Commercial LPG Cylinder Price | చిరు వ్యాపారులకు శుభవార్త. చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి 19-కిలోల కమర్షియల్ LPG సిలిండర్ల ధరను తగ్గించాయి. ఈసారి ఏకంగా రూ. 58.50 తగ్గించారు. నేటి (జూలై 1) నుండి తగ్గిన ధర అమలులోకి వస్తుంది. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ (Commercial Cylinder ) కొత్త రిటైల్ ధర ఇప్పుడు రూ. 1,665 అయింది. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ ధర ₹1,886.50కి దిగొచ్చింది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు, కేటరర్లకు తాజా నిర్ణయం ఉపశమనం కలిగిస్తుంది.
కమర్షియల్ సిలిండర్ ధరలు గత కొన్ని నెలలుగా దిగొస్తున్నాయి. “19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధర జులై 1 నుంచి రూ. 58.50 తగ్గింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రిటైల్ ధర రూ. 1,665. అయితే, 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజా నిర్ణయంతో వ్యాపారులకు మేలు కలుగుతుంది, కానీ గృహ వినియోగదారులకు ఏ ప్రయోజనం లేదు.
కమర్షియల్ LPG రేట్లలో క్రమంగా తగ్గుదల
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర తగ్గుదల ధోరణిని కొనసాగిస్తుంది. ఏప్రిల్ నెలలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 41 తగ్గించారు. ఆ తర్వాత మే నెలలో రూ. 14.50, జూన్ నెలలో రూ. 24 తగ్గింది. జూలైలోనూ తగ్గించారు. దాంతో గత నాలుగు నెలల్లో కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు మొత్తం ₹138 వరకు ఉపశమనం కలుగుతోంది.
LPG పై ఎక్కువగా ఆధారపడే వాణిజ్య సంస్థల కార్యకలాపాల వ్యయాలను తగ్గించడం ధరల తగ్గింపు లక్ష్యం. మార్జిన్లు తక్కువగా ఉన్నా, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న రంగాలలో ఇలాంటి నిర్ణయాలు ప్రభావం చూపుతాయి.
గృహ వినియోగదారులకు ఉపశమనం లేదు
వాణిజ్య వినియోగదారులు పదేపదే ఎల్పీజీ ధరల తగ్గింపుతో ఉపశమనం పొందుతుండగా.. గృహ వినియోగ LPG ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరగా ఏప్రిల్ 7, 2025న ధర సవరించారు. 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 50 పెరగగా.. అప్పటి నుంచి రేట్లు స్థిరంగా ఉన్నాయి.
జూలై 1, 2025 నాటికి ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు:
- ఢిల్లీ: రూ. 853.00
- ముంబై: రూ. 852.50
- కోల్‌కతా: రూ. 879.00
- హైదరాబాద్: 855.00
- చెన్నై: రూ. 868.50
- బెంగళూరు: రూ. 805.50
ధరల సవరణల వెనుక..
భారతదేశంలో LPG ధరలు ప్రతి నెల మొదటి తేదీన సవరిస్తున్నారు. ప్రపంచ ముడి చమురు రేట్లు, విదేశీ మారకపు హెచ్చుతగ్గులు ఆధారంగా ధరలలో మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ, చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల కంటే కమర్షియల్ సిలిండర్ ధరల తగ్గింపుపై ఫోకస్ చేస్తున్నాయి.
వాణిజ్య LPG రేటు డిసెంబర్‌లో ₹62 పెరిగింది. ఫిబ్రవరిలో కేవలం ₹7 తగ్గింది. అంతర్జాతీయ ఇంధన ధరలు తగ్గడం సేవా రంగాలలో ఆర్థిక పునరుద్ధరణకు మద్దతు ఇస్తాయి.