Maruti e-Vitara Launch Date And Price Details: భారత మార్కెట్లో అత్యంత పాపులర్‌ బ్రాండ్‌ మారుతి సుజుకీ, తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఈ ఏడాది సెప్టెంబర్‌ 3వ తేదీన (03 September 2025) విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి, ఈ లాంచ్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేశారు, సాంకేతిక కారణాలు చెప్పి ఆలస్యం చేస్తూ వచ్చారు. ఈ ఎలక్ట్రిక్ SUV కోసం అనధికారిక బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి & ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో మాత్రమే బుకింగ్స్‌ అనుమతిస్తున్నారు.  ఇకపై అధికారికంగా బుకింగ్స్‌కు కంపెనీ సిద్ధమవుతోంది. 

మధ్యతరగతి ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న ఈ మారుతి సుజుకి ఇ-విటారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Maruti e-Vitara ex-showroom price) రూ. 17-18 లక్షలు ఉండవచ్చు. దీని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 25 లక్షల వరకు ఉండవచ్చు. 

మారుతి ఇ-విటారా మోడల్‌ను 'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025'లో ప్రదర్శించారు & దీనికంటే ముందు, 'ఆటో ఎక్స్‌పో 2023'లో కాన్సెప్ట్ మోడల్ EVXగా పరిచయం చేశారు. ఈ SUVని గుజరాత్‌లోని సుజుకి మోటార్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తారు, భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, జపాన్ & యూరప్‌ సహా ఇతర దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తారు.

మారుతి సుజుకి, ఈ-విటారాను మొత్తం 10 ఆకర్షణీయమైన రంగుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది, వీటిలో 6 మోనో-టోన్ & 4 డ్యూయల్-టోన్ కలర్స్‌ ఉన్నాయి. మోనో-టోన్ కలర్‌ ఆప్షన్స్‌లో - నెక్సా బ్లూ, స్ల్పెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, బ్లూయిష్ బ్లాక్ & ఒపులెంట్ రెడ్ వంటి రంగులు ఉన్నాయి.

మారుతి సుజుకి ఇ-విటారా ఫీచర్లుకంపెనీ, e-Vitaraను ప్రీమియం కారుగా పరిచయం చేయడానికి కారులో హెడ్‌లైట్లు, DRLs & టెయిల్‌ల్యాంప్స్‌ అన్నింటికీ పూర్తిగా LED సెట్‌ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ SUVకి 18-అంగుళాల చక్రాలు బిగిస్తారు. యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్ అందించవచ్చు, ఇది ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని పెంచుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి డిజిటల్ ఫీచర్లు యాడ్‌ చేస్తారు. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.

ఇ-విటారా భద్రత సాంకేతికతలుమారుతి ఇ-విటారా భద్రత పరంగా ఏమాత్రం తక్కువ కాదు. ఈ కారుకు లెవల్ 2 ADAS టెక్నాలజీని అనుసంధానిస్తున్నారు. ఈ ప్యాక్‌లో - లేన్ కీప్ అసిస్ట్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. డ్రైవర్ & ప్రయాణీకుల భద్రత కోసం ఈ SUV 7 ఎయిర్‌బ్యాగ్‌ల ఫెసిలిటీ కలిగి ఉంటుంది. ఇతర భద్రత లక్షణాలలో- బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి.

Hyundai Creta EV & MG ZS EV వంటి ఎలక్ట్రిక్ SUVలతో మారుతి సుజుకి ఇ-విటారా పోటీ పడుతుందని భావిస్తున్నారు.