Maruti Ciaz safety rating: భారత మార్కెట్‌లో ఉన్న మారుతి సియాజ్‌ కారు, ప్రయాణీకుల భద్రత విషయంలో పెద్ద షాక్‌ ఇచ్చింది. రోడ్‌ సేఫ్టీ సంస్థ 'గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌' (Global NCAP) నిర్వహించిన క్రాష్‌ టెస్టుల్లో, ఈ మిడ్‌ సైజ్‌ సెడాన్‌కు అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో కేవలం 1 స్టార్‌, చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో 3 స్టార్‌ రేటింగ్‌ మాత్రమే లభించింది.

Continues below advertisement

అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ వివరాలు

మారుతి సియాజ్‌కు అడల్ట్‌ భద్రతలో మొత్తం 34 పాయింట్లకు గానూ 20.86 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఫ్రంటల్‌ ఆఫ్‌సెట్‌ డీఫార్మబుల్‌ బ్యారియర్‌ టెస్టులో ఈ కారు 16కు గాను 7.362 పాయింట్లు సాధించింది. డ్రైవర్‌ హెడ్‌కు మంచి రక్షణ లభించినప్పటికీ, ఛెస్ట్‌, తొడలు ప్రాంతాల్లో రక్షణ పరిమితంగా ఉందని గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ వెల్లడించింది. ముఖ్యంగా డ్రైవర్‌ పాదాల ప్రాంతానికి రక్షణ చాలా బలహీనంగా ఉందని పేర్కొంది.

Continues below advertisement

సైడ్‌ మొబైల్‌ డీఫార్మబుల్‌ బ్యారియర్‌ టెస్టులో 16కు గాను 12.494 పాయింట్లు వచ్చాయి. ఇక్కడ డ్రైవర్‌ ఛెస్ట్‌ భాగానికి రక్షణ బలహీనంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ లేకపోవడంతో సైడ్‌ పోల్‌ ఇంపాక్ట్‌ టెస్ట్‌ను గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ నిర్వహించలేదు. అంతేకాదు.. కార్‌ బాడీషెల్‌, ఫుట్‌వెల్‌ ఏరియా అస్థిరంగా ఉందని, భవిష్యత్‌లో మరింత లోడ్‌ను తట్టుకునే సామర్థ్యం లేదని కూడా వెల్లడించింది.

చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ ఎలా ఉంది?

చైల్డ్‌ సేఫ్టీ విషయంలో మారుతి సియాజ్‌ 49 పాయింట్లకు గానూ 28.57 పాయింట్లు సాధించింది. డైనమిక్‌ టెస్టుల్లో మాత్రం పూర్తి మార్కులు రావడం గమనార్హం. 18 నెలలు, 3 ఏళ్ల చిన్నారుల డమ్మీలకు ఫ్రంటల్‌, సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్టుల్లో పూర్తి రక్షణ లభించింది. డైనమిక్‌ స్కోర్‌ 24/24.

అయితే, చైల్డ్‌ రెస్ట్రెయింట్‌ సిస్టమ్‌ ఇన్‌స్టాలేషన్‌లో కేవలం 4.57/12 పాయింట్లు, వెహికల్‌ అసెస్‌మెంట్‌లో 0/13 పాయింట్లు మాత్రమే వచ్చాయి. వెనుక సెంటర్‌ సీటుకు సరైన చైల్డ్‌ సీట్‌ అమరిక విఫలం కావడం, అన్ని సీట్లకు 3 పాయింట్‌ సీట్‌బెల్ట్స్‌ లేకపోవడం, రియర్‌వర్డ్‌ ఫేసింగ్‌ చైల్డ్‌ సీట్‌ ఉపయోగించినప్పుడు ముందు ప్యాసింజర్‌ ఎయిర్‌బ్యాగ్‌ను డిసేబుల్‌ చేసే ఆప్షన్‌ లేకపోవడం ప్రధాన లోపాలుగా గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ పేర్కొంది.

సేఫ్టీ ఫీచర్లు ఉన్నా రేటింగ్‌ ఎందుకు తక్కువ?

మారుతి సియాజ్‌లో స్టాండర్డ్‌గా 2 ఎయిర్‌బ్యాగ్స్‌, ESC, ISOFIX చైల్డ్‌ సీట్‌ మౌంట్స్‌, సీట్‌బెల్ట్‌ రిమైండర్స్‌ ఉన్నాయి. అయినప్పటికీ, కారు నిర్మాణం బలహీనంగా ఉండటం వల్లే ఈ తక్కువ రేటింగ్‌ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యర్థి కార్లతో పోలిక

ఈ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ విర్టస్‌ కార్లు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌లో అడల్ట్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్ రెండింట్లోనూ 5 స్టార్‌ రేటింగ్‌ సాధించాయి. వీటితో పోలిస్తే, మారుతి సియాజ్‌, ప్రయాణీకుల భద్రత విషయంలో చాలా వెనుకబడింది.

ధర, మార్కెట్‌ భవిష్యత్‌

భారత మార్కెట్‌లో మారుతి సియాజ్‌ రూ. 9.09 లక్షల నుంచి రూ. 11.89 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) అందుబాటులో ఉంది. ఈ మోడల్‌ను సమీప భవిష్యత్‌లో అప్డేట్‌ చేసే లేదా కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చే ప్రణాళికలు లేవని సమాచారం. ప్రయాణ భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో, ఈ రేటింగ్‌ సియాజ్‌ అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.