ప్రపంచంలోనే మొట్టమొదటి కొత్త తరహా ఎలక్ట్రిక్ కారు త్వరలో లాంచ్ కానుంది. అదే లైట్ ఇయర్ 0. ఇది ఒక సోలార్ పవర్ కారు. అంతేకాకుండా ఏకంగా కొన్ని నెలలపాటు చార్జింగ్ పెట్టకుండా ఈ కారును ఉపయోగించవచ్చు. ఈ కారు పైభాగంలో కర్వ్‌డ్ సోలార్ ప్యానెళ్లు ఉంటాయి. కేవలం సూర్యరశ్మి ద్వారానే 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ కానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 625 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుంది.


ఇందులో 1.05 కేడబ్ల్యూహెచ్ సోలార్ చార్జింగ్‌ను అందించారు. గంట సేపు సోలార్ చార్జింగ్ పెడితే 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అలా రోజుకు 70 కిలోమీటర్ల వరకు ఈ కారు అందిస్తుంది. ఒకవేళ ప్లగ్ ద్వారా చార్జింగ్ పెడితే... హోం చార్జర్‌తో గంటకు 32 కిలోమీటర్లు, పబ్లిక్ చార్జింగ్‌తో గంటకు 200 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుంది. ఫాస్ట్ చార్జర్లతో చార్జింగ్ పెడితే గంట చార్జింగ్‌తో 520 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.


లైట్ ఇయర్ కంపెనీని 2016లో స్థాపించారు. మొదట ఈ కంపెనీలో కేవలం ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 500 దాటింది. లైట్ ఇయర్ 0కు సంబంధించి కేవలం 949 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నారు. డెలివరీలు నవంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. టెస్ట్ డ్రైవ్‌లు మాత్రం ఈ నెల నుంచే చేయవచ్చు.


ఆమ్‌స్టర్‌డాం వంటి నగరాల్లో రెండు నెలలపాటు చార్జింగ్ పెట్టకుండా డ్రైవ్ చేయవచ్చని కంపెనీ అంటోంది. ఎండలు ఎక్కువగా ఉండే పోర్చుగల్ వంటి నగరాల్లో ఈ కారును ఏడు నెలల పాటు చార్జింగ్ పెట్టకుండా డ్రైవ్ చేయవచ్చు.


ఈ కారులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. రెండు ఫ్రంట్ యాక్జిల్ కాగా... రెండు రేర్ యాక్జిల్. 174 హెచ్‌పీ, 1720 ఎన్ఎం టార్క్ అవుట్ పుట్ రానుంది. కేవలం 10 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి లైట్ ఇయర్ చేరనుంది. ఈ కారు మనదేశంలో లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు. మనదేశంలో ఎండకు, వేడికి కొదవ ఉండదు కాబట్టి ఇక్కడ లాంచ్ అయితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?