KTM Side Stand Issue: ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్‌ బైక్‌ ప్రేమికుల్లో మంచి క్రేజ్‌ ఉన్న KTM బైకుల గురించి తాజాగా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ కంపెనీ, తన 390 అడ్వెంచర్ X, 390 అడ్వెంచర్ R, 390 ఎండ్యూరో R, 390 SMC-R మోడళ్లకు సంబంధించి గ్లోబల్‌ రీకాల్‌ ప్రకటించింది. అయితే, ఈ వార్త వినగానే భారత వినియోగదారులు టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదని KTM స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే, భారత్‌లో తయారైన, భారత్‌లో అమ్మిన KTM 390 మోడళ్లకు ఈ రీకాల్‌ వర్తించదు.

Continues below advertisement

రీకాల్‌కు కారణం ఏంటి?ఈ రీకాల్‌కు కారణం... సైడ్‌ స్టాండ్‌కు సంబంధించిన ఒక టెక్నికల్‌ లోపం. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో (భారత్‌లో కాదు) విక్రయించిన బైక్‌లలో, సైడ్‌ స్టాండ్‌ స్ప్రింగ్‌ దెబ్బతినడం వల్ల బైక్‌ అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా స్టార్ట్‌ కాకపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని కంపెనీ గుర్తించింది. ఈ సమస్య ప్రధానంగా USA, కెనడా సహా మరికొన్ని విదేశీ మార్కెట్లలో అమ్మిన బైక్‌లలో మాత్రమే కనిపించిందని KTM తెలిపింది.

KTM చెప్పిన వివరాల ప్రకారం, ఇంజిన్‌ నుంచి వచ్చే వైబ్రేషన్స్‌ కారణంగా ఈ లోపం ఉత్పన్నమవుతోంది. ప్రత్యేకంగా, అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసిన కొన్ని మోడళ్లలో వాడిన ఫోర్జ్డ్‌ సైడ్‌ స్టాండ్‌ కారణంగా ఈ సమస్య ఏర్పడింది. అదే సమయంలో, భారత మార్కెట్‌కు ఉద్దేశించిన బైక్‌లలో ఫాబ్రికేటెడ్‌ సైడ్‌ స్టాండ్‌ వాడుతుండటంతో, ఇక్కడ అమ్మిన మోడళ్లపై ఎలాంటి ప్రభావం లేదని కంపెనీ స్పష్టం చేసింది.

Continues below advertisement

కస్టమర్లు ఏం చేయాలి?రీకాల్‌లో భాగంగా, ప్రభావిత బైక్‌లకు KTM కొన్ని మార్పులు చేయనుంది. కస్టమర్లు తమ సమీప KTM సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి, సైడ్‌ స్టాండ్‌ స్ప్రింగ్‌ను కొత్తదిగా మార్చించుకోవాలి. అదనంగా, సైడ్‌ స్టాండ్‌కు ఒక రబ్బర్‌ ప్రొటెక్టర్‌ను అమర్చడం, అలాగే కొన్ని వాహనాల్లో సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌ రిటైనింగ్‌ ప్లేట్‌ను కొత్తగా ఫిట్‌ చేయడం వంటివి చేయనుంది. దీనివల్ల సైడ్‌ స్టాండ్‌ స్విచ్‌ ట్రిగర్‌ రేంజ్‌ సరిగా పనిచేస్తుందని KTM చెబుతోంది.

భారతీయుల సంగతేంటి?భారత్‌ విషయానికి వస్తే, ఇక్కడ అమ్మిన KTM 390 అడ్వెంచర్‌, ఎండ్యూరో మోడళ్లలో వాడే సైడ్‌ స్టాండ్‌ స్ప్రింగ్‌ను ఈ ఏడాది ప్రారంభంలోనే ముందస్తుగా అప్‌గ్రేడ్‌ చేశామని కంపెనీ వెల్లడించింది. అందుకే భారత వినియోగదారులకు ఈ సమస్య అసలు రావడం లేదని KTM పేర్కొంది.

మొత్తానికి, సోషల్‌ మీడియాలో రీకాల్‌ వార్తలు చూసి భారత KTM యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రీకాల్‌ కేవలం అంతర్జాతీయ మోడళ్లకే పరిమితం. భారత్‌లో అమ్మిన KTM 390 అడ్వెంచర్‌, ఎండ్యూరో బైక్‌లు పూర్తిగా సేఫ్‌ అని కంపెనీ మరోసారి భరోసా ఇచ్చింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.