మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ పండుగ సీజన్లో XUV700, థార్ కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700, థార్ SUV ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మహీంద్రా కంపెనీ ఇటీవలే తన XUV 700కు సంబంధించి ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల ధరలను రూ. 6,000 వరకు తగ్గించింది. ఈ తగ్గుదలను ప్రకటించిన వారంలోపే ధరలను భారీగా పెంచడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ధరల పెరుగుదలకు గల కారణాన్ని కూడా కంపెనీ బయటకు చెప్పకపోవడం విశేషం. మహీంద్రా కంపెనీ 2022 లో ఈ రెండు మోడల్స్ ధరలను పెంచడం ఇదే తొలిసారి.
మహీంద్రా XUV700 ధర ఎంత పెరిగిందంటే?
మహీంద్రా XUV700 ధర పెరుగుదల విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్ ధర రూ. 22,000 నుంచి రూ. 35,000కి పెరిగింది. వీటి ధరలు ఇప్పుడు రూ. 13.45 లక్షల నుంచి రూ. 23.10 లక్షల వరకు చేరాయి. ఇక XUV700 డీజిల్ వేరియంట్ ధరల విషయానికి వస్తే.. ఇవి కూడా రూ. 20,000 నుంచి రూ. 37,000 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో XUV700 డీజిల్ ధరలు ఇప్పుడు రూ. 13.96 లక్షల నుంచి రూ. 24.95 లక్షల వరకు చేరాయి.
మహీంద్రా XUV700 అనేది మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి MX, AX3, AX5తో పాటు AX7. ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్, ఎక్యుప్ మెంట్స్ తో చాలా ఆధునికంగా ఉన్నాయి. XUV700 రెండు ఇంజిన్ ఆప్సన్స్ ను సైతం కలిగి ఉన్నాయి. 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లతో వస్తున్నాయి. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను, 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 2. లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ను పరిశీలిస్తే.. 188 బిహెచ్‌పి పవర్ ను కలిగి ఉండి 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.
మహీంద్రా థార్ ధరలు పెంపు
అటు మహీంద్రా థార్ ధరలకు కూడా పెరిగాయి. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 6,000 నుంచి రూ. 7,000 వరకు పెరిగాయి. ఇప్పుడు మహీంద్రా థార్ పెట్రోల్ ధరలు రూ. 13.59 లక్షల నుంచి రూ. 15.82 లక్షల వరకు చేరాయి. థార్ డీజిల్ వేరియంట్ ధరలు మరింత ఎక్కువగా పెరిగాయి. ఒక్కో యూనిట్ మీద రూ. 26,000 నుంచి రూ. 28,000 వరకు పెరిగాయి. థార్ డీజిల్ ధరలు రూ. 14.16 లక్షల నుంచి రూ. 16.29 లక్షల వరకు కొనసాగుతున్నాయి.
ధరల పెంపు కాసేపు పక్కన పెడితే.. మహీంద్రా కంపెనీ ఇటీవల భారత మార్కెట్లో కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUVని ప్రదర్శించింది. ఈ EV వచ్చే ఏడాది జనవరిలో భారత మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ వాహనం టాటా నెక్సాన్ EV లాంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?