Car AC Cooling Problems And Solutions: కారు ఏసీ కేవలం ఒక ఫీచర్ మాత్రమే కాదు, అవసరం కూడా. మారిన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, కారులో ఏసీ లేకపోతే ఓవెన్‌లో కూర్చుని ప్రయాణించినట్లు ఉంటుంది, గమ్యస్థానం చేరేసరికి ప్రయాణీకులు ఫ్రై అవుతారు. కారు ఏసీ మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి బదులు అసౌకర్యానికి గురి చేస్తుంటే, దానికి కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ కారు ఏసీ గాలి తగినంత చల్లగా లేకపోతే, దాని మూడు ప్రధాన కారణాలు & సులభమైన పరిష్కారాలు ఉన్నాయి.

1. తక్కువ రిఫ్రిజెరాంట్ (ఫ్రియాన్) స్థాయిఫ్రియాన్ (freon) అని పిలిచే రిఫ్రిజెరాంట్ (refrigerant), కారు AC వ్యవస్థలో చల్లని గాలిని అందించే ఒక గ్యాస్‌. ఈ గ్యాస్‌ అయిపోతే AC సరిగ్గా చల్లబడదు. ఫ్రియాన్ లెవెల్‌ తగినంత లేదనడానికి సంకేతాలు: AC ఆన్ చేసిన తర్వాత కూడా చల్లని గాలి లేకపోవడం లేదా ప్రారంభంలో కొన్ని నిమిషాలు చల్లబడిన తర్వాత వేడి గాలి బయటకు రావడం. దీనికి పరిష్కారం - అనుభవజ్ఞుడైన మెకానిక్ వద్దకు లేదా సర్వీస్ సెంటర్‌కు వెళ్లి AC సిస్టమ్‌ ప్రెజర్‌ను & గ్యాస్ స్థాయిని తనిఖీ చేయించాలి, గ్యాస్‌ అవసరమైతే తిరిగి నింపించాలి. అలాగే, ఎక్కడైనా లీకేజీ ఉందేమో కనుక్కోవడానికి సిస్టమ్‌ను చెక్‌ చేయించాలి.

2. కండెన్సర్‌లో దుమ్ము పేరుకుపోవడంకండెన్సర్ (Condenser) అనేది AC వ్యవస్థలో వేడిని తొలగించి రిఫ్రిజెరాంట్‌ను చల్లబరుస్తుంది. దుమ్ము, ధూళి లేదా కీటకాలు దానిలో పేరుకుపోతే అది తన పనిని సరిగా చేయలేదు. ఈ సమస్య AC కూలింగ్‌ను తగ్గిస్తుంది. దీనికి సంకేతాలు: కారు పార్క్ చేసినప్పుడు చల్లదనం చాలా తక్కువగా ఉంటుంది, అయితే నడుస్తున్నప్పుడు చల్లదనం కొంచెం మెరుగ్గా ఉండవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి కండెన్సర్‌ను మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్‌తో శుభ్రం చేయాలి. అవసరమైతే వాటర్ జెట్‌తో కడగాలి. 

3. కంప్రెసర్ పని చేయకపోవడంకంప్రెసర్‌ (Compressor) అనేది AC గుండె లాంటిది. ఎందుకంటే, ఇది చల్లటి గాలిని ఉత్పత్తి చేయడానికి రిఫ్రిజెరాంట్‌ను కంప్రెస్‌ చేస్తుంది. దీని బెల్ట్ వదులుగా ఉన్నా లేదా విరిగిపోయినా లేదా కంప్రెసర్ జామ్ అయినా AC పని చేయదు. AC ఆన్ చేసినప్పుడు వింత శబ్దాలు వినిపిస్తాయి లేదా చల్లని గాలి అస్సలు రాదు. కంప్రెసర్ పనితీరుపై ఓ కన్నేయడానికి ఇలాంటి సంకేతాలను గమనిస్తుండాలి. కారులోని AC చాలా కాలం ఉపయోగించకపోతే కంప్రెసర్‌ స్ట్రక్‌ కావచ్చు. పరిష్కారాలు - కారును సర్వీస్ సెంటర్‌లో చెక్‌ చేయించాలి & బెల్ట్ దెబ్బతింటే వెంటనే దాన్ని మార్చాలి. అవసరమైతే, కంప్రెసర్‌ను రిపేర్ కూడా చేయాల్సి రావచ్చు లేదా మార్చాల్సి రావచ్చు.

క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ దుమ్ముతో మూసుకుపోయినా అది AC కూలింగ్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ప్రతి 6 నెలలకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్‌ను తనిఖీ చేయండి & ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి.