మహీంద్రా ప్రతి సంవత్సరం ఒక పెద్ద లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. థార్, ఎక్స్‌యూవీ700లు కూడా ఇలానే లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. దీనికి Z101 అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన టీజర్లను కంపెనీ విడుదల చేసింది.


ఈ స్కార్పియోను కొత్త ప్లాట్‌ఫాంపై రూపొందించారు. దీంతోపాటు కొత్త ఇంజిన్, కొత్త ఎక్స్‌టీరియర్/కొత్త ఇంటీరియర్ కూడా ఇందులో ఉండనుంది. కారు ముందువైపు గ్రిల్ కొత్తగా ఉండటంతో మొత్తం లుక్ మారిపోనుంది. మహీంద్రా కొత్త లోగోతో ఈ కారు స్టైలింగ్ ఎంతో మెరుగుపడింది.


అయితే ప్రస్తుతం ఉన్న మహీంద్రా స్కార్పియోలో ఉన్న ప్లస్ పాయింట్లన్నీ ఇందులో కూడా ఉన్నాయి. ఇప్పుడు లాంచ్ కానున్న స్కార్పియోలో కొత్త డీఆర్ఎల్స్ అందించారు. వెనకవైపు లైట్స్ నిలువుగా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న స్కార్పియో కంటే పెద్దగా, ఎక్కువ స్పేస్‌తో కొత్త వెర్షన్ లాంచ్ కానుంది.


ఈ కొత్త Z101 ఎప్పట్నుంచో డెవలప్‌మెంట్‌లో ఉంది. మహీంద్రా ఈ కారు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. టెక్నాలజీ, ఇంటీరియర్ విషయంలో మహీంద్రా తన మార్కును వదలకుండానే కొత్తగా రూపొందించే ప్రయత్నం చేస్తుంది.


దీని ఇంజిన్లు ఎక్స్‌యూవీ700, థార్‌ల తరహాలోనే ఉండే అవకాశం ఉంది. థార్‌లో ఉండే 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ కొత్త స్కార్పియోలో కూడా ఉండే అవకాశం ఉంది. టాప్ ఎండ్ వేరియంట్లలో మరింత పవర్‌ఫుల్ ఇంజిన్ ఉండనుంది. ఎక్స్‌యూవీ700లో ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కూడా ఒక వేరియంట్ ఇందులో లాంచ్ కానుంది. 


ఈ కొత్త స్కార్పియోలో పెద్ద టచ్ స్క్రీన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరిన్ని కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఈ కొత్త స్కార్పియో త్వరలో లాంచ్ కానుంది. దీని లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.