Maruti Victoris Alternatives Competitive Cars: మారుతి సుజుకి, విక్టోరిస్‌ SUV ని తాజాగా లాంచ్‌ చేసింది. కాంపాక్ట్ SUV విభాగంలో సైజ్‌ చాలా ముఖ్యమైనది & విక్టోరిస్‌ ఈ విషయంలో కొంచెం ముందుంది. దీని పొడవు 4360 mm కాగా, గ్రాండ్ విటారా పొడవు 4354 mm & హ్యుందాయ్ క్రెటా పొడవు 4330 mm. అయితే.. వీల్‌బేస్‌లో క్రెటానే ముందుంది, దీని వీల్‌బేస్ 2610 mm. విక్టోరిస్‌ & గ్రాండ్ విటారా వీల్‌బేస్ 2600 mm. SUV వెడల్పు విషయానికి వస్తే, విక్టోరిస్‌ & గ్రాండ్ విటారా తలో 1795 mm వెడల్పుతో ఉండగా, క్రెటా 1790 mm వెడల్పు కలిగి ఉంది. దీని అర్ధం, విక్టోరిస్‌ & గ్రాండ్ విటారా SUVలు స్పేస్‌ & రోడ్‌ ప్రెజన్స్‌లో కొంచెం పైచేయితో ఉన్నాయి.

ఏ బండి ఎక్కువ శక్తిమంతం?పవర్‌ట్రెయిన్‌ విషయంలో హ్యుందాయ్ క్రెటా అత్యంత శక్తిమంతమైనది. ఇది 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ & 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. పవర్ అవుట్‌పుట్ 115 HP నుంచి 160 HP వరకు ఉంటుంది. గేర్‌బాక్స్ ఎంపికలలో CVT, DCT & టార్క్ కన్వర్టర్ ఉన్నాయి.

మరోవైపు, మారుతి విక్టోరిస్‌ & గ్రాండ్ విటారాలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, 103 HP నుంచి 116 HP (హైబ్రిడ్) వరకు పవర్‌తో లభిస్తుంది. వీటిలో మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు రెండూ అందుబాటులో ఉన్నాయి. విక్టోరిస్‌ & గ్రాండ్ విటారాలో e-CVT తో పాటు బలమైన హైబ్రిడ్ & AWD ఎంపిక కూడా ఉంది. అంటే.. శక్తిలో క్రెటా ముందుంది, టెక్నాలజీ & హైబ్రిడ్ ఎంపికలలో మారుతి SUVలు మరింత పొదుపుగా & అధునాతనంగా కనిపిస్తాయి.

ఏది మెరుగైన మైలేజీ ఇస్తుంది?ఇంధన సామర్థ్యంలో విక్టోరిస్‌ అన్నింటికంటే ముందుంది. దీని బలమైన హైబ్రిడ్ ఇంజిన్ లీటరుకు 28.65 కి.మీ. మైలేజీని ఇస్తుంది. స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ 21 కి.మీ./లీటరు & AWD వెర్షన్ 19 కి.మీ./లీటరు మైలేజీని ఇస్తుంది. గ్రాండ్ విటారా హైబ్రిడ్ వెర్షన్ 27.79 కి.మీ./లీటరు మైలేజీని ఇస్తుంది, ఇది విక్టోరిస్‌ కంటే కొంచెం తక్కువ. దీని ఇతర వేరియంట్లు కూడా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. హ్యుందాయ్‌ క్రెటా డీజిల్ వెర్షన్ 17.4 కి.మీ./లీటరు నుంచి 21.8 కి.మీ/లీటరు వరకు మైలేజీ ఇస్తుంది. మీరు, పొదుపు చేసే SUVని కోరుకుంటే, విక్టోరిస్‌ హైబ్రిడ్ ఉత్తమ ఎంపిక.

రేటులో ఏది బెటర్‌?హ్యుందాయ్ క్రెటా ధర రూ.11.11 లక్షల నుంచి రూ.20.9 లక్షల వరకు ఉంటుంది. గ్రాండ్ విటారా ధర రూ.11.4 లక్షల నుంచి రూ.20.6 లక్షల వరకు ఉంటుంది. విక్టోరిస్‌ ధర ఇంకా నిర్ణయించలేదు, కానీ గ్రాండ్ విటారా కంటే ఇది కొంచెం చౌకగా ఉంటుందని భావిస్తున్నారు. ధర & మైలేజీని పరిశీలిస్తే, ఎక్కువ పొదుపు కోరుకునే కస్టమర్లకు విక్టోరిస్‌ బెటర్‌ ఆప్షన్‌ అవుతుంది. పవర్ & ప్రీమియం కోరుకునే వారికి క్రెటా ఇప్పటికీ అత్యంత ఇష్టమైన SUV. అదే సమయంలో, గ్రాండ్ విటారా ఫీచర్లు & బ్యాలెన్స్‌డ్‌ పెర్ఫార్మెన్స్‌తో విక్టోరిస్‌‌కు దగ్గరగా ఉంది.