Mahindra XUV300 Facelift: భారతీయ ఆటోమోటివ్ రంగంలో సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అనేక మోడల్స్ ఉన్నాయి. దీనిలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా ఒకటి. మహీంద్రా ప్రస్తుతం దీనికి సంబంధించిన మిడ్ లైఫ్ అప్‌డేట్‌పై చాలా వేగంగా పని చేస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. దీన్ని లాంచ్ చేయడానికి ముందు మహీంద్రా పరీక్షిస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్‌డేట్‌లు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.


మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ వివరాలు ఇలా...
ఎక్స్‌యూవీ300కు సంబంధించి మూడు విభిన్న వేరియంట్‌లు కనిపించాయి. వీటిని ముందు నుంచి వెనుకకు పూర్తిగా కవర్ చేశారు. కాబట్టి ఈ వేరియంట్లను చక్రాల ద్వారా గుర్తించవచ్చు. బేస్, మిడ్ లెవల్ వేరియంట్‌లు ప్లాస్టిక్ వీల్ క్యాప్స్‌తో కూడిన స్టీల్ వీల్స్‌ను పొందుతాయి. ఇవి విభిన్నమైన డిజైన్‌ను పొందుతాయి. అయితే టాప్-ఎండ్‌లో ఇప్పటికే ఉన్న మోడల్‌కు సమానమైన డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. మూడు వేరియంట్లలో వింగ్ మిర్రర్‌లపై టర్న్ ఇండికేటర్‌లను ఏర్పాటు చేశారు.


ఎక్స్‌యూవీ300 టెస్ట్ మ్యూల్ ఇంటీరియర్ షాట్‌లను పరిశీలిస్తే... ఇది ఎక్స్‌యూవీ400 మాదిరిగానే పెద్ద, ఫ్రీ స్టాండింగ్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుందని తెలుస్తోంది. ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ దాని పోటీదారులైన టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడా మార్కెట్లోకి రానుంది.


త్వరలో లాంచ్ కూడా...
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్... మహీంద్రా బీఈ లైనప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుంచి ఇన్‌స్పైర్ అయినట్లు కనిపిస్తుంది. ముందు, వెనుక భాగంలో మెయిన్ స్టైలింగ్ ఓవర్‌హాల్‌లను కలిగి ఉంటుంది. ఇది 2025లో అమ్మకానికి వస్తుందని టాక్ నడుస్తోంది. గత నెల నాటికి మహీంద్రా డీలర్‌షిప్‌లు తమ కార్లపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఎక్స్‌యూవీ300పై రూ. 1.82 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ కొత్త మోడల్ మార్కెట్లోకి త్వరలో రాబోతుందని సూచిస్తుంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌లో ఏ ఇంజిన్ ఉండనుంది?
ప్రస్తుతం ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్ వేరియంట్ (131 హెచ్‌పీ) మాన్యువల్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన రెండు ఇంజన్‌లు మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతాయి. ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్ టీజీడీఐ ఇంజన్ కోసం హయ్యర్ ట్యూన్‌తో పాటు కొత్త టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్‌ను పొందుతుందని భావిస్తున్నారు.


ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో 16 పెట్రోల్, తొమ్మిది డీజిల్ వేరియంట్‌లు ఉన్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ వేరియంట్లు, పవర్‌ట్రెయిన్ లైనప్ గురించి ఎటువంటి సమాచారం ఇంతవరకు అందుబాటులో లేదు. ఎక్స్‌యూవీ300 బుకింగ్ కెపాసిటీ కాస్త తగ్గనుందని మహీంద్రా ఇంతకు ముందే ప్రకటించింది. ఈ మోడల్‌కు సంబంధించి ప్రస్తుతం తక్కువ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ400 ప్రస్తుతం 9,000 కంటే తక్కువ పెండింగ్ బుకింగ్‌లను మాత్రమే కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది. అప్‌డేట్ చేసిన ఎస్‌యూవీ వచ్చే సమయానికి ఈ పెండింగ్ బుకింగ్స్ క్లియర్ అవుతాయని భావిస్తున్నారు.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!