Mini Cooper SE Details: చూడటానికి చిన్న హ్యాచ్‌బ్యాక్.. కానీ ధర మాత్రం ఏకంగా రూ.53.9 లక్షలు! పాపులర్ లగ్జరీ కార్ల బ్రాండ్ "మినీ ఇండియా" (Mini India), కొత్త తరం Cooper SE ఎలక్ట్రిక్ కారును భారత్‌లో లాంచ్ చేసింది. డిసెంబర్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇంకా ప్రత్యేకంగా కనిపించే Paul Smith Edition ధర రూ.56.4 లక్షలు. కేవలం రెండు డోర్లతో వచ్చే ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ఇంత ఖరీదు పలకడానికి కారణాలేంటి?.
ముందుగా ఒక విషయం. ఈ కారు సాధారణ బడ్జెట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కాదు. పూర్తిగా ఫీచర్లతో నిండిపోయిన ప్రీమియం మోడల్. భారత్‌లో ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విదేశాల్లో పూర్తిగా తయారైన కారును (CBU) దిగుమతి చేస్తున్నారు. అంటే, లోకల్‌గా తయారు చేసే కార్లతో పోలిస్తే దిగుమతి ఖర్చులు కూడా ఈ కారు ధరను పెంచుతాయి. అంతేకాకుండా, ఇది రెండు డోర్ల ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. భారత మార్కెట్లో దీనికి నేరుగా పోటీ ఇచ్చే మోడళ్లు లేవు.
బ్యాటరీ, రేంజ్ ఎలా ఉన్నాయి?
మినీ కూపర్ SEలో 54.2kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, WLTP ప్రమాణాల ప్రకారం, 402km ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇందులో ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 218hp పవర్, 330Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారు 0 నుంచి 100kph వేగాన్ని అందుకోవడానికి కేవలం 6.7 సెకన్లు పడుతుంది. చిన్న హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, పనితీరు విషయంలో స్పోర్టీ లక్షణాలను అందిస్తోంది.
ఛార్జింగ్ విషయానికి వస్తే 11kW AC, 95kW DC ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. AC ఛార్జింగ్‌తో బ్యాటరీని 0 నుంచి 100 శాతం నింపడానికి 5.25 గంటలు పడుతుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం ఛార్జింగ్‌కు 30 నిమిషాలు సరిపోతుంది.
చిన్న సైజులో ప్రత్యేకమైన డిజైన్
మినీ కార్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గుండ్రటి హెడ్‌ల్యాంపులు, ప్రత్యేకమైన బాడీ డిజైన్ కొత్త కూపర్ SEలోనూ కొనసాగాయి. ఇందులో రౌండ్ LED హెడ్‌ల్యాంపులు, అష్టభుజి ఆకారపు గ్రిల్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, త్రిభుజాకార LED టెయిల్ ల్యాంపులు ఉన్నాయి. డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్ కూడా అందించారు.
కారు పొడవు 3,858mm, వెడల్పు 1,756mm, ఎత్తు 1,460mm. వీల్‌బేస్ 2,526mm. అంటే పెద్ద SUVల తరహా పరిమాణం కాకుండా, కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆకృతిలోనే ప్రీమియం డిజైన్‌ను అందిస్తోంది.
ఇది కూడా చదవండి: మూడేళ్ల నిరీక్షణకు తెర.. ఏపీ వాహనదారుల చేతిలోకి కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RC కార్డులు!
క్యాబిన్‌లో టెక్నాలజీ, లగ్జరీ
కారు లోపలి భాగంలోనూ ప్రత్యేకమైన డిజైన్ కనిపిస్తుంది. 3-స్పోక్ స్టీరింగ్ వీల్, 9.4-అంగుళాల సర్క్యులర్ OLED ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ప్రధాన ఆకర్షణలు. సెంటర్ కన్సోల్‌పై ఫిజికల్ కంట్రోల్స్ ఇచ్చారు. డ్యాష్‌బోర్డ్‌పై ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీని విస్తృతంగా ఉపయోగించారు.
హీటెడ్ స్టీరింగ్ వీల్, పానోరమిక్ గ్లాస్ రూఫ్, Level 2 ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు సీట్లు పవర్డ్ అడ్జస్టబుల్‌గా ఉంటాయి. వీటితో పాటు Harman Kardon సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా అందించారు.
అంటే ధరలో కేవలం బ్యాటరీ, మోటార్ మాత్రమే కాకుండా ప్రీమియం క్యాబిన్, అధునాతన టెక్నాలజీ, ప్రత్యేకమైన డిజైన్ కూడా భాగంగా ఉన్నాయి.
Paul Smith Editionలో ఏముంది?
బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ Paul Smithతో కలిసి రూపొందించిన ఎడిషన్‌ను కూడా మినీ ప్రత్యేకంగా అందిస్తోంది. దీని ధర రూ.56.4 లక్షలు. సాధారణ కూపర్ SEతో పోలిస్తే ఇందులో మెకానికల్ మార్పులు లేవు. ప్రధానంగా రంగులు, అలంకరణల్లోనే ప్రత్యేకత ఉంది.
Inspired White, Midnight Black, Statement Grey రంగుల్లో ఈ స్పెషల్ ఎడిషన్ లభిస్తుంది. వీటికి గ్రీన్, బ్లాక్ లేదా బాడీ కలర్ రూఫ్ ఆప్షన్లు ఉంటాయి. రూఫ్‌పై రంగురంగుల స్ట్రైప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 18-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్‌పై ‘Paul Smith’ లోగో ఉంటుంది.
క్యాబిన్‌లో సీట్లకు బ్లూ కాంట్రాస్ట్ స్టిచింగ్ ఇచ్చారు. డోర్లు తెరిచినప్పుడు ‘Hello’ అనే పదంతో వెల్కమ్ లైట్ ప్రొజెక్షన్ కనిపిస్తుంది. డోర్ సిల్ గార్డ్స్‌పై ‘Every day is a new beginning’ అనే సందేశం ఉంటుంది. ఫ్లోర్ మ్యాట్స్‌పై చేతితో గీసిన కుందేలు బొమ్మ, స్టీరింగ్ వీల్ కింది స్పోక్‌పై రంగురంగుల స్ట్రైప్స్ ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఒక కారంత పవర్‌తో Royal Enfield Himalayan 750 బైక్ లాంచ్, బుకింగ్స్ డిసెంబర్ 1 నుంచి ఓపెన్
రూ.53.9 లక్షలు పెట్టి కొనాలా?
మినీ కూపర్ SE ధర ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు దాని CBU దిగుమతి, ప్రత్యేకమైన రెండు డోర్ల డిజైన్, ప్రీమియం బ్రాండ్ గుర్తింపు, అధిక ఫీచర్లు, ఎలక్ట్రిక్ పనితీరు. 218hp పవర్, 330Nm టార్క్, 6.7 సెకన్లలో 0-100kph వేగం, 402km WLTP రేంజ్ వంటి అంశాలు దీనికి ప్రత్యేకతను ఇస్తున్నాయి.
ఈ కారు అందరికీ సరిపోయే సాధారణ కుటుంబ హ్యాచ్‌బ్యాక్ కాదు. ప్రత్యేకమైన డిజైన్, లగ్జరీ ఫీచర్లు, బ్రాండ్ అనుభవం కోరుకునేవాళ్లను లక్ష్యంగా చేసుకుంది. అందుకే దీని ధరను కేవలం కారు పరిమాణంతో పోల్చి చూడలేం.
మొత్తంగా చూస్తే.. కొత్త మినీ కూపర్ SE ధర రూ.53.9 లక్షలు కాగా, Paul Smith Edition ధర రూ.56.4 లక్షలు. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. డెలివరీలు డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
