Mahindra Thar Modification: నేటి రోజుల్లో ప్రజలు తమకు కావాల్సిన తీరుగా వాహనాలు, వస్తువులను మార్చుకోవడంపై ఫోకస్ చేస్తున్నారు. కార్లను ప్రత్యేకంగా (యూనిక్‌గా) చూపించుకోవడం కోసం మోడిఫై చేయించుకుంటున్నారు. అందుకే కార్లకు పెద్ద టైర్లు వేయించడం, సస్పెన్షన్ మార్చడం, అలాగే బాడీలోనే మార్పులు చేయడం కొందరికి కామన్ అయిపోయింది. అయితే, ఇలాంటి మోడిఫికేషన్లు చేయించడం వల్ల వాహన ఇన్సూరెన్స్ పై కూడా ప్రభావం పడుతుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
ఇటీవల పంజాబ్‌లో ఒక మహీంద్రా థార్ (Mahindra Thar) యజమానికి సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఒక రోడ్డు ప్రమాదం తర్వాత వాహనం యజమానికి రావాల్సిన 4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను బీమా కంపెనీ రిజెక్ట్ చేసింది. ఆ మహీంద్రా థార్ యజమాని తన కార్లో పలు మార్పులు చేశాడు. ఆ వివరాలను ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయలేదు. ఆ తర్వాత కారు యాక్సిడెంట్ అయినప్పుడు, నష్టపరిహారం కోసం అందరిలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. దీనిపై బీమా కంపెనీ దర్యాప్తు చేయగా, కారులో చేసిన మోడిఫికేషన్ల విషయం బయటపడింది. ఇన్సూరెన్స్ కంపెనీ నిబంధనల ప్రకారం.. కారు ఓరిజినల్ స్ట్రక్చర్, సాంకేతికతలో మార్పులు చేశారు. ఇది పాలసీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది.
క్లెయిమ్‌ను కంపెనీ ఎందుకు రిజెక్ట్ చేసింది?కారులో చేసిన మోడిఫికేషన్ల వల్ల దాని రూపం పూర్తిగా మారిపోయిందని, ఈ మార్పుల గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఇన్సూరెన్స్ కంపెనీ పేర్కొంది. అందుకే క్లెయిమ్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనివల్ల కారు యజమాని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని తానే భరించాల్సి వచ్చింది.
ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యంఅందుకే ఇలాంటి పరిస్థితుల్లో, ఎవరైనా తన కారులో ఎలాంటి పెద్ద మార్పులు చేయించినా, వెంటనే తమ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం ఎంతో అవసరం. చాలా సందర్భాలలో బీమా కంపెనీలు అలాంటి మోడిఫికేషన్లను పాలసీలో చేర్చుకుంటాయి లేదా ప్రీమియం మొత్తంలో మార్పులు చేర్పులు చేస్తుంది. కానీ మాడిఫికేషన్ సమాచారాన్ని దాచిపెడితే మాత్రం, ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకు పంజాబ్‌లో జరిగిన మహీంద్రా థార్ ప్రమాదం ఘటనే నిదర్శనం.
ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎప్పుడూ వాహనం ఓరిజినల్ ఫ్యాక్టరీ కండిషన్ ఆధారంగానే జారీ చేస్తారు. ఒకవేళ కారు నిర్మాణం, ఇంజిన్, టైర్లు, సస్పెన్షన్ లేదా ఇతర ముఖ్యమైన భాగాలలో మార్పులు చేయడం ఇన్సూరెన్స్ రిస్క్‌ను ప్రభావితం చేస్తుంది. కనుక అలాంటప్పుడు నిబంధనల ఉల్లంఘన కింద క్లెయిమ్‌ను తిరస్కరించే హక్కు బీమా కంపెనీకి ఉంటుంది. కనుక, మీరు కూడా మీ కారు లేదా ఎస్‌యూవీ (SUV)ని మోడిఫై చేయాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా బీమా కంపెనీ, ఆర్టీఓ (RTO) నిబంధనల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడం మంచిది. లేకపోతే ప్రమాదం జరిగిన సమయాల్లో, వాహనం డ్యామేజీ అయిన సందర్భంలో మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
