Omega Seiki Launches Self-Driving Electric Three-Wheeler: మీరు ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు, డ్రైవర్ లేని ఆటో వెళ్తుంటే చూసి భయపడొద్దు. అది అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కావచ్చు. అంటే, డ్రైవర్ అవసరం లేని ఆటో అన్నమాట. ఒమేగా సీకి మొబిలిటీ, ప్రపంచంలోని మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ " స్వయంగతి" (Swayamgati) ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ త్రీ-వీలర్ ధర, ఇతర సాధారణ ఆటోల తరహాలోనే, సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది. 'స్వయంగతి' అటానమస్ ఆటోను వాణిజ్య వినియోగానికి ఉపయోగించుకోవచ్చు. ఈ త్రీ-వీలర్ ఇప్పుడు బుకింగ్‌లకు అందుబాటులో ఉంది మరియు డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా, వచ్చే రెండు సంవత్సరాలలో 1,500 స్వయంప్రతిపత్త త్రీ-వీలర్‌లను ఉత్పత్తి చేయాలని ఒమేగా సీకి మొబిలిటీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఒమేగా సీకి మొబిలిటీ, తన OSM ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ & AI-ఆధారిత స్వయం ప్రతిపత్తి వ్యవస్థపై 'స్వయంగతి' ఆటోను నిర్మించింది. విమానాశ్రయాలు, స్మార్ట్ క్యాంపస్‌లు, పారిశ్రామిక పార్కులతో పాటు రద్దీగా ఉండే చోట్ల కూడా స్వల్ప-దూర రవాణా కోసం డ్రైవర్ అవసరం లేని ఈ ఆటోను సులభంగా నడపవచ్చు.
అటానమస్ త్రీ-వీలర్ ధర ఎంత?ఒమేగా సీకి మొబిలిటీ, స్వయంగతి ప్యాసింజర్ వేరియంట్ ధరను రూ. 4 లక్షలుగా & కార్గో వేరియంట్ ధరను రూ. 4.15 లక్షలుగా నిర్ణయించింది. అయితే, కార్గో వేరియంట్ ఇంకా లాంచ్ కాలేదు, త్వరలో దీనిని ప్రవేశపెట్టవచ్చు.
"స్వయంగతి ప్రారంభం కేవలం ఒక ఉత్పత్తి ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశంలో రవాణా భవిష్యత్తును రూపొందించే ఒక అడుగు. స్వయంప్రతిపత్త వాహనాలు ఒక కల కాదు, నేటి అవసరం. AI & Li-dar వంటి సాంకేతికతలను భారతదేశంలో & మరింత అందుబాటు ధరకు అభివృద్ధి చేయవచ్చని స్వయంగతి రుజువు చేస్తుంది. స్వయంగతితో, భారతదేశం గ్లోబల్ ట్రెండ్స్‌ను ఫాలో కావాల్సిన అవసరం లేదని మేము చూపిస్తున్నాం"- ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకుడు ఉదయ్ నారంగ్
స్వయంగతి త్రీ-వీలర్ ఫీచర్లు 'స్వయంగతి' అనేది అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో. ఈ త్రీ వీలర్ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అయిన 'స్వయంగతి'లో Li-dar& GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ త్రీ-వీలర్ AI-ఆధారితంగా నడుస్తుంది. ఈ సెటప్‌లో లి-డార్ టెక్నాలజీ, GPS, ఆరు మీటర్ల వరకు అడ్డంకి గుర్తింపు, మల్టీ-సెన్సార్ నావిగేషన్ & రిమోట్ భద్రత నియంత్రణలు ఉన్నాయి. ఇవి, డ్రైవర్ జోక్యం అవసరం లేకుండా ముందస్తుగా-మ్యాప్ చేసిన మార్గాల్లో ఆటో ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి.
విమానాశ్రయాలు, టెక్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, స్మార్ట్ సిటీలు, క్యాంపస్‌లు & పారిశ్రామిక కేంద్రాలను దృష్టిలో పెట్టుకుని కోసం కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను రూపొందించింది.