2023 Honda SP 125: హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా 2023 SP125 బైక్‌ను మనదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.85,131గా ఉంది. ఈ బైక్ ఇంజన్ ఇప్పుడు BS6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు. దీంతో ఈ బైక్ ధర ముందు వెర్షన్ మోడల్ కంటే ఇది రూ. 927 పెరిగింది.


రెండు వేరియంట్లలో అందుబాటులో
ఈ మోటార్‌సైకిల్ డ్రమ్, డిస్క్ రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. ఇందులో డ్రమ్ బ్రేక్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 85,131, డిస్క్ బ్రేక్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 89,131గా ఉంది.


ఇంజిన్ ఎలా ఉంది?
2023 హోండా SP 125లో 125 సీసీ PGM-FI ఇంజన్ అందించారు. ఇది గరిష్టంగా 10.88 PS పవర్‌ని, 10.9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 5 - స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది.


ఫీచర్స్ ఎలా ఉన్నాయి?
ఈ బైక్ డైమండ్ తరహా ఫ్రేమ్‌పై బేస్ అయి ఉంటుంది. మోటార్‌సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో ఐదు-దశల అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను అందించారు. ముందువైపు 240 ఎమ్ఎమ్ డ్రమ్ / 130 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది. వెనుకవైపు 130 ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ అందించారు. ఇది ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన 5 - స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది. బైక్‌లో ఎల్ఈడీ డీసీ హెడ్‌ల్యాంప్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, ఈక్వలైజర్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


ఐదు రంగులలో లభిస్తుంది
హోండా SP 125 మార్కెట్లో ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, పర్ల్ సైరన్ బ్లూ, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ వంటి రంగులు ఉన్నాయి.


ఇతర వాహనాలు కూడా అప్‌డేట్ అయ్యాయి
SP125 కాకుండా, కంపెనీ తన మొత్తం స్కూటర్లను H'ness CB350, CB350RS మోటార్‌సైకిళ్లను BS6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. అలాగే ఈ ఏడాది దీపావళికి ముందు మూడు కొత్త ICE మోడల్‌లను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విడుదల చేయబోతోంది.


TVS రైడర్‌తో పోటీ
ఈ బైక్ టీవీఎస్ రైడర్ 125తో పోటీపడుతుంది. ఈ బైక్ మూడు వేరియంట్లు, ఆరు రంగులలో లభిస్తుంది. దీనికి 124.8 సీసీ BS6 ఇంజన్ లభిస్తుంది. ఇది 11.2 bhp శక్తిని, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.91,356గా ఉంది.


ఇటీవలే కొత్త షైన్ 100 కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 100cc కమ్యూటర్ విభాగంలోకి హోండా ప్రవేశించింది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హోండా షైన్ 100లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, దాని కొత్త ఫ్యూయల్-ఇంజెక్ట్ 99.7 సీసీ ఇంజన్. ఇది 7.61 hp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 100 సీసీ సెగ్మెంట్‌లో పోటీని పెంచబోతోంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి వచ్చింది.