Maruti Fronx vs Kia Sonet Comparison: మన దేశంలో ఇప్పుడు కాంపాక్ట్ SUV ట్రెండ్ నడుస్తోంది, ప్రతి నెలా ఈ విభాగంలోని వెహికల్స్ వేల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయి. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లోనే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఉంది, కియా బ్రాండ్‌లోని సోనెట్ ఉంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్ వైపు చూస్తున్న కస్టమర్లను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు పవర్‌ఫుల్ ఫీచర్లు, విభిన్న ఇంజిన్ ఆప్షన్స్ & అందుబాటు ధరలతో ఊరిస్తున్నాయి. ఇక్కడొచ్చే ప్రశ్న ఏమిటంటే, ఫీచర్లు, మైలేజ్ & ధర పరంగా ఏ కారు కొనడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది?.
మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ఫీచర్లుMaruti Fronx లో కంపెనీ చాలా ప్రీమియం ఫీచర్లను అందించింది. వాటిలో... LED హెడ్‌లైట్లు, DRLs, ఆటో హెడ్‌ల్యాంప్, LED కనెక్టెడ్ టెయిల్‌లైట్, వెనుక వైపర్ & వాషర్, షార్క్ ఫిన్ యాంటెన్నా & స్కిడ్ ప్లేట్ వంటి ఎక్స్‌టీరియర్ కాంపొనెంట్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో - డ్యూయల్ టోన్ డిజైన్, ఫాబ్రిక్ సీట్లు, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ & ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు ఉన్నాయి. ఇంకా.. 22.86 సెం.మీ. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అర్కామిస్ ఆడియో సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హెడ్-అప్ డిస్‌ప్లే & 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఈ కారును చాలా ఆకర్షణీయంగా మార్చాయి.
కియా సోనెట్ ఫీచర్లుKia Sonet ఫీచర్ల పరంగా మరింత ప్రీమియం కారు. ఇందులో LED లైట్లు, డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ & 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, BOSE ఆడియో సిస్టమ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ & ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి. వీటితో పాటు, రియర్ AC వెంట్లు & ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటివి ఈ ఫోర్‌వీలర్ ప్రయాణీకులకు మరింత విలాసవంతమైన అనుభూతిని ఇస్తాయి.
ఇంజిన్ & మైలేజ్మారుతి ఫ్రాంక్స్ మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లో దొరుకుతుంది, అవి - 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ CNG & 1.0-లీటర్ టర్బో పెట్రోల్. ఇది మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్లతో పని చేస్తుంది. మారుతి ఫ్రాంక్స్ మైలేజ్ విషయానికి వస్తే.. ఇది 20.02 kmpl నుంచి 22.89 kmpl వరకు ఇస్తుంది.
కియా సోనెట్ పవర్‌ట్రెయిన్స్‌ను చూస్తే.. ఇది 1.2-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికల్లో అందుబాటులో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT & 6-స్పీడ్ ఆటోమేటిక్ వంటి అనేక ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కలిగి ఉంది, మరింత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. కియా సోనెట్ మైలేజ్, ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్ రకాన్ని బట్టి మారుతుంది, ఇది 18.4 kmpl నుంచి 24.1 kmpl వరకు ఉంటుంది. డీజిల్ వేరియంట్లలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లు 24.1 kmpl & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు 19 kmpl సాధిస్తాయి. పెట్రోల్ వేరియంట్లలో మాన్యువల్ & ఆటోమేటిక్ రెండూ వరుసగా 18.4 kmpl & 18.3 kmpl మైలేజీ ఇస్తాయి.
ధరలుఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో మారుతి ఫ్రాంక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 7.58 లక్షలు కాగా, దాని టాప్ వేరియంట్ 13.06 లక్షల వరకు ఉంటుంది. కియా సోనెట్ ప్రారంభ ధర 7.99 లక్షలు & దాని టాప్ వేరియంట్ రూ. 14.99 లక్షల వరకు లభిస్తుంది.
ఎవరు ఏ కారు కొంటే బాగుంటుంది?మెరుగైన మైలేజ్ & బడ్జెట్ ఫ్రెండ్లీ SUV కోరుకుంటే, మారుతి ఫ్రాంక్స్ మీకు మంచి ఎంపిక. ప్రీమియం ఫీచర్లు, ఎక్కువ ఇంజన్ ఆప్షన్లు & లగ్జరీ అనుభవంపై దృష్టి పెడితే కియా సోనెట్ మెరుగ్గా ఉంటుంది. ఈ వాహనాల్లో ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అని స్పష్టంగా చెప్పలేము.