KTM Duke Global Recall News: KTM కంపెనీ గ్లోబల్‌గా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మోడల్ KTM 125 Duke, 250 Duke, 390 Duke & 990 Duke బైక్‌లలో ఇంధన ట్యాంక్ క్యాప్ సీల్‌కు సంబంధించిన నాణ్యత సమస్యలు గుర్తించిన తరువాత, వాటిని రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో 990 Duke అమ్మకాలలో లేకపోయినా, మిగతా మోడళ్లను కొనుగోలు చేసిన యూజర్‌లు తమ సమీప KTM సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలని కంపెనీ సూచించింది.

Continues below advertisement

KTM తెలిపిన వివరాల ప్రకారం... కొన్ని బైక్‌లలో ఇంధన ట్యాంక్ క్యాప్ సీల్‌లో చిన్న చిల్లులు రావచ్చు, ఈ కారణంగా ఫ్యూయల్ లీకేజ్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇది జరిగితే పెద్ద ప్రమాదం చోటు చేసుకోవచ్చు. కస్టమర్లను ఈ రిస్క్‌ నుంచి దూరంగా ఉండేందుకు, ప్రతి యజమానికి కంపెనీ వ్యక్తిగతంగా మెసేజ్ లేదా కాల్ ద్వారా సమాచారం పంపుతోంది. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని బైక్‌ను తీసుకురావాలని సూచిస్తోంది. సర్వీస్ సెంటర్‌లో ఈ సీల్‌ను ఉచితంగా మార్చి ఇస్తారు.

ప్రభావిత మోడల్‌ను గుర్తించేందుకు KTM ప్రత్యేక వెబ్‌సైట్‌లో ‘Service’ విభాగాన్ని అందుబాటులో ఉంచింది. అక్కడ చాసిస్ నంబర్ ఎంటర్ చేస్తే, మీ బైక్ రీకాల్‌లో ఉందో లేదో వెంటనే తెలుస్తుంది.

Continues below advertisement

390 Adventure, Adventure X ధరలు పెంపు

రీకాల్‌తో పాటు KTM మరో కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. గత కొన్ని నెలలుగా, GST 2.0 కారణంగా 350cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై పెరిగిన పన్ను భారాన్ని కంపెనీయే భరిస్తున్నట్టు తెలిపింది. అయితే, ఆ బఫర్‌ను ఇక కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో, KTM 390 Adventure & 390 Adventure X ధరలను అధికారికంగా పెంచింది.

GST 2.0 కు ముందు ₹3.04 లక్షలుగా ఉన్న KTM 390 Adventure X ఇప్పుడు ₹3.26 లక్షలకు చేరుకుంది. ఇక స్టాండర్డ్ KTM 390 Adventure ధర ₹3.68 లక్షల నుంచి ₹3.95 లక్షలకు పెరిగింది. అంటే X వేరియంట్‌కి ₹22,410 పెరిగితే,  స్టాండర్డ్ మోడల్‌ ₹27,000 పెరిగింది.

ఈ పెంపుతో, KTM 390 Adventure & Royal Enfield Himalayan 450 మధ్య ధరల వ్యత్యాసం మళ్లీ పెరిగింది. GST తర్వాత ఒక దశలో ఈ రెండు మోడళ్ల ధరలు దగ్గరగా వచ్చినప్పటికీ, ఇప్పుడు KTM ధరలు మళ్లీ ఎక్కువయ్యాయి.

ఇతర 390 మోడళ్ల పరిస్థితి ఎలా?

KTM అధికారికంగా ప్రకటించనప్పటికీ, 390 Duke, RC 390, రాబోయే 390 Enduro లాంటి మోడళ్ల ధరలు కూడా త్వరలో పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి ఈ బైక్‌లు కొనాలని ప్లాన్‌ చేస్తున్న వాళ్లు త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిది.

క్లుప్తంగా చెప్పాలంటే, KTM ఒకేసారి రెండు పెద్ద అప్‌డేట్‌లతో బైక్ ప్రియులను అప్రమత్తం చేసింది. ఒకవైపు భద్రతా కారణాల కోసం రీకాల్ జారీ చేస్తూ, మరోవైపు GST ప్రభావంతో ధరలు పెంచింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.