రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ధరలకు తోడు.. పర్యావరణ పరిపరక్షణ మీద జనాల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్ వాహనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వాహనాలకు గుడ్ బై చెప్పి.. ఎలక్ట్రిక్ వాహనాలకు హాయ్ చెప్తున్నారు. ఆయా వాహన తయారీ కంపెనీలు సైతం విద్యుత్ వాహనాల తయారీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. రానున్న కాలం అంతా విద్యుత్ వాహనాల హవా కొనసాగుతుందనే అంచనా మేరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.


ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూల వాతావరణం


ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి భారత్ లో సుమారు 5 కోట్ల విద్యుత్ వాహనాలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఛార్జింగ్‌ మౌలిక వసతుల రంగంలో భారీ సంఖ్యలో అవకాశాలు ఉంటాయని ప్రటించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు దేశంలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని తెలిపింది. కేవలం ఒక సంవత్సర కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా మూడింతలు పెరిగినట్లు కేపీఎంజీ ప్రకటించింది. బస్సులు, టూ, త్రి వీలర్ వాహనాల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగినట్లు తెలిపింది.మార్చి 2022 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 10 లక్షలు దాటినట్లు వెల్లడించింది. 2030 నాటికి  విద్యుత్ వాహనాల సంఖ్య 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేసింది.


పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లకు భారీ డిమాండ్


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,700 పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లు ఉన్నాయని కేపీఎంజీ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఛార్జింగ్ సెంటర్లు ఏమాత్రం సరిపోవని ప్రకటించింది. ఛార్జింగ్‌ సెంటర్లు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఇప్పటికే ఛార్జింగ్ మౌలిక వసతుల్ని పెంచడం కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కేపీఎంజీ వెల్లడించింది. ప్రజలు, ప్రైవేటు రంగాల నుంచి సైతం విద్యుత్ వాహనాల మీద ఆసక్తి పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో  ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులకు అవకాశం కలుగుతున్నట్లు తెలిపింది. ఛార్జింగ్‌ వ్యాపారం ద్విచక్ర వాహన విభాగంలో 2025 నాటికి 15 నుంచి 20 శాతం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  2030 వరకు 50 నుంచి 60 శాతానికి పెరగనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత ప్రయాణికుల వాహన విభాగంలో 2025 నాటికి 8 నుంచి 10 శాతం, 2030కల్లా 35 నుంచి 40 శాతం పెరుగుతుందని వెల్లడించింది. అటు  వాణిజ్య వాహన విభాగంలో ఛార్జింగ్‌ వ్యాపారం 2030 నాటికి 90 నుంచి 95 శాతం వృద్ధి నమోదవుతుందని ప్రకటించింది.


భారత్ లో పరిస్థితులు వేరు


విదేశాలతో పోల్చితే భారత్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని కేపీఎంజీ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో వాణిజ్య వాహనాల ఛార్జింగ్‌కు డిమాండ్‌ అధికంగా ఉందని ప్రకటించింది.  భారత్‌లో మాత్రం టూ, త్రీ వీలర్ వాహనాలకు ఛార్జింగ్‌ ఎక్కువ అవసరమని తెలిపింది. పెద్ద పెద్ద పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల కంటే ముందు.. తక్కువ సమయంలో ఇళ్లు, కార్యాలయాల సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.