మనదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే బ్రాండ్లలో కియా కూడా చేరిపోయింది. ఈ దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6ను మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.59.95 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎంట్రీ లెవల్ జీటీ లైన్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ధర. ఇక టాప్ ఎండ్ జీటీ లైన్ ఏడబ్ల్యూడీ వేరియంట్ ధర రూ.65.95 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.
ఈ కారుకు సంబంధించిన గ్లోబల్ లాంచ్ గతేడాదే జరిగింది. ప్రత్యేకమైన ఈవీ ప్లాట్‌ఫాంపై ఈ కారును రూపొందించారు. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.3 లక్షల బుకింగ్ అమౌంట్ చెల్లించి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
అయితే కియా మనదేశంలో మొదట కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. ఇది పూర్తిగా ఇంపోర్టెడ్ కారు. దీనికి సంబంధించి మొత్తంగా 350 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. మొదట బుక్ చేసుకున్న 100 మంది వినియోగదారులకు కారును డెలివరీ చేయనున్నారు. మిగిలిన వారికి బుకింగ్ అమౌంట్ రీఫండ్ ఇస్తారా... లేదా ఇంపోర్ట్ నంబర్ పెంచి వారికి కూడా డెలివరీ చేస్తారా అన్నది తెలియరాలేదు.
ఈ కారుకు సంబంధించిన డెలివరీలు 2022 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది ఒక ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ కారు. సన్నటి ఫ్రంట్ గ్రిల్, పెద్ద లార్జ్ హెడ్‌ల్యాంప్స్ కూడా ఇందులో ఉండనున్నాయి. ముందువైపు బంపర్ డిజైన్ చాలా క్లీన్‌గా ఉండనుంది. దీని డిజైన్ కూడా స్పోర్టీగా ఉంది. ఈ కారు లుక్ దీనికి మరింత ప్లస్ కానుంది.
ఈ కారు పొడవు 4681 మిల్లీమీటర్లుగా ఉండనుంది. 520 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించారు కాబట్టి లోపల విశాలంగా ఉండనుంది. 12.3 అంగుళాల కర్వ్‌డ్ టచ్‌స్క్రీన్ సిస్టం, 12.3 అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సరౌండ్ వ్యూ మానిటరింగ్, మెరీడియన్ సౌండ్ సిస్టం, సన్‌రూఫ్, మూడు డ్రైవింగ్ మోడ్లు (నార్మల్, స్పోర్ట్, ఎకో), అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 528 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 350 కేడబ్ల్యూహెచ్ చార్జర్‌ను ఉపయోగిస్తే 10 నుంచి 80 శాతం చార్జింగ్ కేవలం 18 నిమిషాల్లోనే ఎక్కుతుంది. దీనికి మూడు సంవత్సరాల వారంటీ అందించనున్నారు. ఇక బ్యాటరీకి ఎనిమిది సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు తిరిగేవరకు వారంటీ అందించనున్నారు. వీటిలో ఏది ముందు దాటితే అప్పుడు వారంటీ పీరియడ్ ముగిసిపోనుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?