Car Maintenance: ఆటోమొబైల్ రంగంలో అప్పుడప్పుడు కొన్ని పాత పదాలు కొత్తగా వినిపిస్తుంటాయి. టైర్లలో 'నైట్రోజన్ ఇన్ఫ్లేషన్' కూడా అలాంటిదే. టైర్ షాపుల్లో గ్రీన్ కలర్ వాల్వ్ క్యాప్స్ చూసినప్పుడు.. "సాధారణ గాలి కంటే నైట్రోజన్ నిజంగానే మంచిదా?" అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. ఈ మార్కెటింగ్ హడావుడిని పక్కన పెట్టి అసలు విషయానికి వస్తే, నైట్రోజన్ గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలి.
నైట్రోజన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి?
సాధారణంగా మనం వాడే గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ తో పాటు కొంత తేమ (Moisture) ఉంటుంది. టైర్లలో నైట్రోజన్ నింపడం అంటే ఆక్సిజన్, తేమను తొలగించి దాదాపు 95 నుండి 99 శాతం స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ నింపడమే. ఆక్సిజన్, నీటి ఆవిరి వల్ల టైర్ ప్రెజర్‌లో మార్పులు రావడం, రబ్బరు త్వరగా పాడవ్వడం వంటివి జరుగుతుంటాయి. వీటిని తగ్గించడమే నైట్రోజన్ ప్రధాన ఉద్దేశం.
నైట్రోజన్ వల్ల కలిగే లాభాలు..
ప్రెజర్ తగ్గడం నెమ్మదిగా ఉంటుంది: నైట్రోజన్ అణువులు (Molecules) సాధారణ గాలి కంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి టైర్ రబ్బరు రంధ్రాల నుండి బయటకు రావడం కొంచెం కష్టం. దీనివల్ల టైర్ ప్రెజర్ ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుంది. తరచుగా గాలి చెక్ చేయని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
తుప్పు పట్టకుండా రక్షణ: కంప్రెస్డ్ ఎయిర్‌లో ఉండే తేమ వల్ల టైర్ రిమ్స్ లోపల తుప్పు పట్టే అవకాశం ఉంది. నైట్రోజన్ పూర్తిగా డ్రై గా ఉండటం వల్ల అల్లాయ్ వీల్స్, టీపీఎంఎస్ (TPMS) సెన్సార్లు సురక్షితంగా ఉంటాయి.
స్థిరమైన ఉష్ణోగ్రత: హైవేలపై లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా సమ్మర్ ఎండల్లో టైర్లు వేడెక్కుతాయి. సాధారణ గాలి కంటే నైట్రోజన్ తక్కువగా వ్యాకోచిస్తుంది. దీనివల్ల టైర్లు చల్లగా ఉండటమే కాకుండా హ్యాండ్లింగ్ కూడా స్టేబుల్‌గా ఉంటుంది.
ఇబ్బందులు ఇవే:
సాధారణ డ్రైవర్లకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువనే చెప్పాలి. సిటీ ట్రాఫిక్‌లో తిరిగే వారికి నార్మల్ ఎయిర్ సరిపోతుంది. నైట్రోజన్ ప్రతి పెట్రోల్ బంకులో దొరకదు. దీనికి రూ. 50 నుండి రూ. 200 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా నైట్రోజన్ కొట్టించాం కదా అని గాలి చెక్ చేయడం మానేస్తే ప్రమాదమే. నైట్రోజన్ నింపినా కూడా నెలకోసారి ప్రెజర్ చెక్ చేసుకోవడం తప్పనిసరి.
ఎవరు వాడాలి?
మీరు హై-పెర్ఫార్మెన్స్ కార్లు వాడుతున్నా, విపరీతమైన ఎండలు ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నా నైట్రోజన్ గ్యాస్ తీసుకోవడం మంచిది. లగ్జరీ కార్ ఓనర్లకు ఇది సెట్ అవుతుంది. కానీ ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి వచ్చే సాధారణ వాహనదారులకు మామూలు గాలి పక్కాగా సరిపోతుంది. సరిగ్గా మెయింటైన్ చేయడం, క్రమం తప్పకుండా ప్రెజర్ చెక్ చేయడం వల్ల టైర్ లైఫ్ పెరుగుతుంది. నైట్రోజన్ గాలి అనేది ఒక అదనపు సౌకర్యం మాత్రమే, అది ఖచ్చితంగా ఉండాలనే రూల్ ఏమీ లేదు. ప్రీమియం పెట్రోల్ లాగా ఇది థియరీ పరంగా బాగుంటుంది కానీ అందరికీ అవసరం లేదు. మీ దగ్గరలోని షాపులో నైట్రోజన్ అందుబాటులో ఉండి, కొంచెం ఎక్స్ట్రా ఖర్చు చేయడానికి మీకు ఇబ్బంది లేకపోతే హ్యాపీగా వాడుకోవచ్చు. లేదంటే సాధారణ గాలితోనూ మీ కారు ప్రయాణం క్షేమంగా సాగుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
