New York Motor Show 2024: ప్రస్తుతం జరుగుతున్న న్యూయార్క్ మోటార్ షోలో కియా ఈవీ9 2024 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ అత్యున్నత గౌరవం కాకుండా కియా నుంచి వచ్చిన ఈ ఈవీ వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది. 2023 మార్చిలో ఈవీ9 గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయింది. దీని అమ్మకాలు ఈ సంవత్సరం చివరిలో భారతదేశంలో ప్రారంభం కానున్నాయి. కియా ఈవీ9 ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన 2024 ఉమెన్స్ వరల్డ్‌వైడ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది.


ఈవీ9 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా ఎందుకు ఎంపికైంది?
ఓవరాల్‌గా వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 38 వాహనాల జాబితాలో ఈవీ9 టాప్-3లోకి వచ్చింది. కియా ఈవీ9తో పాటు బీవైడీ సీల్డ్, వోల్వో ఈఎక్స్30 టాప్-3లో నిలిచాయి. కియా ఈవీ9 (Kia EV9) అద్భుతమైన డిజైన్, విశాలమైన 7 సీటర్ ఇంటీరియర్, అగ్రెసివ్ ప్రైస్ పాయింట్‌ను హైలైట్ చేసి విజేతగా ఎంపిక చేసింది. వరల్డ్ కార్ అవార్డ్స్‌లో ఇది కియాకి నాలుగో టైటిల్. గతంలో 2020లో టెల్లూ రైడ్‌కి వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2020లో సోల్ ఈవీకి వరల్డ్ అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, కియా ఈవీ6 జీటీ 2023 కారుకు వరల్డ్ పెర్ఫార్మెన్స్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు లభించాయి.


కొత్త బీఎండబ్ల్యూ ఐ5/5 సిరీస్ ప్రపంచ లగ్జరీ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది. మెర్సిడెస్ ఈ-క్లాస్, ఈక్యూఈ ఎస్‌యూవీలను ఓడించి, హ్యుందాయ్ అయోనిక్ 5 పెర్ఫార్మెన్స్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది. వోల్వో ఈఎక్స్30 వరల్డ్ అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది. చివరిగా కొత్త టయోటా ప్రియస్ వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది.


వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ జ్యూరీ, స్టాండర్ట్స్
వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను 29 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 100 మంది ప్రతిష్టాత్మక ఆటోమోటివ్ జర్నలిస్టుల జ్యూరీ ఎంపిక చేసింది. ఇందులో కొంతమంది ప్రముఖ భారతీయ జర్నలిస్టులు కూడా ఉన్నారు.


వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అర్హత పొందిన వాహనాలు తప్పనిసరిగా ప్రతీ సంవత్సరం కనీసం 10,000 యూనిట్ల వాల్యూమ్‌లో ఉత్పత్తి అవ్వాలి. వాటి ప్రాథమిక మార్కెట్‌లలో లగ్జరీ కార్ లెవల్స్ కంటే తక్కువ ధరను కలిగి ఉండాలి. 2023 జనవరి 1వ తేదీ నుంచి 2024 మార్చి 30వ తేదీ మధ్య తయారు అయి ఉండాలి. ఈ వ్యవధిలో కనీసం రెండు వేర్వేరు ఖండాల్లో రెండు ప్రధాన మార్కెట్‌ల్లో (చైనా, యూరప్, ఇండియా, జపాన్, కొరియా, లాటిన్ అమెరికా, అమెరికా) అందుబాటులో ఉండాలి.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!