Ethanol Blending In E20 Petrol: భారత్‌లో E20 పెట్రోల్ వినియోగంపై మరోసారి వివాదం మొదలైంది. కర్ణాటకలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో.. ఇంధనంలో ఇథనాల్ శాతం అనుమతించిన 20 శాతం కంటే ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. కొన్ని శాంపిళ్లలో ఇథనాల్ శాతం 31.2% వరకు నమోదైనట్లు వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన IOCL, BPCL, HPCL తీవ్రంగా ఖండించాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల విధానం నిబంధనలకు అనుగుణంగా లేదని ఆ కంపెనీలు తెలిపాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన 893 E20 ఇంధన శాంపిళ్ల పరీక్షల్లో అన్ని నమూనాలు IS 17021 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని వెల్లడించాయి. కర్ణాటక నుంచి సేకరించిన 56 శాంపిళ్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించాయి.
E20 పెట్రోల్ అంటే ఏమిటి?
E20 అనేది 20 శాతం ఇథనాల్ & 80 శాతం పెట్రోల్ కలిపి తయారు చేసే ఇంధనం. ముడిచమురు దిగుమతులను తగ్గించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం & దేశీయంగా చక్కెర, ధాన్యాల రైతులకు మద్దతు ఇవ్వడం ఈ విధానం ముఖ్య ఉద్దేశాలు. అయితే, ఇథనాల్ మోతాదు నిర్ణీత పరిమితిని మించితే వాహనాల పనితీరు, ఇంజిన్‌లోని కొన్ని భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ ప్రతినిధులు గతంలోనూ ఆందోళనలు వ్యక్తం చేశారు.
కర్ణాటక ప్రభుత్వం ఆరోపణలు ఏమిటి?
Reuters నివేదిక ప్రకారం, కర్ణాటక ప్రభుత్వం ఏడు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల నుంచి 63 ఇంధన శాంపిళ్లను సేకరించి పరీక్షించింది. తాము కోరిన ఇథనాల్ డేటాను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) అందించకపోవడంతో ఈ విచారణ చేపట్టినట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: యూజ్డ్ కార్ల ట్రాన్స్ఫర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ఈజీ.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
కర్ణాటక ఆహార, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ మీడియా సమావేశం నిర్వహించి, పరీక్షల ఫలితాలను వెల్లడించారు. OMCలు నిర్వహించే పెట్రోల్ బంకుల నుంచి సేకరించిన కొన్ని నమూనాల్లో ఇథనాల్ శాతం 26% నుంచి 31.2% వరకు నమోదైనట్లు చెప్పారు. భారత్‌లోని చాలా వాహనాలు పూర్తిగా E20 ఇంధనానికి అనుగుణంగా లేవని చెప్పిన మంత్రి.. E20కి అనుగుణంగా ఉన్న వాహనాల్లోనూ ఇథనాల్ శాతం నిర్ణీత పరిమితిని మించితే పనితీరు సమస్యలు రావచ్చని వెల్లడించారు.
వాహనదారులకు మైలేజ్ నష్టంతో పాటు రిపేర్ల ఖర్చు కూడా పెరుగుతోందని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అధిక ఇథనాల్ కలపడం వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.62,000 కోట్ల మైలేజ్ నష్టం, రూ.39,000 కోట్ల వాహన మరమ్మతుల ఖర్చు వస్తోందని అంచనా వేసింది. ఈ రెండు కలిపి రూ.1.01 లక్షల కోట్లుగా పేర్కొంది.
వాహనదారులకు పరిహారం అందించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, చమురు శుద్ధి సంస్థలు కూడా దీనికి బాధ్యత వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక కోరింది.
చమురు సంస్థల వాదన ఏమిటి?
కర్ణాటక ఆరోపణలను IOCL, BPCL, HPCL ఖండించాయి. దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న E20 పెట్రోల్ BIS నిర్దేశించిన IS 17021 ప్రమాణాలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం 2026 అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో తప్పనిసరి శాంప్లింగ్ విధానాలను పాటించలేదని సంస్థలు ఆరోపించాయి. నిబంధనల ప్రకారం, OMC ప్రతినిధుల సమక్షంలో ఒక లీటర్ శాంపిళ్లను ఆరు సేకరించాలి. వాటిపై సంబంధిత వ్యక్తుల సంతకాలు తీసుకుని డీలర్లు, రిఫైనరీలు & గుర్తింపు పొందిన షెడ్యూల్ III ల్యాబొరేటరీలకు పంపాలి. కానీ కర్ణాటక పరీక్షల్లో ఇలాంటి విధానం పాటించలేదని, మరోసారి స్వతంత్రంగా పరీక్షించడానికి అవసరమైన శాంపిళ్లు, పెట్రోల్ బంకుల స్థాయి పూర్తి వివరాలు అందుబాటులో లేవని సంస్థలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: 204cc ఇంజిన్, 26hp పవర్‌తో Yamaha R2.. యూత్ స్పీడ్‌కు తగ్గ యాక్సిలరేషన్, బ్రేకింగ్ ఉన్నట్లేనా?
టెస్టింగ్ విధానంపైనా అభ్యంతరాలు
ఇథనాల్ శాతాన్ని పరీక్షించే విధానంలోనూ లోపాలున్నాయని చమురు సంస్థలు పేర్కొన్నాయి. IS 17021 ప్రకారం, గ్యాస్ క్రోమాటోగ్రఫీ పరీక్షలో ఆక్సిజనేట్ లేని పెట్రోల్‌తో 1:1 నిష్పత్తిలో డైల్యూషన్ చేయాలి. E10 సర్టిఫైడ్ రిఫరెన్స్ మెటీరియల్ ఆధారంగా ఫలితాలను సరిచూడాలి. కానీ, రాష్ట్రం సమర్పించిన టెస్ట్ సర్టిఫికెట్లలో “ఇథనాల్ % బై గ్యాస్ క్రోమాటోగ్రఫీ” అని మాత్రమే ఉందని, ఉపయోగించిన నిర్దిష్ట పరీక్షా ప్రమాణాలు, డైల్యూషన్ విధానం వివరాలు లేవని సంస్థలు తెలిపాయి.
893 శాంపిళ్ల పరీక్షల్లో ఏం తేలింది?
OMCలు.. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 893 శాంపిళ్లను పరిశీలించాయి. వీటిలో కర్ణాటకకు చెందినవి 56 ఉన్నాయి. కర్ణాటక శాంపిళ్లలో సగటు ఇథనాల్ శాతం 19.30గా నమోదైందని సంస్థలు వెల్లడించాయి. మొత్తం 893 శాంపిళ్లలో 100 శాతం నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రకటించాయి. అధికారికంగా అనుమతించిన పరిధి 19% నుంచి 21% మధ్య ఉంటుందని పేర్కొన్నాయి.
వాహనాల మైలేజ్‌పై E20 ప్రభావం
E20 ఇంధనం వాడుతున్న వాహనాల విషయంలోనూ చమురు సంస్థలు తమ వాదన వినిపించాయి. దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 4 కోట్లకు పైగా నాలుగు చక్రాల వాహనాలు ప్రతిరోజూ E20 ఇంధనంతో నడుస్తున్నాయని తెలిపాయి. అయితే, పెద్ద ఎత్తున యాంత్రిక సమస్యలు నమోదైనట్లు ఆధారాలు లేవని పేర్కొన్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
