Maruti Suzuki to Launch Indias First E100 Flex Fuel Car: భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం (Environment Day) సందర్భంగా ఢిల్లీలో జరగబోయే ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌లో మారుతి సుజుకి తన సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex Fuel) వాహనాన్ని లాంచ్ చేయనుంది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గ్రీన్ ఫ్యూయల్స్ వైపు మొగ్గు చూపాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. జూన్ 5, 2026 న మారుతి సుజుకి కంపెనీ 100 శాతం ఇథనాల్ (E100) బ్లెండ్స్ తో నడిచే ఈ సరికొత్త వాహనాన్ని అధికారికంగా ప్రదర్శించనుంది.
దేశంలోనే మొదటి 4W ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్
ప్రస్తుతం భారతదేశంలో లభించే ఫోర్ వీలర్లలో ఒక్కటి కూడా పూర్తి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్ తో అందుబాటులో లేదు. రాబోయే మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్, దేశంలోనే ఈ100 (ఇథనాల్ 100 శాతం) ఇంధన కలయికతో నడిచే మొదటి ఫోర్ వీలర్ వెహికల్‌గా రికార్డు సృష్టించనుంది. దీని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్యూయల్ స్టోరేజ్, డెలివరీ, ఇగ్నిషన్ సిస్టమ్‌లను ఇంజన్ లో అమర్చారు. గత ఏడాది టోక్యోలో జరిగిన జపాన్ మొబిలిటీ షో 2025 లో సుజుకి కంపెనీ ఫ్రాంక్స్ (Fronx) సబ్ 4ఎమ్ కూపే ఎస్‌యూవీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను ప్రదర్శించింది. అయితే అప్పట్లో చూపించిన మోడల్ కేవలం ఈ85 (85 శాతం ఇథనాల్) బ్లెండ్స్ కు మాత్రమే సపోర్ట్ చేసేలా ఉంది. ఇప్పుడు రాబోయే కొత్త మోడల్ నేరుగా ఈ100 టెక్నాలజీతో రానుంది.
Read Also: AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి
స్పెషల్ ఇంజన్ టెక్నాలజీ..
సాధారణ పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ కు తేమను (Moisture) పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే హై లెవెల్ ఇథనాల్ కాన్సెంట్రేషన్లను తట్టుకోవడానికి వీలుగా కార్లలో స్పెషల్లీ డిజైన్డ్ ఫ్యూయల్ సిస్టమ్స్, యాంటీ రస్ట్ ఇంజన్ కాంపోనెంట్స్ అవసరమవుతాయి. మారుతి సుజుకి ఈ ప్రోటోటైప్ ఇంజన్ ను పక్కాగా అప్‌గ్రేడ్ చేసింది. నితిన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం, ఇంధనాల్లో ఇథనాల్ శాతాన్ని పెంచడం వల్ల తక్కువ ఖర్చుతో, కాలుష్య రహితంగా స్వదేశీ ఇంధన ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఇది అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గుల నుండి భారత్‌కు రక్షణ ఇస్తూ, మన దేశ ముడి చమురు దిగుమతుల (ప్రస్తుతం 87 శాతం) భారాన్ని భారీగా తగ్గిస్తుంది.
ఆటోమొబైల్ రంగంలో తదుపరి అడుగు
భారత మార్కెట్లో టయోటా, టాటా, మహీంద్రా, సుజుకి సహా మొత్తం 12 కంపెనీలు ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ వాహనాలను ప్రదర్శించాయి. హోండా, సుజుకి వంటి కంపెనీల వల్ల టూ వీలర్ సెగ్మెంట్‌లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు వచ్చాయి. స్కూటర్లు, కార్లు, ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్ల సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) వాడకం పెరగడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ20 పెట్రోల్ ప్రమాణాలను ఖరారు చేయగా, తదుపరి రోడ్‌మ్యాప్ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పటికే ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధనాల స్పెసిఫికేషన్లను జారీ చేసింది.
