Ola Electric Scooter catches fire: పెరుగుతున్న పెట్రోల్ ఖర్చుల నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెరుగుతోంది. దాంతో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవచ్చునని వాహనదారులు భావిస్తున్నారు. కానీ అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలతో ఎలక్ట్రిక్ వాహనాలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తమిళనాడు, మహారాష్ట్రలలో జరిగిన ఘటనలు అందుకు నిదర్శనం. మొన్న రాత్రి తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ కు మంటలు రావడం, ఆపై ఇళ్లు మొత్తం కాలిపోవడంతో తండ్రీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.
క్షణాల్లో దగ్దమైన ఎలక్ట్రిక్ స్కూటర్..
మహారాష్ట్రలోని పుణేలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ (Ola Electric Scooter Catches Fire In Pune) నుంచి మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్దమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ నుంచి మంటలు వచ్చాయి. కొన్ని సెకన్లలోనే మంటలు చెలరేగి వాహనం దగ్దం కావడంతో ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఓలాలో యాక్టింగ్ కూలింగ్ సిస్టమ్ లేకపోవడంతో పొగలు రావడం, ఆ వెంటనే మంటలల్లో వాహనం కాలిపోయిందని ట్వీట్ చేశారు. ఖర్చులు తగ్గుతాయని, పెట్రోల్ ధరలకు ఇదే పరిష్కారమని భావించిన వారు తాజా ఘటనలతో ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమేనా అని పునరాలోచిస్తున్నారు.
ఓలా కంపెనీ రియాక్షన్ ఇదే..
పుణెలో ఓలా ఎలక్రిక్ స్కూటర్ s1 ప్రో దగ్దం కావడంపై సంస్థ స్పందించి ఓ ప్రకటన (Ola Company Reaction Over Electric Scooter Catches on Fire) విడుదల చేసింది. పుణెలో ఎలక్ట్రిక్ బైక్ కాలిపోవడం గురించి మాకు సమాచారం అందింది. దీనిపై మేం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మంటలకు కారణమేంటో త్వరలోనే అప్‌డేట్ ఇస్తాం. ఆ స్కూటర్ ఓనర్‌తో మేం టచ్‌లోనే ఉండి వివరాలు తెలుసుకున్నాం. అతడు సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్ని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. దీనిపై త్వరలోనే సరైన చర్యలు తీసుకుంటామని’ ఓలా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఓలా కంపెనీ గత ఏడాది ఆగస్టు 15న Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంఛ్ చేసింది. డిసెంబర్ నెలలో ఈ మోడల్ స్కూటర్ల డెలివరీ చేస్తోంది. పెట్రోల్ ఖర్చులు భరించడం వల్ల కాదనుకున్న వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే భారత్‌లో వీటి మార్కెట్ విలువ పెరుగుతుండగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో కాలిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Electric Bike Blast: తమిళనాడులో విషాదం - బ్యాటరీ బైక్ పేలడంతో తండ్రి, కూతురు మృతి
Also Read: Hero Electric Eddy: ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు - ఎలా ఉందో చూసేయండి!