UP villagers beat up Google Maps team:  ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని బిర్హార్ గ్రామంలో గూగుల్ మ్యాప్స్ సర్వే బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  గూగుల్ మ్యాప్స్ కోసం రోడ్లను మ్యాపింగ్ చేసేందుకు వచ్చిన ఈ బృందాన్ని గ్రామస్తులు దొంగలుగా అనుమానించి దాడికి దిగారు. ఈ సంఘటనలో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గూగుల్ మ్యాప్స్ సర్వే  పనిని టెక్ మహీంద్రాకు ఔట్ సోర్స్చేశారు.  ఈ బృందం, బిర్హార్ గ్రామంలో రాత్రి వేళలో కెమెరా-మౌంటెడ్ వాహనంతో రోడ్లను ఫోటోలు తీస్తూ మ్యాపింగ్ చేస్తోంది. ఈ వాహనంపై రూఫ్‌టాప్ కెమెరా ఉండటం గ్రామస్తులకు అనుమానాస్పదంగా అనిపించింది. గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో రాత్రి వేళల్లో కార్లలో వచ్చే వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు జరిగాయి. దీంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు.

గూగుల్ మ్యాప్స్ బృందం గ్రామంలో ఫోటోలు తీస్తుండగా, గ్రామస్తులు వారి వాహనాన్ని అడ్డుకొని ప్రశ్నించారు. వారు చోరీ కోసం సమాచారం సేకరిస్తున్నారని అనుమానించి, కొంతమంది గ్రామస్తులు  సభ్యులపై దాడి చేశారు. పరిస్థితి తీవ్రమవుతుండగా, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రెండు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీస్ స్టేషన్‌లో గూగుల్ మ్యాప్స్ బృందం తాము దొంగలు కాదని, గూగుల్ మ్యాప్స్ అప్‌డేట్ కోసం రాష్ట్ర డీజీపీ అనుమతితో సర్వే చేస్తున్నామని వివరించారు.  స్థానికులు కూడా తమ గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనాల కారణంగా అప్రమత్తంగా ఉన్నామని, అపరిచిత వాహనాలపై అనుమానం కలిగిందని పోలీసులకు వివరించారు. అసలు విషయం తెలిసిన తర్వాత గ్రామస్తులు శాంతించారు.   గూగుల్ మ్యాప్స్ బృందంతో పాటు గ్రామస్తులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఎటువంటి చట్టపరమైన సమస్య లేకుండా గ్రామస్తులను పంపించారు.                                              

గూగుల్ మ్యాప్స్ సర్వే బృందం అనుమతితో పని చేస్తోందని తెలిసిందని అందుకే ఎలాంటి కేసులు నమోదు చేయలేదని పోలీసులు ప్రకటించారు.  స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా ఇలాంటి దాడులను నివారించవచ్చని పోలీసులు సలహాలు ఇచ్చారు.