Rs 14 Lakh Bid For A VIP Number Plate: కొంతమంది ప్రజలు తమ అభిరుచులను నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళతారు, ఎంత రిస్క్‌ అయినా చేస్తారు, ఎంత ఖర్చుకైనా వెనుకాడరు అనేదానికి మరో ఉదాహరణ ఈ కథనం. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి, తన కొత్త స్కూటర్‌కు నంబర్‌ ప్లేట్‌ కోసం, ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొన్నాడు. వేలంలో వేలమందితో పోటీ పడి, తనకు ఇష్టమైన వీఐపీ నంబర్‌ పొందాడు, ఆ నంబర్‌ HP 21 C 0001. ఈ నంబర్‌ కోసం ఆ వ్యక్తి ఏకంగా 14 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. నంబర్‌ ప్లేట్‌ కోసం పోటీ పడడం సహజమేగా అంటారా, మీరు చెప్పింది నిజమే. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ నంబర్‌ ప్లేట్‌ పెట్టాల్సిన స్కూటర్‌ ధర కేవలం లక్ష రూపాయలు మాత్రమే. అంటే, రూ.లక్ష విలువైన స్కూటర్‌ నంబర్‌ ప్లేట్‌ కోసం రూ.14 లక్షలు ఖర్చు చేశాడు. 

పీఐపీ నంబర్‌ దక్కించుకున్న వ్యక్తి ఎవరు?హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌కు చెందిన వ్యక్తి అతను. పేరు - సంజీవ్ కుమార్. ఈ వ్యక్తి ఇటీవలే కొత్త స్కూటర్ కొన్నాడు, దానికి VIP నంబర్‌ ప్లేట్‌ బిగించి దర్జాగా తిరగాలని ఉత్సాహపడ్డాడు. అనుకున్నదే తడవుగా.. హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో పాల్గొని,  HP 21 C 0001 నంబర్‌ కోసం అత్యధికంగా రూ. 14 లక్షల బిడ్ వేసి గెలిచాడు.

ఇంకా ఎవరైనా ఈ వేలంలో పాల్గొన్నారా? ఈ వేలంలో చాలామంది పాల్గొన్నారు. మరో వ్యక్తి సంజీవ్ కుమార్ దరిదాపుల్లోకి వచ్చి నిరాశగా నిలబడ్డాడు. రెండో వ్యక్తి నివాసం సోలన్. అతను, HP 21 C 0001 నంబర్‌ కోసం 13 లక్షల 50 వేల రూపాయలకు బిడ్ చేశాడు. ఇతని కంటే సంజీవ్ కుమార్ మరో 50 వేల రూపాయలు అదనంగా (14 లక్షల రూపాయలకు) బిడ్ వేయడంతో, ఆ వీఐపీ నంబర్‌ సంజీవ్‌ కుమార్‌ చేతికి చిక్కింది. మొత్తానికి, వేలంలో బాగు పడింది హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం. ఈ ఒక్క వేలం నుంచే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 14 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. నంబర్ ప్లేట్ వేలంలో వచ్చిన డబ్బును రవాణా శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో, ద్విచక్ర వాహనాలకు జారీ చేసిన అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్ ఇదే కావచ్చని రవాణా అధికారులు చెబుతున్నారు. 

అభిరుచికి వెల కట్టలేం - సంజీవ్‌ కుమార్‌సంజీవ్ కుమార్‌, VIP నంబర్‌ ప్లేట్‌ దక్కించుకున్న ఆనందాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు మీడియా మిత్రులతోనూ పంచుకున్నాడు. తనకు ప్రత్యేకమైన నంబర్ అంటే చాలా ఇష్టమని, అభిరుచులకు ధర కట్టలేమని చెప్పాడు. 

నెటిజన్ల సెటైర్లుసంజీవ్‌ కుమార్‌ చేసిన పనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలా కొద్ది మంది మాత్రం అతని అభిరుచిని మెచ్చుకుంటే, ఎక్కువ మంది తిట్టి పోస్తున్నారు. నంబర్‌ ప్లేట్‌కు పెట్టే రేటుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చని, లేదా అలాంటివే మరో 14 స్కూటర్లు వచ్చేవని కామెంట్స్‌ చేశారు. "పావలా కోడికి ముప్పావలా మసాలా" అని మరికొందరు ఎద్దేవా చేశారు.