Skoda Kushaq Facelift: మన కార్ల మార్కెట్‌లో, స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి హాట్ హాట్ చర్చ జరుగుతోంది, దీనిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కుషాక్ కొత్త వెర్షన్‌లో స్కోడా తీసుకొస్తున్న అత్యంత కీలకమైన మార్పు ఏటంటే - 1.0 లీటర్ TSI ఇంజిన్‌కు కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్‌ను తొలగించి, ఎందుకు ఈ కొత్త గేర్‌బాక్స్‌ను తీసుకొస్తోంది అనే ప్రశ్న ఇప్పుడు చాలామందిలో ఉంది.
ఈ ప్రశ్నకు స్కోడా ఇచ్చే సమాధానం చాలా స్పష్టంగా ఉంది - ఖర్చు తగ్గింపు. ఇప్పటివరకు కుషాక్‌లో ఉపయోగించిన 6-స్పీడ్ Aisin ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జపాన్ నుంచి దిగుమతి చేసుకునేది. దిగుమతి ఖర్చులు, లాజిస్టిక్స్, కరెన్సీ మార్పులు వంటివన్నీ కలిసొచ్చి కంపెనీకి ఖర్చు పెరిగేది.
చైనా నుంచి దిగుమతిఇప్పుడు కొత్తగా ఇస్తున్న Aisin AQ300 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చైనాలో భారీ స్థాయిలో తయారవుతోంది. తయారీ ఖర్చు పరంగా చైనా ప్రపంచంలోనే బెటర్‌గా ఉంటుంది. స్కోడా తీసుకున్న ప్రధాన నిర్ణయానికి ఇదే బేస్. ఈ కొత్త గేర్‌బాక్స్ గత యూనిట్‌తో పోలిస్తే 10 నుంచి 15 శాతం వరకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీఖర్చు ఒక్కటే కాదు, ఈ కొత్త 8-స్పీడ్ గేర్‌బాక్స్ మరో కీలక లాభాన్ని కూడా ఇస్తుంది, అదే 'మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ'. అదనంగా రెండు గియర్లు (6 బదులు 8) ఉండటంతో, ప్రతి గేర్ మధ్య మార్పు మరింత సాఫీగా జరుగుతుంది. దీని వల్ల వేగం పెంచేటప్పుడు, తగ్గించేటప్పుడు ఇంజిన్‌పై లోడ్ తగ్గుతుంది. ఫలితంగా ఇంధనం వృథా కాకుండా పూర్తిగా ఉపయోగపడుతుంది.
స్టాండర్డ్ డ్రైవింగ్ సైకిల్స్‌లో ఈ మార్పు వల్ల మైలేజ్ పెరగడమే కాకుండా CO2 ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ప్రస్తుతం కఠినమవుతున్న ఉద్గారాల నిబంధనల దృష్ట్యా, ఇది స్కోడా కోసం చాలా కీలకమైన అడుగు.
ఈ కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కేవలం కుషాక్‌కే పరిమితం కాబోదు. రాబోయే రోజుల్లో ఫేస్‌లిఫ్ట్‌కు వచ్చే టైగున్, విర్టస్, స్లావియా వంటి స్కోడా-వోక్స్‌వ్యాగన్ (Skoda -VW) 2.0 కార్లలో కూడా ఇదే గేర్‌బాక్స్ చూడొచ్చని సమాచారం.
మరికొన్ని ఆకర్షణీయమైన అప్‌డేట్స్‌గేర్‌బాక్స్ మార్పుతో పాటు, కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో మరికొన్ని ఆకర్షణీయమైన అప్‌డేట్స్ ఉన్నాయి. కొత్త డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, ఇంకా ఈ సెగ్మెంట్‌లో తొలిసారి రియర్ సీట్లకు మసాజ్ ఫంక్షన్ కూడా అందుబాటులోకి రానుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, 115hp 1.0 లీటర్ TSI, 150hp 1.5 లీటర్ TSI యూనిట్లు మార్పుల్లేకుండా కొనసాగుతాయి. ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్ జరుగుతున్న ఈ కారు ధరలను స్కోడా త్వరలో ప్రకటించనుంది.
మొత్తానికి, కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్కోడా తీసుకున్న ఒక స్మార్ట్ స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పవచ్చు. దీనివల్ల కంపెనీకి ఖర్చు తగ్గింపు, వినియోగదారుడికి మెరుగైన మైలేజ్ - ఇద్దరికీ లాభం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.