100% ఛార్జ్ చేయండి. ప్రతిసారీ ఇలా చేయవలసిన అవసరం లేదు.

ముఖ్యమైన ఛార్జింగ్ టిప్: మీరు స్టేషన్‌లో ఛార్జ్ చేస్తున్నప్పుడు, బ్యాటరీని 80% వరకు మాత్రమే ఛార్జ్ చేయండి. ఎందుకంటే 80% నుంచి 100% వరకు ఛార్జ్ కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది, దీని వల్ల మీ సమయం వృథా అవుతుంది. రేంజ్ కూడా కొద్దిగా మాత్రమే పెరుగుతుంది.

ప్లానింగ్ కోసం 4 లైఫ్ సేవింగ్ యాప్స్

EV రోడ్ ట్రిప్‌లకు, కేవలం గూగుల్ మ్యాప్స్ (Google Maps) మాత్రమే సరిపోదు. ఛార్జర్ల వాస్తవ స్థితిని తెలుసుకోవడానికి ఈ నాలుగు యాప్‌లు తప్పనిసరి:

1. స్టాటిక్ యాప్ (Statiq App): ఈ యాప్‌లో ఛార్జర్ల లభ్యతను చూడవచ్చు. గ్రీన్ లైట్ ఉంటే ఛార్జర్ రెడీగా ఉన్నట్లు, రెడ్ లైట్ ఉంటే ఛార్జర్ ప్రస్తుతం పనిచేయడం లేదని అర్థం.

2. టాటా పవర్ ఈజీ ఛార్జ్ (Tata Power EZ Charge): ఇది భారతదేశంలో అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కలిగి ఉన్న యాప్, హైవేలను కూడా కవర్ చేస్తుంది.

3. ఛార్జ్ జోన్ (Charge Zone): ఈ యాప్‌లో రియల్ టైమ్ మానిటరింగ్,  త్వరగా పేమెంట్ (Quick Pay) ఆప్షన్ ఉంటుంది. ఈ యాప్ చాలా స్మూత్,  కంఫర్టబుల్‌గా ఉంటుంది.

4. ప్లగ్‌షేర్ (PlugShare): ఇది అత్యంత ముఖ్యమైన కమ్యూనిటీ ఆధారిత (Community Driven) యాప్. ఈ యాప్‌లో ఇతర వినియోగదారులు ఆ ఛార్జర్ నిజమైన  స్టాటస్‌ను రివ్యూల రూపంలో రాస్తారు. ఉదాహరణకు, మ్యాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నట్లు చూపించినప్పటికీ, ఒక యూజర్ 'గన్ లాక్ అయ్యింది, ఎల్‌ఈడీ రెడ్ కలర్‌లో ఉంది' అని రివ్యూ రాయవచ్చు. అందుకే, మ్యాప్‌ను నమ్మే ముందు రివ్యూలను చదవడం చాలా ముఖ్యం.

ఛార్జర్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? బ్యాకప్ ట్రిక్స్!

మీరు ఒక ఛార్జింగ్ స్టేషన్‌కు చేరుకున్నాక, అక్కడ ఛార్జర్ పనిచేయకపోతే, ఆందోళన చెందకుండా ఈ క్రింది 'ప్లాన్ బి'ని అనుసరించండి.

చార్జర్ స్టేషన్‌లో చేయాల్సినవి (On-Site Check List):

1. ఎల్‌ఈడీ లైట్ చెక్: ఛార్జర్ పెడెస్టల్ (Pedestal) పై ఉన్న లైట్  చెక్ చేయండి. రెడ్ లైట్ ఉంటే ఎర్రర్ వచ్చినట్లు, బ్లూ లైట్ ఉంటే ఛార్జింగ్ కోసం రెడీగా ఉన్నట్లు అర్థం.

2. క్యూఆర్ కోడ్ స్కాన్: యాప్‌ను ప్రారంభించడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.

3. ఎర్రర్‌ను నోట్ చేయండి: ఏదైనా ఎర్రర్ వస్తే, దాన్ని నోట్ చేసుకుని కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి.

4. హెల్ప్‌లైన్‌కు కాల్: పెడెస్టల్‌పై రాసి ఉన్న హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి.

5. రిమోట్ రీబూట్: స్టాటిక్ (Statiq), టాటా పవర్ (Tata Power) యాప్‌లు రెండూ, సమస్య ఉన్నప్పుడు ఛార్జర్లను రిమోట్‌గా రీబూట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మీరు ఫోన్ చేసి సమస్యను చెబితే, వారు రీబూట్ చేస్తారు. చాలాసార్లు దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుంది. అయితే, దీని కోసం మీరు ఓపికగా స్టెప్స్ ఫాలో అవ్వాలి.

ఛార్జర్ డౌన్ అయితే 4 బ్యాకప్ ఆప్షన్స్:

1. ఆల్టర్నేట్ ఛార్జర్ నెట్‌వర్క్: వెంటనే మీ యాప్‌లో ఫిల్టర్ ఉపయోగించి, 10 నుంచి 20 కి.మీ పరిధిలో ఉన్న దగ్గరలోని మరో ఛార్జింగ్ స్టేషన్‌ను సెర్చ్ చేయండి.

2. డెస్టినేషన్ ఛార్జింగ్: మీరు గమ్యస్థానం చేరుకున్న దగ్గర, లేదా మార్గంలో ఉన్న హోటళ్లు, మాల్స్ లేదా రెస్టారెంట్లలో టైప్ 2 ఏసీ ఛార్జర్‌లు అందుబాటులో ఉంటాయేమో చూడండి. ఈ ఛార్జింగ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ, కనీసం నెక్స్ట్ డీసీ ఛార్జర్ (DC Charger) వరకు వెళ్లడానికి సరిపడా ఛార్జింగ్ పొందవచ్చు.

3. పోర్టబుల్ ఈవీఎస్ఈ కేబుల్: మీ దగ్గర ఉన్న పోర్టబుల్ ఛార్జింగ్ కేబుల్ ద్వారా 16 ఆంపియర్ సాకెట్ నుంచి టాప్-అప్ చేయవచ్చు. రెండు గంటల ఛార్జింగ్‌తో సుమారు 15 నుంచి 20 కి.మీ వరకు రేంజ్ పొందవచ్చు.

4. ఓఈఎం రోడ్‌సైడ్ అసిస్టెన్స్: టాటా (Tata), ఎంజీ (MG), మహీంద్రా (Mahindra) వంటి అన్ని కంపెనీలు టోయింగ్ (Towing) లేదా మొబైల్ ఛార్జింగ్ సేవలను అందిస్తాయి. మీరు ఎక్కడైనా ఇరుక్కుపోయినట్లయితే , వారికి కాల్ చేస్తే వారు సహాయం అందిస్తారు.

స్మార్ట్ డ్రైవింగ్ -లైఫ్ సేవర్ టిప్స్

హైవేలపై EVని నడిపేటప్పుడు స్మార్ట్‌గా వ్యవహరించడం ద్వారా రేంజ్‌ను గణనీయంగా పెంచవచ్చు.

1. ఛార్జర్ అప్‌టైమ్ డేటా: ప్లగ్‌షేర్ 25 యూజర్ రివ్యూల డేటా ప్రకారం, హైవేలపై ఛార్జర్‌ల అప్‌టైమ్ సుమారు 88% ఉంది. కానీ చిన్న పట్టణాలు,  గ్రామీణ ప్రాంతాలలో ఇది కేవలం 68% మాత్రమే ఉంది. అందుకే, ప్రయాణాన్ని ప్లాన్ చేసేటప్పుడు, బ్యాటరీలో ఎల్లప్పుడూ 15% నుంచి 20% వరకు బఫర్ (Buffer) ఉంచుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

2. రూట్ బ్యాకప్ మార్కింగ్: ప్రతి ప్రయాణ మార్గంలో కనీసం రెండు బ్యాకప్ ఛార్జర్లను గుర్తించండి. ఒకదానిని ప్రైమరీగా, మరొకదానిని సెకండరీగా మార్క్ చేయండి. ప్రైమరీ ఛార్జర్‌లో సమస్య ఉంటే, వెంటనే సెకండరీ ఛార్జర్‌కు వెళ్లవచ్చు.

3. ఏసీని తెలివిగా వాడండి: హైవేలపై ఏసీని స్మార్ట్‌గా ఉపయోగించాలి. ఎక్కువ సమయం ఏసీని ఫ్యాన్ మోడ్‌లో మాత్రమే ఉపయోగించడం వల్ల కూడా రేంజ్ గణనీయంగా పెరుగుతుంది.

4. కొండ ప్రాంతాల్లో రీజన్ ఆన్: కొండ ప్రాంతాలు లేదా ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ చేసేటప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్‌ను ఆన్ చేయడం ద్వారా ఫ్రీ ఎనర్జీని పొందవచ్చు. చాలా మంది దీనిని ఆఫ్ చేస్తారు, కానీ కొండ ప్రాంతాలలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, రీజనరేషన్ వల్ల కారు చూపించే రేంజ్ కంటే 2X లేదా 3X ఎక్కువ రేంజ్ లభించవచ్చు. ఇది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌గా నిపుణులు చెబుతున్నారు.

5. రివ్యూ రాయడం మర్చిపోవద్దు: మీరు ఏదైనా ఛార్జింగ్ స్టేషన్‌లో ఛార్జ్ చేసిన తర్వాత, ప్లగ్‌షేర్ యాప్‌లో మీ అనుభవాన్ని గురించి రివ్యూ రాయడం మర్చిపోవద్దు. మీ రివ్యూ మరొకరి ట్రిప్‌ను సహాయపడగలదు.

EV రోడ్‌ట్రిప్ అంటే ఛార్జర్ డౌన్ అవుతుందనో, రేంజ్ తక్కువ వస్తుందనో భయపడాల్సిన అవసరం లేదు. సరైన ప్లానింగ్, ఈ నాలుగు యాప్‌ల సహాయం, పైన చెప్పిన లైఫ్ సేవర్ టిప్స్‌ను పాటిస్తే, మీ EV ప్రయాణం సులభంగా, స్మార్ట్‌గా, ఒత్తిడి లేనిదిగా మారుతుంది.