Maruti Suzuki 2026 Launches: ఇటీవలి కాలంలో కొత్త కార్ల లాంచ్‌ల విషయంలో కొంచెం నెమ్మదిగా ఉన్న Maruti Suzuki, 2026లో మాత్రం మళ్లీ దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది. 2025లో కేవలం ఒక్క కొత్త కారు మాత్రమే ప్రవేశపెట్టిన మారుతి, వచ్చే ఏడాది నాలుగు కొత్త లేదా అప్‌డేటెడ్ మోడళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ కార్లు, ఒక ఫ్లెక్స్‌ ఫ్యూయల్ వాహనం, ఒక ఫేస్‌లిఫ్ట్ SUV ఉండటం విశేషం.

Continues below advertisement

Maruti Suzuki e Vitara – తొలి ఎలక్ట్రిక్ SUV

లాంచ్ సమయం: జనవరి 2026

Continues below advertisement

భారత్‌లో మారుతి నుంచి రానున్న తొలి పూర్తి ఎలక్ట్రిక్ కారు e Vitara. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోడల్‌. మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లోకి వచ్చే ఈ ఎలక్ట్రిక్ కారు... Mahindra BE 6, Hyundai Creta Electric, MG ZS EV, Tata Curvv EV వంటి మోడళ్లకు ప్రత్యక్ష పోటీగా నిలుస్తుంది.

e Vitaraలో 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ఫ్రంట్‌లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్‌తో ఇది పని చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. భద్రత పరంగా కూడా ఇది ముందంజలోనే ఉంది. ఇప్పటికే భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించడం గమనార్హం.

Maruti Suzuki Fronx Flex Fuel

లాంచ్ సమయం: 2026 రెండో భాగం

ఎలక్ట్రిక్ కార్లతో పాటు, మారుతి మరో కీలక అడుగు వేయనుంది. అదే ఫ్లెక్స్‌ ఫ్యూయల్ ఇంజిన్. ఇది తొలిసారిగా Fronx మోడల్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఇంజిన్ ప్రత్యేకత ఏంటంటే, E85 వరకు ఎథనాల్–పెట్రోల్ మిశ్రమాన్ని ఉపయోగించగలగడం. అంటే 85 శాతం ఎథనాల్, 15 శాతం పెట్రోల్‌తో నడుస్తుంది.

డిజైన్‌, ఫీచర్ల పరంగా Fronx Flex Fuel ప్రస్తుత Fronx మోడల్‌లానే ఉండే అవకాశం ఉంది. కానీ ఇంధన ఖర్చు తగ్గడం, పర్యావరణానికి మేలు చేయడం వంటి అంశాల్లో ఇది వినియోగదారులకు కొత్త ప్రత్యామ్నాయంగా మారనుంది.

Maruti Suzuki ‘YMC’ ఎలక్ట్రిక్ MPV

లాంచ్ సమయం: 2026 చివర్లో

2026లో మారుతి నుంచి రానున్న రెండో ఎలక్ట్రిక్ వాహనం ఒక MPV. దీనికి ప్రస్తుతం ‘YMC’ అనే కోడ్ నేమ్ ఉంది. ఇది e Vitara ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారవుతుంది. మారుతి నుంచి వచ్చే తొలి పూర్తి ఎలక్ట్రిక్ MPV ఇదే.

ఈ మోడల్‌ను Ertiga, XL6 కంటే పై సెగ్మెంట్‌లో ఉంచనున్నారు. అందువల్ల Kia Carens Clavis EV వంటి కార్లతో పోటీ పడే అవకాశం ఉంది. e Vitara లాగే ఇందులో కూడా 49kWh, 61kWh బ్యాటరీలు ఉండొచ్చు. రేంజ్ పరంగా 500 నుంచి 550 కిలోమీటర్లు వచ్చే అవకాశముంది.

Maruti Suzuki Brezza Facelift

లాంచ్ సమయం: 2026 మధ్యలో (అంచనా)

రెండో తరం Brezza ఇప్పుడు నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో మారుతి దీనికి ఒక ఫేస్‌లిఫ్ట్ తీసుకురానుంది. ఇప్పటికే టెస్ట్ మ్యూల్స్ రోడ్డుపై కనిపించాయి. డిజైన్‌లో స్వల్ప మార్పులు, లోపల కొంత కొత్త ఫీచర్లు జోడించే అవకాశం ఉంది.

ఇంజిన్ పరంగా మాత్రం పెద్ద మార్పులు ఉండే సూచనలు లేవు. ప్రస్తుతం ఉన్న 103hp 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్‌, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కొనసాగుతాయి. అలాగే CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ముగింపు

2026లో Maruti Suzuki ఎలక్ట్రిక్, ఫ్లెక్స్‌ ఫ్యూయల్, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లతో అన్ని వర్గాల యూజర్లను టార్గెట్‌ చేసే ప్లాన్‌లో ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల వైపు మారుతున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మారుతి వేసే ఈ అడుగులు, వచ్చే కొన్ని సంవత్సరాల్లో కంపెనీ స్థితిని మరింత బలపరిచే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.