New Mahindra Thar Update: రోడ్డుపై ప్రత్యేక గుర్తింపుతో & ప్రతి ఒక్కళ్లూ కన్నార్పకుండా చూసే SUVల్లో మహీంద్రా థార్ ఒకటి. ఈ కారు అంటే భారతీయులకు పిచ్చ క్రేజ్. రఫ్ అండ్ టఫ్ లుక్, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్… ఇవన్నీ కలిసి థార్‌ను యూత్‌తో పాటు అడ్వెంచర్ ప్రియులకు దగ్గర చేశాయి. ఇప్పటికే, 2025 అక్టోబర్‌లో, ప్రస్తుత జనరేషన్ థార్‌కు ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి కొత్త డిజైన్ మార్పులతో థార్ టెస్టింగ్ మోడల్ కనిపించడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల రోడ్లపై కనిపించిన థార్ టెస్ట్ మ్యూల్… కొంతమేర క్యామఫ్లాజ్‌తో కనిపించినప్పటికీ, ఇందులో ఉన్న కొన్ని డిజైన్ అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా థార్ Roxx తరహా డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉండొచ్చనే చర్చ మొదలైంది.
కొత్త డిజైన్ మార్పులు ఏమిటి?ఇప్పటివరకు బయటపడిన స్పై ఫోటోల ప్రకారం, కొత్త థార్‌లో ప్రోజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్‌తో C-షేప్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs) కనిపిస్తున్నాయి. ఇది థార్ లుక్‌ను మరింత మోడ్రన్‌గా, షార్ప్‌గా చూపించే అవకాశం ఉంది. అదే విధంగా... ఇప్పటి వరకు ఉన్న 7-స్లాట్ గ్రిల్‌కు బదులుగా డబుల్ స్టాక్డ్ 6-స్లాట్ గ్రిల్ రానున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది థార్ Roxx డిజైన్‌ను గుర్తు చేసేలా ఉంది. అదనంగా, కొత్త డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా కనిపించాయి. ఇవి సుమారు 19 ఇంచ్ సైజ్‌లో ఉండొచ్చని అంచనా.
ఇంటీరియర్‌లో ఏమి మారొచ్చు?స్పై ఫోటోలలో ఇంటీరియర్ పూర్తిగా కనిపించకపోయినా, ఈసారి థార్‌లో కొన్ని ప్రీమియం ఫీచర్లు జోడించే అవకాశం ఉంది.
వాటిలో ముఖ్యంగా –
- ముందు సీట్లకు వెంటిలేటెడ్ ఫంక్షన్
- ఆటో డిమ్మింగ్ IRVM
- పవర్ ఫోల్డింగ్ ORVMs
- పుష్ బటన్ స్టార్ట్
- వైర్‌లెస్ చార్జర్
ఇలాంటి ఫీచర్లు వస్తే, థార్ డైలీ యూజ్‌కి మరింత కంఫర్ట్ కలిగించే SUVగా మారుతుంది.
ఇంజిన్, గేర్‌బాక్స్‌లో మార్పులుంటాయా?ఈ అప్‌డేట్‌లో ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు వచ్చే అవకాశం తక్కువ. ప్రస్తుత మోడల్‌లో ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అలాగే కొనసాగొచ్చు. పెట్రోల్ వేరియంట్‌కు ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌గా, శక్తిమంతమైన డీజిల్ వేరియంట్‌కు స్టాండర్డ్‌గా ఇవ్వడం కొనసాగవచ్చని అంచనా.
లాంచ్ ఎప్పుడు?ఈ కొత్త అప్‌డేట్‌కు సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్ ఇంకా స్పష్టంగా లేదు. అయితే, ఇది రోడ్డుపై కనిపించడాన్ని బట్టి చూస్తే, రాబోయే నెలల్లో మహీంద్రా అధికారికంగా ఈ రిఫ్రెష్ మోడల్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, థార్ అభిమానులకు ఇది మరో ఆసక్తికరమైన వార్త. Roxx తరహా డిజైన్ టచ్‌తో, మోడ్రన్ ఫీచర్లతో వచ్చే ఈ కొత్త థార్… మార్కెట్‌లో మరింత హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.