Nissan Tekton Price And Features: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నిస్సాన్ తన కొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీ 'టెక్టాన్‌'ను అధికారికంగా విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.49 లక్షలు. ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ & శక్తిమంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో ప్రజలను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ ఎస్‌యూవీకి ఇప్పటికే బుకింగ్‌లు స్టార్ట్‌ కాగా, జులై 20 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రెనాల్ట్ డస్టర్ ఆధారంగా నిస్సాన్ టెక్టాన్‌ను డిజైన్‌ చేశారు.

ఆరు వేరియంట్లునిస్సాన్ టెక్టాన్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వాటిలో విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్ కనెక్టా, టెక్నా & టెక్నా ప్లస్ ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.18.59 లక్షల వరకు ఉన్నాయి. ధరల పరంగా ఇది రెనాల్ట్ డస్టర్‌కు సమానంగా ఉండటం విశేషం.

ఇంజిన్ టెక్టాన్‌లో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. 1.0 లీటర్ మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 హెచ్‌పీ శక్తి & 166 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. మరోవైపు 1.3 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ 163 హెచ్‌పీ శక్తి & 280 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మారుతి కారు కొనాలనుకుంటున్నారా? ఈ నెలలో రూ.2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!

పనితీరు 1.0 లీటర్ ఇంజిన్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 12.46 సెకన్లలో చేరుకోగలదని కంపెనీ తెలిపింది. దీని మైలేజ్ లీటర్‌కు 19.4 కిలోమీటర్లగా ప్రకటించింది. 1.3 లీటర్ మాన్యువల్ వెర్షన్ 9.51 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, DCT వెర్షన్‌కు 9.89 సెకన్లు పడుతుందని తెలిపింది. ఈ రెండు వెర్షన్ల మైలేజ్ వరుసగా లీటర్‌కు 17.8 & 18.5 కిలోమీటర్లు.

డిజైన్ టెక్టాన్‌కు నిస్సాన్ పెట్రోల్ స్ఫూర్తితో బోల్డ్ లుక్‌ను అందించారు. ముందు భాగంలో నిలువుగా ఉన్న గ్రిల్, స్లిమ్ LED హెడ్‌ల్యాంప్స్, పూర్తి వెడల్పున LED డే టైమ్ రన్నింగ్ లైట్, ఆకర్షణీయమైన బంపర్ ఈ ఎస్‌యూవీకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. పక్క భాగంలో కొత్త 18 అంగుళాల అలాయ్ వీల్స్, వెనుక భాగంలో పూర్తి వెడల్పున LED లైట్ బార్ & స్పోర్టీ స్పాయిలర్ ఆకట్టుకుంటాయి.

లోపలి భాగంలో డ్యూయల్ టోన్ రోజ్ గోల్డ్ & బర్గండీ థీమ్‌ను అందించారు. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, లెదరెట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ ముందు సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: యమహా నుంచి ప్రీమియం స్పోర్టీ ఎలక్ట్రిక్‌ స్కూటర్ - Aerox Electric ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

భద్రత సేఫ్టీలోనూ నిస్సాన్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ముందు & వెనుక పార్కింగ్ సెన్సర్లు వంటి ఆధునిక భద్రత ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్‌కు 5 స్టార్ భారత్ NCAP రేటింగ్ లభించింది. గ్లోబల్ NCAPలో కూడా 5 స్టార్ రేటింగ్ సాధించే సామర్థ్యం ఉందని నిస్సాన్ వెల్లడించింది.

కొత్త నిస్సాన్ టెక్టాన్ మార్కెట్‌లో Renault Duster, Hyundai Creta, Kia Seltos, Tata Sierra, Maruti Victoris, Maruti Grand Vitara, Toyota Hyryder, Citroen Aircross, Skoda Kushaq, Volkswagen Taigun, MG Astor వంటి ప్రముఖ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.