India Car Colour Trends 2025: కారు కొనుగోలు చేసే సమయంలో మైలేజ్‌, ఫీచర్లు, ధరతో పాటు చాలా మంది ముఖ్యంగా చూసే విషయం కలర్‌. "ఏ రంగులో తీసుకుంటే బాగుంటుంది?", "రీసేల్‌ విలువ ఏ కలర్‌కు ఎక్కువ ఉంటుంది?" అనే ప్రశ్నలు చాలా సాధారణం. ఈ నేపథ్యంలో BASF కలర్‌ రిపోర్ట్‌ 2025 ప్రకారం భారత్‌లో కారు కొనుగోలుదార్ల కలర్‌ అభిరుచులు ఎలా ఉన్నాయో ఇప్పుడే లెక్కలతో సహా తెలుసుకుందాం.

Continues below advertisement

2025లోనూ తెలుపు రంగుకే అగ్రస్థానం

2025లో కూడా భారత కార్‌ మార్కెట్‌లో వైట్‌ కలర్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం అమ్మకాలలో 48 శాతం కార్లు (అమ్ముడైన మొత్తం కార్లలో దాదాపు సగం కార్లు) తెలుపు రంగులోనే ఉన్నాయి. ఫ్లీట్‌ సెగ్మెంట్‌ వాహనాలు, టాక్సీలు, కార్పొరేట్‌ వినియోగం కోసం ఎక్కువగా వైట్‌ కలర్‌కే మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణం. అంతేకాదు, వైట్‌ కలర్‌ కారు పెద్దగా కనిపించడం, వేడిని తక్కువగా గ్రహించడం, రాత్రివేళల్లో ఎదుటి వాహనాలకు ఎక్కువ దూరం నుంచే కనిపించడం, మెయింటెనెన్స్‌ సులభంగా ఉండడం కూడా ప్రజలను ఈ రంగు వైపు ఆకర్షిస్తోంది.

Continues below advertisement

గ్రే కలర్‌ రెండో స్థానంలో

వైట్‌ తర్వాతి స్థానంలో గ్రే కలర్‌ నిలిచింది. మొత్తం కార్‌ అమ్మకాలలో 17 శాతం బూడిద/సిమెంట్‌ రంగులో ఉన్నాయి. అయితే, తెలుగు రంగుకు ఉన్న డిమాండ్‌తో పోలిస్తే ఇది సగం కూడా కాదు. ప్రీమియం కార్లు, SUV తరహాలో ఉండే వాహనాల్లో గ్రే కలర్‌కు మంచి ఆదరణ కనిపిస్తోంది. మోడర్న్‌ లుక్‌, డస్ట్‌ తక్కువగా కనిపించడం వల్ల చాలా మంది ఈ రంగును ఎంచుకుంటున్నారు.

నలుపు రంగుకు మూడో స్థానం

ఇటీవల వచ్చిన డార్క్‌ ఎడిషన్‌ మోడళ్ల ట్రెండ్‌ వల్ల బ్లాక్‌ కలర్‌ డిమాండ్‌ పెరిగింది. 2025లో, మొత్తం కార్ల అమ్మకాల్లో బ్లాక్‌ కలర్‌ కార్లు 10 శాతం వాటాను సాధించాయి. ప్రీమియం ఫీల్‌, స్టైలిష్‌ లుక్‌ కావాలనుకునే వారు బ్లాక్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే మెయింటెనెన్స్‌ కాస్త కష్టం కావడంతో, ఈ రంగు డిమాండ్‌ పరిమితంగానే ఉంది.

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో సిల్వర్‌ హవా

వెండి రంగు కూడా 10 శాతం వాటాతో నలుపు రంగుతో సమానంగా నిలిచింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసే వారిలో సిల్వర్‌ కలర్‌కు మంచి ఆదరణ ఉంది. ఫ్యూచరిస్టిక్‌ లుక్‌, క్లీన్‌గా కనిపించడం వల్ల ఈ రంగు EV కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

బ్లూ కలర్‌కు స్థిరమైన డిమాండ్‌

2025లో బులుగు/నీలం రంగు కార్లు 7 శాతం మార్కెట్‌ వాటాను నమోదు చేశాయి. యూత్‌, ఫ్యామిలీ కార్లలో ఈ రంగు స్థిరంగా కొనసాగుతోంది. డార్క్‌ బ్లూ, లైట్‌ బ్లూ షేడ్స్‌ రెండింటికీ మంచి స్పందన లభిస్తోంది.

స్పోర్టీ రెడ్‌ కూడా వెనుకబడలేదు

స్పోర్టీ లుక్‌ ఇష్టపడే బయ్యర్లు ఎరుపు రంగు వైపు మొగ్గు చూపారు. మొత్తం అమ్మకాలలో 5 శాతం రెడ్‌ కలర్‌ కార్లు ఉన్నాయి. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్‌ కార్లలో ఈ రంగు ఎక్కువగా కనిపిస్తోంది.

గ్రీన్‌, ఆరెంజ్‌, బీజ్‌ - తక్కువ డిమాండ్‌

ఆకుపచ్చ, నారింజ రంగు, బీజ్‌ వంటి రంగులు తలో 1 శాతం వాటాతోనే సరిపెట్టుకున్నాయి. గ్రీన్‌ కలర్‌ మొత్తం మీద తక్కువగా ఉన్నా, SUV తరహాలో ఉండే వాహనాల్లో మాత్రం మంచి స్పందన కనిపించింది. ఆరెంజ్‌ కలర్‌ చాలా మందికి నచ్చకపోయినా, మొత్తంగా స్వల్పంగా 1 శాతం వృద్ధి నమోదు చేసింది. బీజ్‌, బ్రౌన్‌ టోన్స్‌ మాత్రం ఆశించినంత ఆదరణ పొందలేదు.

కొనుగోలుదారులకు ఇది ఏం చెబుతోంది?

2025లో కూడా భారత కార్‌ మార్కెట్‌లో సేఫ్‌ కలర్స్‌ ఆధిపత్యం కొనసాగింది. రీసేల్‌ విలువ, మెయింటెనెన్స్‌, ప్రాక్టికాలిటీ ఇవన్నీ చూసుకుని ఎక్కువ మంది వైట్‌, గ్రే వంటి రంగులను ఎంచుకున్నారు. అయితే యూత్‌, ప్రీమియం సెగ్మెంట్‌లో మాత్రం బ్లాక్‌, బ్లూ, రెడ్‌ లాంటి రంగులు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి.

మొత్తంగా చూస్తే, 2025లో కార్‌ కొనుగోలు ట్రెండ్స్‌ చూస్తే - వైట్‌ ఇప్పటికీ కింగ్‌. ఇతర రంగులు కూడా నెమ్మదిగా అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.