Electric Cars EV Sales 2025 India: భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 2025లో మరో కీలక దశకు చేరింది. వాహన్ డేటా ఆధారంగా చూస్తే, 2025 క్యాలెండర్ ఇయర్‌లో, Tata Motors ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆధిపత్యం ప్రదర్శించింది, అగ్రస్థానంలో నిలిచింది. టాటా తర్వాత JSW MG Motor India, Mahindra Electric, Hyundai Motor India, BYD India టాప్ 5లో కొనసాగుతున్నాయి.
టాటా ఎందుకు ముందుంది?
2025 ముగిసే సమయానికి, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, మొత్తం 65,264 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో నిలిలించి. ఈ విజయానికి ప్రధాన కారణం... అందుబాటు ధరల సెగ్మెంట్‌లో టాటా బలమైన ఉనికి. Punch EV, Nexon EV మోడళ్లు సిటీలతో పాటు చిన్నపాటి టౌన్‌లలోనూ మంచి డిమాండ్ తెచ్చిపెట్టాయి. అంతేకాదు, టాటా తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను ఇంకా విస్తరించింది. కాంపాక్ట్, మిడ్-సైజ్ EVలకే పరిమితం కాకుండా, Harrier EV లాంటి పెద్ద సెగ్మెంట్ మోడళ్లతో అధిక ధరల విభాగంలోనూ అడుగుపెట్టింది. ఈ విస్తృతమైన శ్రేణే టాటాను మిగతా కంపెనీల కంటే ముందుంచింది.
రెండో స్థానంలో MG - పరిమిత మోడళ్లతోనే పెద్ద ప్రభావం
JSW MG Motor India, 2025లో, 50,356 రిజిస్ట్రేషన్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ మోడళ్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, MG తన వ్యూహాన్ని చాలా సమర్థంగా అమలు చేసింది. Windsor EV ఈ కంపెనీ సేల్స్‌కు ప్రధాన డ్రైవర్‌గా మారింది. ధర పరంగా Nexon EVకు దగ్గరగా ఉండటంతో పాటు, లోపలి భాగంలో మరింత ప్రీమియం అనుభూతిని ఇవ్వడం దీని బలం. అదే సమయంలో చిన్న సైజ్, సులభమైన డ్రైవింగ్‌తో Comet EV పట్టణ మార్కెట్లలో మంచి స్పందన సాధించింది. ఈ రెండు మోడళ్లే MGని టాప్-2లో నిలిపాయి.
ప్రీమియం సెగ్మెంట్‌కే పరిమితమైన మహీంద్రా
Mahindra Electric Automobile, 2025లో, 29,917 రిజిస్ట్రేషన్లతో మూడో స్థానంలో ఉంది. Tata, MGతో పోలిస్తే మహీంద్రా వ్యూహం పూర్తిగా భిన్నం. మహీంద్రా ఎలక్ట్రిక్ మోడళ్లు ఎక్కువగా ప్రీమియం SUV సెగ్మెంట్‌పైనే దృష్టి పెట్టాయి. BE 6, XEV 9e, తాజాగా లాంచ్ చేసిన XEV 9s మోడళ్లే ప్రధానంగా విక్రయాలను తీసుకొచ్చాయి. ఎంట్రీ లెవల్ EVలపై దృష్టి లేకపోవడం వల్ల వాల్యూమ్ పరంగా మహీంద్రా కొంత వెనుకబడింది.
ఒక్క మోడల్‌తో టాప్ 5లో హ్యుందాయ్
Hyundai Motor India, 2025లో, సుమారు 6,685 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లతో నాలుగో ర్యాంక్ సాధించింది, టాప్ 5లో ఒకటిగా నిలిచింది. హ్యుందాయ్ వద్ద ప్రస్తుతం మాస్ మార్కెట్‌లో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ కారు Creta EV మాత్రమే. ఆప్షన్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ఒక్క మోడల్‌తోనే హ్యుందాయ్ టాప్ బ్రాండ్ల జాబితాలో కొనసాగడం విశేషం.
ప్రీమియం మార్కెట్‌లో BYD స్థిరత్వం
BYD India, 2025 సంవత్సరాన్ని సుమారు 5,098 రిజిస్ట్రేషన్లతో ముగించింది. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, BYD తన ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను నిలబెట్టుకోగలిగింది. లోకల్‌గా అభివృద్ధి చేసిన EVలతో పోలిస్తే ఈ కంపెనీ రేట్లు అధికంగా ఉన్నా, స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది.
టాప్ 5 తర్వాత పరిస్థితి ఎలా ఉంది?
టాప్ 5 తర్వాత, VinFast Auto India, 2025లో 798 యూనిట్లతో ముందంజలో నిలిచింది. లోకల్ తయారీ వల్ల VF6, VF7 మోడళ్లకు ధర పరంగా కొంత లాభం దక్కింది.
Tesla India Motors and Energy మాత్రం 223 యూనిట్లకే పరిమితమైంది. Model Y పూర్తి యూనిట్ రూపంలో దిగుమతి చేసుకోవడం, అధిక దిగుమతి సుంకాల కారణంగా దీని ధర సుమారు ₹60 లక్షల వరకు చేరుతోంది.
లగ్జరీ EV సెగ్మెంట్‌లో Mercedes-Benz, BMW, Audi, Porsche, Volvo వంటి బ్రాండ్లు ఇప్పటికీ తక్కువ నంబర్లకే పరిమితమయ్యాయి.
మొత్తంగా చూస్తే, 2025 భారత EV మార్కెట్‌లో టాటా ఆధిపత్యం స్పష్టంగా కనిపించిన సంవత్సరం. అదే సమయంలో MG, మహీంద్రా తమ తమ వ్యూహాలతో బలంగా నిలిచాయి. రాబోయే సంవత్సరాల్లో కొత్త మోడళ్లతో ఈ పోటీ మరింత ఉత్కంఠగా మారే అవకాశాలు ఉన్నాయి.
గమనిక: పైన చెప్పిన నంబర్లు, వాహన్ డేటా ప్రకారం, 2025 డిసెంబర్ 31 వరకు ఉన్న రిజిస్ట్రేషన్లు. అదే రోజు కాస్త ఆలస్యంగా జరిగిన రిజిస్ట్రేషన్ల కారణంగా నంబర్లు స్వల్పంగా మారవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.