Car Tips: మీరు మీ కారు, స్కూటర్ లేదా మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపారా? ఇలాంటి సమయంలో వాహన కంపెనీ క్లెయిమ్ చేసిన మొత్తం కంటే ఎక్కువ ఇంధనం ట్యాంక్‌లో పట్టడం మీరు చూసే ఉంటారు. దీని కారణంగా పెట్రోల్ బంక్ వాళ్లు మోసం చేశారని వారితో గొడవలు కూడా పెట్టుకుని ఉంటారు. అయితే మీరు ఇది చదవాల్సిందే. 2023 మార్చి 6వ తేదీన జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ వాహన యజమానులకు ఇంధన ట్యాంక్‌ను పూర్గిగా నింపవద్దని ఒక సలహాను జారీ చేసింది.


వినియోగదారుల మాన్యువల్‌లో కెపాసిటీ తక్కువగా
మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల సర్వీస్ మాన్యువల్స్‌లో ట్యాంక్ కెపాసిటీ తప్పుగా ఉందని లీగల్ మెట్రాలజీ విభాగానికి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సమాచారం అందించింది. అందులో ఇంధన ట్యాంక్ సామర్థ్యం గురించి కూడా తెలిపారు. వాహనాల వినియోగదారుల మాన్యువల్‌లో దాని వాస్తవ సామర్థ్యం కంటే 15 నుంచి 20 శాతం వరకు తక్కువగా తెలిపారు..


కారణం ఏంటి?
ఎందుకంటే ఇంధన పంపుల వద్ద ఇంధనం భూగర్భ ట్యాంకులలో ఉంచుతారు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇంధనం అనేది ఒక అస్థిర కర్బన సమ్మేళనం. దీని వాల్యూమ్ ఉష్ణోగ్రతతో పెరుగుతుంది. గ్యాసోలిన్ ఆవిరి కావడానికి కొంత ఖాళీ ప్రదేశం అవసరం. అది లేకపోతే ఇంధనం పనితీరు దెబ్బతింటుంది.


దీంతోపాటు వాహనాల నుంచి వెలువడే హైడ్రోకార్బన్ ఉద్గారాల మొత్తం పెరుగుతుంది. అలాగే వాహనం ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపి, దాన్ని చదునుగా లేని ప్రదేశంలో పార్క్ చేసినట్లయితే ఇంధనం లీకేజ్ అయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. అది అగ్ని ప్రమాదాలకు కూడా కారణం కావచ్చు.


మంత్రివర్గం ఏం అంటోంది?
ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపే బదులు ట్యాంక్‌లో పేర్కొన్న సామర్థ్యం కంటే తక్కువ ఇంధనాన్ని నింపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ వాహనాల వినియోగదారులకు సూచించింది. ఇటీవలి కాలంలో తమ వాహనంలో కంపెనీ పేర్కొన్న సామర్థ్యం కంటే ఎక్కువ ఇంధనాన్ని నింపినట్లు చాలా మంది వినియోగదారుల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో సరైన కారణం తెలియక ఫ్యూయల్ ట్యాంకులపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది. దీని కారణంగా పలు చోట్ల తీవ్ర వాగ్వాదం, వాదోపవాదాలు కూడా చోటు చేసుకున్నాయి.


BS6 ఫేజ్ 2 (కొత్త RDE నిబంధనలు) ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారతదేశంలో ప్రారంభం కానుంది. సమాచారం ప్రకారం కొత్త RDE నిబంధనలను ప్రవేశపెట్టడంతో కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను రెండు నుంచి నాలుగు శాతం పెంచడానికి సిద్ధమవుతున్నారు. అంటే వివిధ వాహనాల తయారీ, మోడల్ ప్రకారం ఇది సుమారు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు పెరగవచ్చు. మరోవైపు, మారుతీ, మహీంద్రా & మహీంద్రా, హోండా, ఎంజీ, కియా వంటి అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల పెరిగిన ధరలను త్వరలో ప్రకటించవచ్చు. అదే సమయంలో వాణిజ్య వాహన తయారీదారులు తమ వాహనాలపై ఐదు శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించడం ప్రారంభించారు.