Punctured Car Tyre Fixing Tips: కారు టైర్ పంక్చర్ కావడం సాధారణమైన విషయమే అయినప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో టైర్‌ పంక్చర్‌ అయితే ఇక ఆ టెన్షన్‌ వర్ణనాతీతం. ప్రయాణ సమయంలో, ఊరికి దూరంగా ఉన్నప్పుడు ఈ సమస్య వస్తే కంగారు పడడం సహజం. ఆ సమయంలో మీ టెన్షన్‌ తీసి గట్టు మీద పెడితే, మీరే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీనికోసం మీకు కొన్ని పరికరాలు సాధనాలు, కొంత జ్ఞానం, కొద్దిపాటి సాధన అవసరం. తద్వారా, టైరు పంక్చర్‌ను నిమిషాల్లో సరిచేయవచ్చు..

కారును సురక్షిత స్థలంలో పార్క్ చేయండిప్రయాణంలో ఉన్న సమయంలో టైర్ పంక్చర్ అయితే, మొదట చేయవలసిన పని - మీ కారును ట్రాఫిక్ నుంచి దూరంగా సురక్షితమైన & చదునైన ప్రదేశానికి తీసుకెళ్లడం. అనుకూల ప్రాంతానికి చేరుకున్న తర్వాత హ్యాండ్‌బ్రేక్‌ వేయండి. ఇతర వాహనాలను హెచ్చరించేలా హజార్డ్‌ లైట్స్‌ ఆన్ చేయండి. వీలైతే మీ వాహనం చుట్టూ హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయండి. 

పంక్చర్ రిపేర్ చేయడానికి అవసరమైన సాధనాలుపంక్చర్‌ రిపేర్ చేయడానికి.. జాక్, లగ్ రెంచ్ (నట్‌లు తెరవడానికి), స్పేర్ టైర్ & రబ్బరు ప్యాచ్‌లు, గ్లూ లేదా రబ్బర్‌ సిమెంట్‌, శాండ్‌ పేపర్‌తో కూడిన టైర్ రిపేర్ కిట్ & ట్యూబ్‌లెస్ టైర్‌ల కోసం రబ్బరు స్ట్రిప్‌లు వంటి కొన్ని ముఖ్యమైన సాధనాలు అవసరం. టైర్ ప్రెజర్ గేజ్ & టైర్ ఇన్‌ఫ్లేటర్ (టైర్ పంప్) కూడా ఉండాలి. ఈ సాధనాలన్నింటినీ ఎల్లప్పుడూ కారులో ఒక చిన్న బ్యాగ్‌లో దగ్గర పెట్టుకోవడం మంచిది, తద్వారా అత్యవసర పరిస్థితుల్లో మీకు చాలా ఉపయోగపడతాయి.

పంక్చర్‌ స్పాట్‌ గుర్తించండిటైరును వేరు చేయడానికి, ముందుగా జాక్‌ను ఉపయోగించి కారును జాగ్రత్తగా పైకి ఎత్తండి. జాక్‌ ఉపయోగించే ముందు, అది కారు చాసిస్ పాయింట్ కిందే ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత, లగ్ రెంచ్ తో టైర్ నట్స్ తెరిచి టైరును కారు నుంచి వేరు చేయండి. ఇప్పుడు టైరు నుంచి గాలి పూర్తిగా తీసేసి, ట్యూబ్‌ను వేరు చేయండి. ఇప్పుడు మళ్లీ ట్యూబ్‌లో గాలి కొట్టి, నీటిలో ముంచడం ద్వారా లేదా దానిపై సబ్బు నీళ్లు చల్లడం ద్వారా పంక్చర్ పడిన ప్రదేశాన్ని కనిపెట్టవచ్చు. ట్యూబ్‌ను నీటిలో ముంచినప్పుడు లేదా నీళ్లు చల్లినప్పుడు ఎక్కడ బుడగలు వస్తే అదే పంక్చర్ స్పాట్. ఆ స్పాట్ ను మార్కర్ లేదా సుద్దతో మార్క్‌ చేయండి.

పంక్చర్‌ రిపేర్ఇప్పుడు, ట్యూబ్‌ నుంచి గాలి తీసేసి, పంక్చర్‌ గుర్తించిన ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి ఆరబెట్టండి. తర్వాత ఆ ప్రాంతాన్ని శాండ్‌ పేపర్‌తో పైపైన రుద్దండి, తద్వారా ప్యాచ్ బాగా అంటుకుంటుంది. ఆ ప్రదేశంలో రబ్బరు సిమెంట్ లేదా గ్లూ పూయండి & రబ్బరు ప్యాచ్‌ను దానిపై గట్టిగా అతికించండి. ప్యాచ్‌ను కొన్ని నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత ట్యూబ్‌ను తిరిగి టైరులోకి ఎక్కించి గాలితో నింపండి. మీ బండి టైర్ ట్యూబ్‌లెస్‌ అయితే, రబ్బరు స్ట్రిప్‌ను పంక్చర్ స్పాట్‌ లోపలికి చొప్పించండి. చాలా కొద్దిపాటి సాధనతో, ఈ ప్రక్రియ చాలా సులభంగా అలవడుతుంది. 

టైర్‌ను బిగించి, పరిశీలించండిమరమ్మత్తు పూర్తయిన తర్వాత ఆ టైర్‌ను తిరిగి రిమ్‌పై ఉంచి నట్‌లను సరిగ్గా బిగించండి. ఆ తర్వాత జాక్‌ తీసేసి కారును కిందకు దించండి. ఇప్పుడు, టైర్ ప్రెజర్ గేజ్‌తో గాలి పీడనాన్ని చెక్‌ చేయండి & అవసరమైతే టైర్ పంపుతో మళ్లీ గాలిని నింపండి. ఆ తర్వాత కారును కొద్ది దూరం నడపండి & టైర్‌లో ఇంకెక్కడి నుంచయినా గాలి బయటకు పోతుందేమో చూసుకోండి. ఇంతే, మీ కార్‌ టైర్‌ పంక్చర్‌ ప్రాబ్లెమ్‌ను ఎవరి సాయం లేకుండా మీరే సాల్వ్‌ చేయవచ్చు. మీకు అలవాటైతే, ఈ ప్రక్రియ మొత్తాన్ని నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీ కారు ఎప్పుడూ స్పేర్ టైర్ & అవసరమైన పనిముట్లను ఉంచుకోండి. రాత్రి సమయంలో లేదా హైవేలో టైర్ పంక్చర్ అయితే ఎక్కువ జాగ్రత్తగా ఉండండి & టార్చ్ లేదా ఫ్లాష్‌లైట్‌ను మీతో ఉంచుకోండి.