Indian Driving Licence Abroad: విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అక్కడ స్వయంగా కార్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. కేవలం ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ & వీసా ఉన్నంత మాత్రాన విదేశాల్లో చట్టబద్ధంగా డ్రైవ్ చేయలేరు.

Continues below advertisement

విదేశాల్లో డ్రైవింగ్ చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) అవసరం. ఇది మీ భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చే అధికారిక పత్రం.       

IDP అంటే ఏమిటి?

Continues below advertisement

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది ఐక్యరాజ్యసమితి ఒప్పందాల ఆధారంగా జారీ చేసే పత్రం. ఇది మీ డ్రైవింగ్ అర్హతలను అనేక భాషల్లో అనువదించి విదేశీ అధికారులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది.

ఈ IDP 150కి పైగా దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. ఇందులో మీ ఫోటో, వ్యక్తిగత వివరాలు, మీరు నడపగల వాహనాల కేటగిరీలు ఉంటాయి.

సాధారణంగా, IDP జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుతుంది. విదేశాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు IDPతో పాటు మీ ఒరిజినల్ ఇండియన్ లైసెన్స్, పాస్‌పోర్ట్ కూడా తప్పనిసరిగా మీ వెంట ఉండాలి.

ఎక్కడ అప్లై చేయాలి?

IDP కోసం అప్లై చేయడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ (Ministry of Road Transport and Highways) నిర్వహిస్తున్న పరివాహన్‌ పోర్టల్‌ (Parivahan Portal) ద్వారా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.

ఎలా అప్లై చేయాలి?

IDP కోసం Form 4A నింపాలి. ఈ ఫారం పరివాహన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

అప్లికేషన్ సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు:

చెల్లుబాటు అయ్యే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ

Form 1Aలో మెడికల్ సర్టిఫికేట్

పాస్‌పోర్ట్ ప్రూఫ్

వీసా ప్రూఫ్ (అవసరమైతే)

నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

రూ. 1,000 ఫీజు

ఈ ఫీజును UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆధార్ ధృవీకరణ లేదా స్థానిక RTO వద్ద అపాయింట్‌మెంట్ అవసరం కావచ్చు.

అప్లికేషన్ సమర్పించి ధృవీకరణ పూర్తయిన తర్వాత సాధారణంగా 3 నుంచి 7 పని దినాల్లో IDP ని మీ నమోదిత చిరునామాకు పంపిస్తారు.

ఎందుకు అవసరం?

కొన్ని దేశాల్లో IDP లేకుండా కారును అద్దెకు తీసుకోవడం లేదా డ్రైవ్ చేయడం అసాధ్యం. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే IDP పొందడం మంచిది.

విదేశాల్లో స్వేచ్ఛగా డ్రైవింగ్ చేసి మంచి అనుభవం పొందాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తప్పనిసరి. కేవలం ఇండియన్ లైసెన్స్ మాత్రమే మీకు సరిపోదు. ప్రయాణానికి ముందు సరైన పత్రాలు సిద్ధం చేసుకుని చట్టబద్ధంగా డ్రైవ్ చేయండి. ప్లానింగ్ సరిగా ఉంటే విదేశీ ప్రయాణం మరింత సులభం అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.