Small Cars In India 2026: భారత్‌లో చిన్న కార్లకు మళ్లీ మంచి రోజులు వచ్చే సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు దేశ కార్ల మార్కెట్‌ను చిన్న కార్లే ముందుండి నడిపించాయి. ఇప్పుడు SUVల హవా పెరిగింది, పెద్ద కార్లకు డిమాండ్ ఎక్కువైంది. దీంతో ఎంట్రీ లెవల్ కార్లపై కంపెనీల ఫోకస్‌ తగ్గింది. అయితే పరిస్థితులు ఇప్పుడు మారుతున్నాయి.

Continues below advertisement

CAFE 3 నిబంధనలు మరో ఎనిమిది నెలల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో కార్ల తయారీ సంస్థలపై ఒత్తిడి మరింత పెరగనుంది. వాహనాల కాలుష్యాన్ని తగ్గించాలి, ఇంధన సామర్థ్యాన్ని పెంచాలి & తక్కువ బరువున్న కార్లను తీసుకురావాలి. అంతేకాదు, ప్రస్తుతం భారీ సంఖ్యలో ఉన్న SUVల విషయంలోనూ కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది.

ఇక్కడే చిన్న కార్లకు కొత్త అవకాశం కనిపిస్తోంది.CAFE 3 నిబంధనల్లో భాగంగా, ఫ్లీట్-సగటు పనితీరులో 30 శాతం వరకు తగ్గింపు సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇప్పటివరకు ఉపయోగిస్తున్న MIDC పరీక్షా విధానానికి బదులుగా WLTP ప్రమాణాలను అనుసరించాల్సి ఉంటుంది. దీంతో కంపెనీలకు కొత్త నిబంధనలను అందుకోవడం అంత సులభం కాదు. అందుకే, కార్ల కంపెనీలు చిన్న కార్లపై మళ్లీ దృష్టి సారిస్తున్నాయి. ఇది కేవలం నిబంధనలను పాటించే మార్గమే కాదు కాదు, భవిష్యత్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకునే వ్యూహం కూడా.

Continues below advertisement

ఇది కూడా చదవండి: మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!

చిన్న కార్లకు డిమాండ్ కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉందని అనుకోవడం తప్పు. యూరప్‌లోనూ చిన్న కార్లపై ఆసక్తి పెరుగుతోంది. అమెరికాలోనూ తక్కువ ఖర్చుతో, మెరుగైన సామర్థ్యంతో ఉండే వాహనాలున్నాయి. జపాన్‌ అయితే చిన్న కార్లకు ఎప్పటి నుంచో పెద్ద మార్కెట్‌గా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కారు కొనుగోలుదార్ల ఆలోచనలో మార్పు వస్తోంది. తక్కువ ఖర్చుతో కొనాలి, సౌకర్యంగా ఉండాలి, అధునాతన ఫీచర్లు ఉండాలి, కారు రూపం ఆకర్షించాలి, అదే సమయంలో కాలుష్యం కూడా తగ్గాలి. అంటే చిన్న కారు అయినా నాణ్యతలో రాజీ పడకూడదన్న మాట.

ఈ దిశగా ఇప్పటికే కొన్ని కంపెనీలు అడుగులు వేశాయి. సిట్రోయెన్‌ అమి, ఫియట్‌ టొపొలినో, ఫియట్‌ మల్టిప్లా, రెనో 5, ఆల్పైన్‌ A290, నిస్సాన్‌ మైక్రా, స్మార్ట్‌ ఫోర్‌టూ, హోండా సూపర్‌ ఎన్‌, మైక్రోలినో, మైక్రోలెట్టా వంటి మోడళ్లు ఇందుకు ఉదాహరణలు. ఇవి కేవలం చౌక ధర కార్లు కావు. వీటిలో బ్యాటరీతో నడిచే వాహనాలు ఉన్నాయి, మంచి పెర్ఫార్మెన్స్‌ అందించే మోడళ్లు ఉన్నాయి. వీటిలో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి, ఆకర్షణీయమైన డిజైన్ ఉంది. అందుకే యువత నుంచి వృద్ధుల వరకు ఇప్పుడు వీటిపై ఆసక్తి పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!

భారత్‌ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. దేశంలో కార్ల వినియోగం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. చైనా స్థాయి మార్కెట్‌లో కనీసం సగానికి చేరుకోవాలంటే కోట్లాది ద్విచక్ర వాహనదార్లను కార్ల వైపు తీసుకురావాలి. అందుకు చిన్న కార్లే కీలకం. అవి EVలైనా, CNG కార్లయినా, హైబ్రిడ్ వాహనాలైనా సరే. మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటా, టాటా, హోండా వంటి సంస్థలు ఈ విభాగాన్ని మళ్లీ బలోపేతం చేయాలి

చిన్న కారు అంటే తక్కువ స్థాయి కారు అనే భావనను కంపెనీలు మార్చాలి. తక్కువ ధరలో మంచి నాణ్యత, మెరుగైన భద్రత, ఆధునిక ఫీచర్లు అందించాలి. అప్పుడే భారత్‌ మరోసారి చిన్న కార్లకు ప్రపంచ కేంద్రంగా ఎదుగుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.