హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫల ఘటనను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విఫల ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలను రేవంత్ ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మామ అల్లుళ్ళు మహిళా హంతకులు అంటూ కేసీఆర్, హరీష్‌ రావును ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చనిపోయిన మహిళా కుటుంబాలను హరీష్‌ రావు పరామర్శించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. తూతూ మంత్రంగా అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవద్దని అన్నారు. కారకులు అయిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.


సెప్టెంబరు 1 నుంచి మునుగోడులో పర్యటన
మునుగోడు ఉప ఎన్నికల కోసం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో మునుగోడులో రేవంత్ రెడ్డి మునుగోడులో పర్యటించనున్నారు. మండలాల వారీగా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ ప్రచారం నిర్వహించనున్నారు. ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు గ్రామాల్లో గడప గడపకు ప్రచారం ఉండనుంది. మూడో తేదీన మునుగోడులో రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ ప్రెస్ మీట్ లు పెట్టనున్నారు.


ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నట్లుగా రేవంత్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటనపై స్పందించిన రేవంత్ రెడ్డి చనిపోయిన తెలంగాణ ఆర్మీ జవాన్‌ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని అడిగారు. ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చే ప్రాధాన్యం తెలంగాణ వారికి ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. సొంత ఇమేజ్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీ, పంజాబ్, బీహార్ రాష్ట్రాలకు కేసీఆర్ దోచి పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలోకి చేరిపోతారని రాష్ట్ర కార్మిక మంత్రి సీహెచ్ మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సహా మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని చెప్పారు. మంగళవారం పెద్దపల్లి వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే మునుగోడు ఎన్నికల సందర్భంగా కలిసిపోయారని ఆరోపించారు.


రేవంతే బీజేపీలోకి పంపుతున్నారు - మల్లారెడ్డి
రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ నాయకులందరని బీజేపీలోకి పంపిస్తున్నాడని విమర్శించారు. త్వరలోనే రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరిపోతాడని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకటైనా మునుగోడులో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ దివాళా తీసిందని, బీజేపీ ఫెయిలైన పార్టీ అని ఎద్దేవా చేశారు.