New Traffic Challan Rules in India: భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను సంపూర్ణంగా పాటించకపోవడమే. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి & ట్రాఫిక్ క్రమశిక్షణను కఠినతరం చేయడానికి భారత ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం (2025) నుంచి కొత్త ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తోంది. ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న తప్పు చేసినా, అది మీ జేబుకు పెద్ద చిల్లు పెట్టవచ్చు & చట్టం పరంగానూ చర్యలు తీసుకోవచ్చు.

మైనర్ వాహనం నడిపితే ఇన్ని శిక్షలా?2025 నుంచి అమలు చేస్తున్న కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, మైనర్ (18 సంవత్సరాల వయస్సు నిండని బాలుడు లేదా బాలిక) వాహనం నడుపుతూ పట్టుబడితే, ఆ మైనర్‌ తల్లిదండ్రులు ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ట్రాఫిక్‌ పోలీసులు రూ. 25,000 జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ కఠిన చర్యలు ఇంకా ఐపోలేదండీ.. మైనర్‌ నడిపిన వాహనం రిజిస్ట్రేషన్‌ను 1 సంవత్సరం పాటు రద్దు చేస్తారు & మైనర్‌కు 25 సంవత్సరాల వయస్సు వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ లభించదు.

మద్యం తాగి వాహనం నడిపితే రెట్టింపు జరిమానామద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే, మొదటిసారి రూ. 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేసి దొరికిపోతే రూ. 15,000 జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.

రెడ్ లైట్‌ పడినా బండి నడిపితే 10 రెట్ల జరిమానారెడ్ లైట్‌ పడినా ఆగకుండా వేగంగా దూసుకెళ్లేవాళ్లను తరచూ చూస్తుంటాం. అలాంటి వ్యక్తులు అవతలి వాళ్ల ప్రాణాలను రిస్క్‌లో పెడతారు. రెడ్‌ లైట్‌ పడినా ఆగకుండా వెళ్లిపోయేవాళ్లకు గతంలో కేవలం రూ. 500 జరిమానా మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని 10 రెట్లు పెంచి రూ. 5,000 చేశారు.

అతి వేగం, ఓవర్‌ లోడింగ్‌కు భారీ శిక్షలునిర్దేశిత వేగాన్ని మించిన వేగంతో వాహనం నడుపుతూ పట్టుపడితే రూ. 5,000 జరిమానా కట్టాలి. లారీ లేదా ట్రక్కు లేదా వాణిజ్య వాహనంలో నిర్దేశించిన పరిమితికి మించి వస్తువులను తీసుకెళుతూ దొరికిపోతే ట్రాఫిక్‌ పోలీసులు రూ. 20,000 చలాన్ విధిస్తారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే?ఒక వ్యక్తి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేకుండా పట్టుబడితే రూ. 5,000 జరిమానా చెల్లించాలి. అయితే, డిజిలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌లో ఉన్న చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌ చెల్లుతుంది. మీ వాహనంలో చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ లేకపోతే మీకు రూ. 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు సమాజ సేవ చేయమని కోర్టు ఆదేశించవచ్చు.

సీట్ బెల్ట్‌ & హెల్మెట్‌ నియమాలు ఇప్పుడు, దాదాపు అన్ని కార్లలో ముందు సీట్‌తో పాటు వెనుక సీట్‌లో కూర్చున్న వారికి కూడా సీట్‌ బెస్ట్‌ సౌకర్యం ఉంది. కాబట్టి, కారు ప్రయాణీకులు/ప్రయాణీకుడు (ముందు సీట్‌లో లేదా వెనుక సీట్‌లో కూర్చున్న వ్యక్తి/వ్యక్తులు) సీట్ బెల్ట్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా కట్టేందుకు సిద్ధంగా ఉండాలి. బైక్‌ నడుపుతూ హెల్మెట్ లేకుండా పట్టుబడితే రూ. 1,000 జరిమానా కట్టాలి, దీంతోపాటు అతని లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు. 

డ్రైవింగ్‌ లేదా రైడింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడితే...మీ కారు డ్రైవింగ్ లేదా బైక్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ బండిని నడుపితే రూ. 5,000 వరకు జరిమానా విధిస్తారు. రోడ్డు ప్రమాద కారణాల్లో ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం.