Maruti Shift : అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం కొత్త మోడల్స్ పరిచయం చేస్తుంది. అలాగే ఉన్న మోడల్స్ ను తాజా సాంకేతికతకు అనుగుణంగా అప్ డేట్ చేస్తుంటుంది. భారత మార్కెట్‌లో మారుతి సుజుకీకి చెందిన అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్ బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి స్విఫ్ట్ కి సంబంధించి తాజా అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో కూడిన స్విఫ్ట్ కారును భారత్ రోడ్లపై పరీక్షిస్తుండగా గుర్తించారు. స్విఫ్ట్ హైబ్రిడ్ భారతదేశంలోని ఢిల్లీ NCR ప్రాంతంలో టెస్టింగ్ చేస్తున్న దృశ్యాలు వెల్లడయ్యాయి. భారతీయ స్విఫ్ట్ మోడల్‌కి దాదాపు సమానంగా కనిపించే ఈ హైబ్రిడ్ మోడల్‌కి ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్, టెక్నాలజీ అప్ డేట్స్ ఉన్నాయి.
డిజైన్, స్పెషాలిటీ
తాజా స్విఫ్ట్ హైబ్రిడ్ మోడల్ కు నల్లరంగులో స్పై చేశారు. ముందు, వెనుక బంపర్లపై తేలికపాటి మార్పులు గమనించవచ్చు. ఫ్రంట్ గ్రిల్‌పై రాడార్ మాడ్యూల్ కనపడుతుంది. కిందివైపున సిల్వర్ ఫినిష్ కూడా కనిపిస్తుంది. ఇది మునుపటి స్పై యూనిట్ల కంటే స్పోర్టియర్ డిజైన్‌ను సూచిస్తుంది. వాహనం పక్క భాగంలో విశిష్ట అల్లాయ్ వీల్స్ డిజైన్ గమనించవచ్చు. ఇది గ్లోబల్ స్విఫ్ట్ మోడల్‌లోనిది. మరింత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఇది వెనుక డిస్క్ బ్రేక్‌లు కలిగి ఉంది. ఇవి జపాన్-స్పెక్ (JDM) మోడల్‌కి ప్రత్యేకమైనవి. ఆస్ట్రేలియా వంటి ఇతర మార్కెట్లలో అమ్మకానికి ఉన్న స్విఫ్ట్ హైబ్రిడ్‌లో కూడా వీటి లభ్యత లేదు.
ADAS ప్రత్యేకతలు
ADAS ఫీచర్లు రోడ్డు భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సిస్టమ్ సాధారణంగా క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ వంటి ఆధునిక టెక్నాలజీని అందిస్తుంది. మారుతి స్విఫ్ట్‌కు ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తే:
* భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయి.
* 5-స్టార్ NCAP రేటింగ్ పొందే అవకాశం పెరుగుతుంది.
* ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉండగలదు.
ADAS సాంకేతికత , హైబ్రిడ్ టెక్నాలజీ
జపాన్-స్పెక్ స్విఫ్ట్‌లో భారతీయ మోడల్‌తో పోలిస్తే ADAS సాంకేతికత (Advanced Driver Assistance Systems) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
జేడీఎం స్విఫ్ట్ హైబ్రిడ్‌లో 1.2L Z12E పవర్‌ట్రైన్ కలిగి ఉండగా, ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ISG (ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్) ద్వారా పవర్ అందుకుంటూ, ఈ టెక్నాలజీ ఇంధన సమర్థతను గణనీయంగా పెంచుతుంది. ఈ మోడల్ 24.5 కిమీ/లీటర్ మైలేజిని అందించగలదు.
భారత మార్కెట్‌లో అందుబాటులోకి రాకపోవచ్చు?
స్విఫ్ట్ హైబ్రిడ్‌లో వెనుక డిస్క్ బ్రేక్‌ల వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇవి భారతీయ మార్కెట్‌లో అందుబాటులోకి రాకపోవచ్చని అంచనా. ఇవి ప్రత్యేకంగా జపాన్‌కు ఎగుమతి చేయబడే మోడల్ కావచ్చు. ఇప్పటికే బలెనో, ఫ్రాంక్స్ వంటి మోడల్స్‌ను భారత్ నుండి జపాన్‌కు ఎగుమతి చేస్తోంది. స్విఫ్ట్ హైబ్రిడ్ కూడా జపాన్ మార్కెట్‌కు మూడవ ఎగుమతి మోడల్‌గా నిలవనుంది.
మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్ జపాన్ మార్కెట్ కోసం ప్రాథమికంగా డిజైన్ చేసింది కంపెనీ. భారతదేశం వంటి ఇతర మార్కెట్లలో ADAS, హైబ్రిడ్ టెక్నాలజీ వాహనాలపై ఆసక్తి పెరుగుతోందని స్పష్టమవుతోంది. మారుతి సుజుకీ భవిష్యత్ ఆవిష్కరణలను సూచించే ఈ మోడల్, హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు భద్రతా ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల సాధించిన వాహనంగా నిలవనుంది.