ABS Safety System For Two Whellers: భారతదేశంలో ద్విచక్ర వాహనాల (బైకులు & స్కూటర్ల) రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. చాలా సందర్భల్లో, రైడర్ ప్రాణాలు కోల్పోతున్నాడు & అతని కుటుంబం రోడ్డున పడుతోంది. దీనిని నివారించడానికి, కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం, 2026 ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో విక్రయించే ప్రతి కొత్త బైక్ & స్కూటర్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండటం తప్పనిసరి,
ABS ఎందుకు అవసరమైంది?దేశంలో జరుగుతున్న మొత్తం రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 44% ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే. అంతేకాదు, ద్విచక్ర వాహనాల అమ్మకాలలో దాదాపు 45% సేల్స్ 125cc కంటే తక్కువ కేటగిరీలోనే ఉన్నాయి. ఇప్పటివరకు, ఈ విభాగంలోని బైక్‌లు & స్కూటర్లలో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) మాత్రమే ఉంది, ఇది రెండు బ్రేక్‌లను ఒకేసారి యాక్టివేట్ చేస్తుంది. CBS అనేది ఒక బేసిక్ సేఫ్టీ ఫీచర్, సమర్ధవంతంగానే పని చేస్తుంది. అయినప్పటికీ, దీనికంటే ABS ఇంకా చాలా ప్రభావవంతంగా ఉంటుంది, ముఖ్యంగా అధిక వేగంలో ఉండి ఒక్కసారిగా బ్రేక్ వేసినప్పుడు రైడర్ ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేయబోతోంది.
ABS ఎలా పనిచేస్తుంది?ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఒక అధునాతన భద్రత వ్యవస్థ. షార్ప్ బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ అవ్వకుండా ఇది నిరోధిస్తుంది. ఉదాహరణకు... రైడర్ వేగంగా వెళుతున్నప్పుడు మరేదైనా బండి, జంతువు, స్పీడ్ బ్రేకర్ లేదా గుంత వంటివి అతి దగ్గరలో అకస్మాత్తుగా కనిపించినప్పుడు వెంటనే బ్రేక్ వేస్తాడు. దీనివల్ల ఆ టూవీలర్ చక్రాలు లాక్ అవ్వవచ్చు లేదా స్కిడ్ కావచ్చు. ఈ రెండిటిలో ఏది జరిగినా ఆ బండి ఒక్కసారిగా పడిపోతుంది, రైడర్‌కు ఎక్కువ గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. టూవీలర్‌లో ABS సేఫ్టీ ఉంటే ఇలాంటి ప్రమాద తీవ్రత చాలావరకు తగ్గిపోతుంది. ABS నిరంతరం సెన్సార్ ద్వారా చక్రాల వేగాన్ని పర్యవేక్షిస్తుంది. రైడర్ బ్రేక్ వేసినప్పుడు చక్రం లాక్ అవ్వడం ప్రారంభించిన వెంటనే, ABS ఆ బ్రేక్ ఒత్తిడిని తగ్గించడం, పెంచడం చేస్తుంది & దానిని పల్సింగ్ యాక్షన్‌గా మారుస్తుంది. ఈ ప్రక్రియ చక్రాలు లాక్ అవ్వకుండా చూస్తుంది & బండిని రైడర్ కంట్రోల్‌లో ఉంచుతుంది. ఈ ఫీచర్ ముఖ్యంగా తడిసిన, జారుతున్న & అసమానంగా ఉన్న రోడ్లపై అద్భుతంగా పని చేస్తుంది & ప్రమాదాల అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. అంటే.. ABS ఉన్న బైక్ రైడర్‌కు అదనపు రక్షణ కవచం ఉన్నట్లే.
కొత్త నియమం ఏ వాహనాలకు వర్తిస్తుంది?కేంద్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం, 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి లాంచ్ అయ్యే ప్రతి కొత్త బైక్ & స్కూటర్‌లో ABS తప్పనిసరి. అది 100cc ఎంట్రీ-లెవల్ బైక్ అయినా లేదా 250cc హై-ఎండ్ స్పోర్ట్స్ బైక్ అయినా, అన్నింటికీ ABS ఫీచర్‌ను కంపెనీ అందిస్తుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ మార్పును మొదలు పెట్టాయి. ఉదాహరణకు.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R భారతదేశంలోనే అత్యంత చవకైన 125cc ABS బైక్.