2026 Bajaj Pulsar 125 Price And Features Telugu: బజాజ్ కంపెనీ, కొత్త తరం క్లాసిక్ పల్సర్ 125ను మార్కెట్లోకి ఫ్రెష్‌గా తీసుకొచ్చింది. పల్సర్ 25వ వార్షికోత్సవంలో భాగంగా ఈ కొత్త మోడల్‌ను లాంచ్‌ చేసింది. రూ.92,990 ప్రారంభ ధరతో వచ్చిన ఈ బైక్‌లో ఇంజిన్ నుంచి ఫ్రేమ్ వరకు కీలక మార్పులు చేసింది. కొత్త గేర్‌బాక్స్, మోనోషాక్ సస్పెన్షన్, 5 అంగుళాల TFT కన్సోల్ వంటి ఫీచర్లను కూడా కంపెనీ అందించింది. కొత్త పల్సర్ 125తో పాటు న్యూ ఏజ్‌ పల్సర్ 150ని కూడా బజాజ్ లాంచ్‌ చేసింది.

Continues below advertisement

పవర్‌ఫుల్ 125cc ఇంజిన్

కొత్త పల్సర్ 125లో 124.58cc సింగిల్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,500rpm వద్ద 12.1hp శక్తిని జనరేట్‌ చేస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే పవర్ 0.3hp పెరిగింది. గరిష్ట టార్క్ 11.4Nm కాగా, ఇది 6,500rpm వద్ద లభిస్తుంది. టార్క్ కూడా మునుపటి కంటే 0.6Nm పెరిగింది.

Continues below advertisement

ఈ బైక్ మార్కెట్లోనే అత్యంత శక్తివంతమైన 125cc మోటార్‌సైకిల్ అని బజాజ్ చెబుతోంది. గతంలో ఈ గుర్తింపు బజాజ్ పల్సర్ N125కు ఉండేది. ఆ మోడల్‌ను ప్రస్తుతం నిలిపివేశారు.

కొత్త 5 స్పీడ్ గేర్‌బాక్స్

ఇంజిన్‌కు కొత్త 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. తక్కువ గేర్లలో మెరుగైన ట్రాక్షన్ లభించేలా దీనిని రూపొందించారు. దీంతో తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు బైక్ పనితీరు మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

కొత్త పల్సర్ 125లో పవర్ టు వెయిట్ నిష్పత్తి కూడా మెరుగుపడింది. దీంతో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని మునుపటి కంటే త్వరగా అందుకోవచ్చని బజాజ్ పేర్కొంది. అయితే 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఖచ్చితమైన సమయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs ట్రయంఫ్ స్పీడ్ 400: మీకు సరిగ్గా సరిపోయే బైక్ ఏది?

కొత్త ఫ్రేమ్, మోనోషాక్

ఈ బైక్‌లో కొత్త డైమండ్ టైప్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు, దృఢత్వాన్ని పెంచారు. ఇంజిన్‌ను ఫ్రేమ్‌లో భాగంగా ఉపయోగించారు. దీంతో రైడ్ స్థిరత్వం & హ్యాండ్లింగ్ మెరుగుపడతాయని బజాజ్ చెబుతోంది.

వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు. పాత తరహా సస్పెన్షన్ సెటప్‌తో పోలిస్తే మెరుగైన రైడ్ అనుభూతిని అందించేలా ఇది డిజైన్‌ చేశారు.

టెక్నాలజీ ఫీచర్లు అదుర్స్

కొత్త పల్సర్ 125లో 5 అంగుళాల TFT కన్సోల్‌ను అందించడం ప్రధాన మార్పుల్లో ఒకటి. ఇది, గతంలో, పల్సర్ N160 SSలో పరిచయమైంది. ఈ డిస్‌ప్లేలో Google Maps మిర్రరింగ్ & నావిగేషన్ సౌకర్యం ఉంటుంది. రైడర్లు వాహనానికి సంబంధించిన పత్రాలను కూడా ఇందులో సేవ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ & ఇన్సూరెన్స్ వివరాలను అవసరమైనప్పుడు సులభంగా యాక్సెస్ చేయవచ్చు. కాల్ & మెసేజ్ అలర్ట్‌లను డిస్‌ప్లేలో చూడొచ్చు. 

మ్యూజిక్ కంట్రోల్ సౌకర్యం కూడా ఉంది. రోడ్, రైన్ & స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను అందించారు.

ఇది కూడా చదవండి: రూ.50,000 డౌన్ పేమెంట్ చేసి Maruti Swift కారును తీసుకెళ్లండి, EMI పూర్తి వివరాలు

ట్రాఫిక్‌లో కొత్త టెక్

కొత్త పల్సర్ 125లో క్రాల్ టెక్‌ను కూడా అందించారు. KTM బైక్‌లలో కనిపించే ఈ టెక్నాలజీ వల్ల, తక్కువ వేగంతో బైక్‌ను నడిపేటప్పుడు అదనపు కంట్రోల్‌ అందిస్తుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో ఇది చాలా ఉపయోగపడుతుంది.

మూడు టాప్ వేరియంట్లలో ISG కూడా అందించారు. దీనివల్ల, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది, ఇంధనాన్ని ఆదా అవుతుంది. అవసరమైనప్పుడు ఇంజిన్ సైలెంట్‌గా స్టార్ట్ అవుతుంది.

ధర ఎంతంటే?

కొత్త బజాజ్ పల్సర్ 125 LCD వేరియంట్ ధర రూ.92,990. టాప్ స్పెక్ TFT వేరియంట్ ధర రూ.1.04 లక్షలు, ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

మొత్తంగా చూస్తే.. బజాజ్‌ కంపెనీ, క్లాసిక్ పల్సర్ డిజైన్‌ను కొనసాగిస్తూనే కొత్త పల్సర్ 125లో ఇంజిన్, గేర్‌బాక్స్, ఫ్రేమ్ & సస్పెన్షన్‌ను అప్‌డేట్ చేసింది. 5 అంగుళాల TFT కన్సోల్, Google Maps, రైడింగ్ మోడ్‌లు & క్రాల్ టెక్ వంటి ఫీచర్లు ఈ బైక్‌ను మరింత మోడ్రన్‌గా మార్చాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.