MG Majestor Features: ఎంజీ మోటార్, భారత్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా మేజెస్టర్‌ను ఆవిష్కరించింది. దీనిని గ్లోస్టర్ ఆధారంగానే రూపొందించినప్పటికీ, ఇప్పుడు మరింత ప్రీమియం లుక్, మెరుగైన కంఫర్ట్, గట్టి ఆఫ్‌రోడ్ సామర్థ్యాలతో మన ముందుకు వచ్చింది. ల్యాడర్ ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్, డీజిల్ ఇంజిన్ సెటప్ గ్లోస్టర్‌తో ఒకేలా ఉన్నా, ఫీచర్ల విషయంలో మేజెస్టర్ స్పష్టంగా ఒక మెట్టు పైన ఉంది. మరి, గ్లోస్టర్‌తో పోలిస్తే మేజెస్టర్‌లో ఉన్న 7 ముఖ్యమైన కొత్త ఫీచర్లు ఏమిటి?.
1) పెద్ద డిజిటల్ స్క్రీన్లు
మేజెస్టర్‌లో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 12.3 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. గ్లోస్టర్‌లో 12.3 అంగుళాల స్క్రీన్‌తో పాటు 8 అంగుళాల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మాత్రమే ఉంది. అంటే మేజెస్టర్‌లో డిజిటల్ అనుభవం మరింత ఆధునికంగా ఉంటుంది.
2) మసాజ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ సీట్లు
గ్లోస్టర్‌లో పవర్డ్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నా, మేజెస్టర్‌లో హీటింగ్, మసాజ్ ఫంక్షన్ కూడా ఇచ్చారు. హైవేల్లో ఎక్కువసేపు డ్రైవ్ చేసే వారికి ఇది అదనపు కంఫర్ట్ ఇస్తుంది.
3) డ్యూయల్ వైర్‌లెస్ చార్జర్లు & 12 స్పీకర్ JBL ఆడియో
మేజెస్టర్‌లో ముందు భాగంలో రెండు వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్లు ఉంటాయి. గేర్ సెలెక్టర్‌ను స్టీరింగ్ కాలమ్ వద్దకు మార్చడం వల్ల ఇది సాధ్యమైంది. అదనంగా 12 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. గ్లోస్టర్‌తో పోలిస్తే సౌండ్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది.
4) ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్
ఇది మేజెస్టర్‌లో అత్యంత కీలకమైన అప్‌డేట్. ముందు, మధ్య, వెనుక భాగాల్లో డిఫరెన్షియల్ లాక్స్ ఇచ్చారు. గ్లోస్టర్‌లో కేవలం రియర్ డిఫరెన్షియల్ లాక్ మాత్రమే ఉంది. కాబట్టి తక్కువ గ్రిప్ ఉన్న రోడ్లపై మేజెస్టర్ మరింత శక్తిమంతమైన ట్రాక్షన్ ఇస్తుంది.
5) 10 ఆఫ్‌రోడ్ డ్రైవ్ మోడ్‌లు
మేజెస్టర్‌లో మొత్తం 10 ఆఫ్‌రోడ్ డ్రైవ్ మోడ్‌లు ఉంటాయి. గ్లోస్టర్‌లో 7 మోడ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇసుక, బురద, రాళ్లపై డ్రైవ్ చేసే సమయంలో ఇది డ్రైవర్‌కు మెరుగైన నియంత్రణ ఇస్తుంది.
6) లో రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్
మేజెస్టర్‌లో లో రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్ ఉంటుంది. ఎత్తులు ఎక్కడం, కఠినమైన మార్గాల్లో తక్కువ స్పీడ్‌లో డ్రైవ్ చేసే సమయంలో టార్క్‌ను సమర్థంగా పంపిణీ చేస్తుంది. కంపెనీ ప్రకారం ఇది 810 మిల్లీమీటర్ల వరకు నీటిలో ప్రయాణించగలదు.
7) క్రాల్ మోడ్ (M Crawl)
క్రాల్ ఫంక్షన్ ద్వారా తక్కువ వేగంలో థ్రాటిల్, బ్రేకింగ్‌ను సిస్టమ్ స్వయంగా నియంత్రిస్తుంది. కఠినమైన మార్గాల్లో డ్రైవర్‌కు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
బుకింగ్ & లాంచ్ వివరాలు
ఎంజీ మేజెస్టర్ బుకింగ్స్ ప్రస్తుతం రూ.41,000తో ప్రారంభమయ్యాయి. ధరలను ఏప్రిల్‌లో ప్రకటిస్తారు. కస్టమర్ డెలివరీలు మే నుంచి ప్రారంభం అవుతాయి. లాంచ్ తరువాత (ధరలు ప్రకటించిన తర్వాత) ఇది గ్లోస్టర్ స్థానంలో ఎంజీ ఫ్లాగ్‌షిప్ ICE SUVగా నిలుస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.