లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్ లో తొలి ఎలక్రిక్ కారును లాంచ్ చేసింది. ఈక్యూఎస్ 580 4మేటిక్ పేరుతో మేడిన్ ఇండియా కారుగా దీనిని రూపొందించారు. ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ లో 15 నిముషాలు ఛార్జ్ చేస్తే 300 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఫుల్ ఛార్జ్ చేస్తే 850 కిలో మీటర్లకు పైగా జర్నీ చేయవచ్చని తెలిపింది. ఈ కారు ధర(ఎక్స్ షోరూంలో) రూ.1.55 కోట్లుగా కంపెనీ ఫిక్స్ చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెన్నైలో ఈ కారును ఆవిష్కరించారు. పుణె సమీపంలోని చకాన్ ప్లాంట్ లో ఈ కారు తయారు చేయబడింది. సూపర్ లగ్జరీ విభాగంలో ఈ కారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోబోతున్నట్లు కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్‌ఇప్పటికే భారత్‌లో ఈక్యూఎస్ 580 4మేటిక్ తయారీని మొదలు పెట్టింది. జర్మనీ బయట కేవలం భారత్‌లోనే ఈ లగ్జరీ ఈవీని తయారు చేస్తున్నది. అంతేకాదు.. కంపెనీ నుంచి భారత్‌లో రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఇదే. 14వ మేడిన్ ఇండియా మోడల్ గా ఈక్యూఎస్ 580 4 మేటిక్ గుర్తింపు పొందింది. ఈ కారు మెర్సిడెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించబడింది. ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ లుక్స్ పరంగా AMG ట్విన్ ని పోలి ఉంది. స్పోర్టీ లుక్ కోసం ఈ వెహికల్ లో అద్భుతమైన LED హెడ్ ల్యాంప్ లు ఏర్పాటు చేయబడ్డాయి. ముందు భాగంలో బ్లాక్ గ్రిల్‌ని కలిగి ఉంది. ఫ్రేమ్ లెస్ డోర్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ కారు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.
ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం ఈ కారు ఒకసారి చార్జింగ్ చేస్తే 857 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే కారుగా గుర్తింపు దక్కించుకుంది. ప్రతి యాక్సిల్ పై ఒక మోటార్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ భారీ స్థాయిలో శక్తిని ఇస్తుంది. 107.8 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 523 bhp శక్తిని, 856 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వాస్తవానికి బెంజ్ కంపెనీ ఈ కారును 2021లో తొలిసారిగా పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఈకారో మళ్లబోతున్నట్లు వెల్లడించింది. మెర్సిడెస్, ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై ఫోకస్ పెట్టింది. భారీగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నది.
Also Read: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?
Also Read: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?