Kawasaki hydrogen-powered horse Corleo: బైక్‌లు, స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కవాసకి ఇప్పుడు ఓ వినూత్న ప్రయోగం చేస్తోంది. గుర్రాన్ని పోలిన నాలుగు కాళ్ల వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది. దీనికి కొర్లియో ‍‌(Corleo) అనే పేరు పెట్టింది. పూర్తిగా ఆఫ్‌రోడ్ ప్రయాణం కోసం రూపొందుతున్న ఈ రోబోటిక్ గుర్రం ‍(వాహనం) హైడ్రోజన్‌తో పని చేయడం మరో ప్రత్యేకత.

Continues below advertisement

కవాసకి, తన మోటార్‌సైకిల్ ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని & రోబోటిక్స్ సాంకేతికతను కలిపి నాలుగు కాళ్లపై నడిచే ఆఫ్‌రోడ్ మొబిలిటీ వెహికల్‌ కొర్లియోను డెవలప్‌ చేస్తోంది. 2030లో సౌదీ అరేబియాలో జరగనున్న ఎక్స్‌పోలో సైట్ మొబిలిటీ వాహనంగా దీనిని ఉపయోగించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.

కవాసకి తొలిసారి కొర్లియో కాన్సెప్ట్‌ను 2025లో జపాన్‌లో జరిగిన ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇప్పుడు దీని అభివృద్ధి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో వాణిజ్య ఉత్పత్తిగా తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.

Continues below advertisement

మోటార్‌సైకిల్ టెక్నాలజీతో నాలుగు కాళ్లు

కొర్లియోలో సాధారణ చక్రాలు ఉండవు. వాటి స్థానంలో నాలుగు స్వతంత్రంగా పనిచేసే కాళ్లు ఉంటాయి. ప్రతి కాలును ప్రత్యేకంగా నియంత్రించే విధంగా రూపొందించారు. వెనుక కాళ్లను నడిపించే వ్యవస్థ కోసం, మోటార్‌సైకిళ్లలో ఉపయోగించే స్వింగ్‌ఆర్మ్ సాంకేతికతను ప్రేరణగా తీసుకున్నారు.

కొర్లియో నాలుగు కాళ్లు స్వతంత్రంగా కదులుతాయి. రోడ్డుపై ఉన్న గుంతలు, ఎత్తుపల్లాలను దాటేటప్పుడు వచ్చే కుదుపులను కూడా అబ్జార్బ్‌ చేస్తాయి. దీంతో, ఈ వాహనం పెద్ద కుదుపులు లేకుండా స్థిరంగా కదులుతుంది. రైడర్ కూర్చున్న భంగిమను కూడా ఈ వాహనం నియంత్రణ వ్యవస్థ పరిగణనలోకి తీసుకుని, దానికి అనుగుణంగా నడుచుకుంటుంది.

ఇది కూడా చదవండి: ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?

గుర్రంపై స్వారీ చేసినట్లే

కొర్లియోను నడిపే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. రైడర్ తన శరీర బరువును ఒక వైపు నుంచి మరో వైపుకు మార్చడం ద్వారా వాహనానికి ఆదేశాలు ఇవ్వవచ్చు. గుర్రంపై స్వారీ చేసే అనుభూతిని పోలి ఉండేలా దీనిని రూపొందిస్తున్నారు.

రైడర్ కాళ్లకు ఉండే స్టిరప్స్ & చేతులతో పట్టుకునే హ్యాండిల్స్‌లోని వ్యవస్థలు ఈ కదలికలను గుర్తిస్తాయి. ఆ సమాచారాన్ని వాహనం కంట్రోల్ సిస్టమ్‌కు పంపుతాయి. దాని ఆధారంగా నాలుగు కాళ్ల కదలికలను నియంత్రిస్తారు.

కొండ ప్రాంతాలు, కఠినమైన ఆఫ్‌రోడ్ మార్గాలు & నీటిని దాటే ప్రాంతాల్లో కూడా కొర్లియోను ఉపయోగించేలా కవాసకి అభివృద్ధి చేస్తోంది. సంప్రదాయ చక్రాల వాహనాలు వెళ్లడం కష్టమైన ప్రాంతాల్లో ఇది ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే

150cc హైడ్రోజన్ ఇంజిన్

కొర్లియోలో మరో ఆసక్తికరమైన అంశం దాని పవర్‌ట్రెయిన్. ఇందులో 150cc హైడ్రోజన్ ఇంజిన్ ఉంటుంది. వెనుక భాగంలో అమర్చిన ప్రత్యేక కంటైనర్లలో హైడ్రోజన్‌ను నిల్వ చేస్తారు. ఈ ఇంజిన్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్‌తో నాలుగు కాళ్లను కదిలించే యాక్చుయేటర్లు & వాహనంలోని ఇతర వ్యవస్థలు పని చేస్తాయి. హైడ్రోజన్ కంటైనర్లను సులభంగా మార్చుకునేలా రూపొందిస్తున్నట్లు కవాసకి తెలిపింది. దీంతో సాధారణ ఇంధన నింపే సదుపాయాలు లేని ప్రాంతాల్లోనూ వాటిని మార్చుకునే అవకాశం ఉంటుంది.

రైడింగ్ సిమ్యులేటర్ కూడా

కొర్లియో అభివృద్ధిలో భాగంగా కవాసకి ప్రత్యేక రైడింగ్ సిమ్యులేటర్‌ను కూడా తయారు చేస్తోంది. 2027 చివరికల్లా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాహనం ఎలా స్పందిస్తుంది, రైడింగ్ అనుభూతి ఎలా ఉంటుంది అనే అంశాలను పరీక్షించేందుకు ఈ సిమ్యులేటర్ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో గేమింగ్ & ఈ స్పోర్ట్స్‌లో కూడా ఈ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను కవాసకి పరిశీలిస్తోంది.

2035 నాటికి అమ్మకాలు

కొర్లియోను సుమారు 2035 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని కవాసకి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇప్పటివరకు ఉత్పత్తి రూపం, ధర & పూర్తి సాంకేతిక వివరాలను వెల్లడించలేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.