Royal Enfield Himalayan 750 Details: ఔత్సాహికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ పెద్ద ఇంజిన్ బైక్ భారత మార్కెట్లోకి వచ్చింది, అదే.. హిమాలయన్ 750. ఇటలీలో జరిగిన EICMA 2026 ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా తొలిసారి పరిచయం చేసిన ఈ బైక్‌ను ఇప్పుడు భారత్‌లో లాంచ్ చేసింది. గోవాలోని వాగటర్లో జరుగుతున్న Motoverse కార్యక్రమం తొలి రోజున కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను ప్రదర్శించింది. ఈ మోటార్‌సైకిల్ ఇచ్చే 55hp పవర్, మన దేశంలోని చిన్న కార్లలోనూ చూడవచ్చు.
హిమాలయన్ 750 బుకింగ్స్, నవంబర్ 28 నుంచి Motoverse కార్యక్రమానికి హాజరైనవారి కోసం ప్రత్యేకంగా ప్రారంభం కానున్నాయి. మిగిలిన వాళ్లు డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ బైక్ మూడు వేరియంట్లలో, ఐదు రంగుల ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. అన్ని ధరలను చెన్నై ఎక్స్‌షోరూమ్ ప్రకారం ప్రకటించారు. ప్రస్తుతం వెల్లడించిన మూడు వేరియంట్ల ధరలూ ప్రారంభ ఆఫర్ ధరలేనని కంపెనీ తెలిపింది. అంటే, నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత ధరలు పెరుగుతాయి.
ధరలు, వేరియంట్ల వివరాలు
హిమాలయన్ 750లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి మధ్య ప్రధాన తేడాలు రంగులు, వీల్ రకాలు, అదనపు యాక్సెసరీల రూపంలో ఉంటాయి.
- బేస్ వేరియంట్: రూ.4.89 లక్షలు- మిడ్ వేరియంట్: రూ.5.14 లక్షలు- టాప్ వేరియంట్: రూ.6.29 లక్షలు
బేస్ వేరియంట్ Aztec Green, Tectonic Black రంగుల్లో లభిస్తుంది. ఇందులో అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వీటికి CEAT Crossrad AT టైర్లు అమర్చారు.
మిడ్ వేరియంట్ ధర రూ.5.14 లక్షలు. ఇందులో ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్ అందించారు. Viking Bronze, Siberia White రంగుల్లో ఈ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ వీల్స్‌కు Vredestein Centauro XR టైర్లు అమర్చారు.
టాప్ వేరియంట్ ధర రూ.6.29 లక్షలు. ఇది Antarctic Silver అనే ఒకే రంగులో లభిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన GIVI యాక్సెసరీలు ఉంటాయి. టాప్ బాక్స్, ప్యానియర్‌లు, హీటెడ్ గ్రిప్స్, హ్యాండ్‌గార్డ్స్, అల్యూమినియం స్కిడ్ ప్లేట్ వంటి పరికరాలు ఇందులో భాగంగా ఉన్నాయి.
ఈ యాక్సెసరీలను మిగతా నాలుగు రంగుల్లో లభించే తక్కువ ధర వేరియంట్లకు కూడా విడిగా అమర్చుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
743cc ఇంజిన్.. 55hp పవర్
హిమాలయన్ 750లో కొత్త 743cc పారలల్-ట్విన్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే వినియోగిస్తున్న 648cc ఇంజిన్‌కు భారీ మార్పులు చేసి, సామర్థ్యాన్ని పెంచి రూపొందించిన వెర్షన్.
ఈ ఇంజిన్ 7,000rpm వద్ద 55hp పవర్, 5,000rpm వద్ద 63Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3,500rpm నుంచే గరిష్ఠ టార్క్‌లో 90 శాతం అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ ఐడిల్ వేగం 1,300rpmగా ఉంది.
ఫీచర్లలోనూ ప్రత్యేకత
హిమాలయన్ 750ను ఇప్పటివరకు రాయల్ ఎన్ఫీల్డ్ రూపొందించిన అత్యంత ఫీచర్డ్ మోటార్‌సైకిల్‌గా కంపెనీ పేర్కొంటోంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్‌కు అనుగుణంగా పనిచేసే ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే మరింత శక్తిమంతమైన వెలుతురు అందించే కొత్త LED హెడ్‌ల్యాంప్‌ను అమర్చినట్లు కంపెనీ చెప్పింది. ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేకులు, అడ్జస్టబుల్ Showa సస్పెన్షన్ కూడా ఉన్నాయి.
మూడు వేరియంట్లలోనూ 19-అంగుళాల ముందు వీల్, 17-అంగుళాల వెనుక వీల్ ఉంటాయి. అయితే, వీల్ రకం, టైర్లలో వేరియంట్‌ను బట్టి మార్పులు ఉంటాయి.
ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ EVకి పోటీగా వస్తున్న Hyundai Ioniq P EV.. లాంగ్ రేంజ్, రెండు బ్యాటరీ ఆప్షన్లు, లెవల్ 2 ADAS
డెలివరీలు ఎప్పటి నుంచి?
హిమాలయన్ 750 బుకింగ్స్ నవంబర్ 28న Motoverse హాజరైనవారికి ప్రత్యేకంగా ప్రారంభమవుతాయి. దేశవ్యాప్తంగా ఇతర కొనుగోలుదారులకు డిసెంబర్ 1 నుంచి బుకింగ్స్ అందుబాటులోకి వస్తాయి. అయితే, డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా వెల్లడించలేదు.
ఇదే సమయంలో కంపెనీ రెండో 750cc మోటార్‌సైకిల్‌గా భావిస్తున్న Continental GT 750 గురించి కూడా వివరాలు ప్రకటించలేదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
