India EU FTA Effect On European Car Import Duty: భారత్‌లో విదేశీ లగ్జరీ కార్లను కొనాలంటే ఇప్పటి వరకు భారీ టాక్స్‌ భారం తప్పనిసరిగా ఉండేది. యూరప్‌ నుంచి పూర్తిగా తయారైన కార్లు దిగుమతి చేస్తే 70 శాతం నుంచి 110 శాతం వరకు ఇంపోర్ట్‌ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ఇండియా - యూరోప్‌ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (India - European Union Free Trade Agreement (FTA)) వల్ల ఈ టాక్స్‌ల భారం క్రమంగా తగ్గనుంది.

ఈ FTA ప్రకారం, యూరప్‌ నుంచి దిగుమతి అయ్యే కార్లపై టారిఫ్‌లు దశలవారీగా తగ్గిస్తారు. ఇప్పుడు గరిష్టంగా 110 శాతం ఉన్న ఇంపోర్ట్‌ డ్యూటీని వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో కేవలం 10 శాతానికి తీసుకురావాలని ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 2,50,000 కార్లకు ఈ తగ్గించిన టాక్స్‌ వర్తిస్తుంది. ఇవన్నీ పూర్తిగా తయారైన కార్లు అంటే CBU (Completely Built Unit) కేటగిరీలోకి వస్తాయి.

ప్రస్తుతం ఉన్న టాక్స్‌ పరిస్థితి ఏంటి?

ఇప్పుడు భారత్‌లో USD 40,000 కంటే తక్కువ ధర ఉన్న కార్లపై 70 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ ఉంటుంది. అదే USD 40,000 కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై అయితే ఏకంగా 110 శాతం వరకు టాక్స్‌ వసూలు చేస్తారు. పూర్తిగా విడిభాగాలుగా దిగుమతి చేసే CKD యూనిట్స్‌ పై 16.5 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ అమల్లో ఉంది.

FTA తర్వాత ఏం మారబోతోంది?

ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తర్వాత USD 17,800 (సుమారు రూ. 16.31 లక్షలు) కంటే ఎక్కువ ధర ఉన్న యూరప్‌ కార్లకే తగ్గించిన టారిఫ్‌లు వర్తిస్తాయి. ఈ కార్లను మూడు సెగ్మెంట్లుగా విభజించి, మొదట 30-35 శాతం టాక్స్‌ విధిస్తారు. ఆ తర్వాత 5 నుంచి 10 సంవత్సరాల్లో దాన్ని క్రమంగా 10 శాతానికి తగ్గిస్తారు.

మరో కీలక అంశం ఏమిటంటే, ఆటో విడిభాగాలపై ఉన్న టాక్స్‌ను కూడా 5 నుంచి 10 సంవత్సరాల్లో పూర్తిగా తొలగిస్తారు. దీని వల్ల భారత్‌లో అసెంబ్లీ చేసే (విదేశాల నుంచి విడిభాగాలు తెచ్చి భారత్‌లో కారు తయారు చేయడం) కార్ల ధరలు కూడా కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది.

ఎలక్ట్రిక్‌ కార్లకు ఇప్పుడే లాభమా?

ప్రస్తుతం ఈ ఒప్పందం ప్రయోజనాలు మొదటగా పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఉన్న ICE కార్లకే వర్తిస్తాయి. ఎలక్ట్రిక్‌ కార్లను మొదటి 5 సంవత్సరాలు ఈ ఒప్పందం నుంచి పక్కన పెట్టారు. దేశీయ ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమలో పెట్టుబడులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఏ కార్లు ఎక్కువగా లాభపడతాయి?

Mercedes-Benz, BMW, Audi, Volvo, Jaguar Land Rover లాంటి బ్రాండ్లు ఇప్పటికే భారత్‌లోనే ఎక్కువ మోడళ్లను అసెంబుల్‌ చేస్తున్నాయి. కాబట్టి వీటి రెగ్యులర్‌ వేరియంట్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ AMG, RS, M లాంటి హై-పెర్‌ఫార్మెన్స్‌ వేరియంట్లు మాత్రం భారీగా చౌకయ్యే ఛాన్స్‌ ఉంది.

అదే విధంగా Ferrari, Lamborghini, Porsche లాంటి పూర్తిగా దిగుమతి అయ్యే (CBU) స్పోర్ట్స్‌ కార్ల ధరలపై ఈ ఎఫ్‌టీఏ పెద్ద ప్రభావం చూపనుంది. అయితే వీటి అమ్మకాలు తక్కువ సంఖ్యలోనే ఉండటంతో, మార్కెట్‌పై ప్రభావం పరిమితంగానే ఉంటుంది.

ఒక విషయం గుర్తుంచుకోవాలి

2025లో, యూరోతో పోలిస్తే భారతీయ రూపాయి దాదాపు 19 శాతం బలహీనపడింది. దీనివల్ల, టాక్స్‌ తగ్గింపుతో వచ్చే లాభంలో కొంత భాగం భవిష్యత్తులో తగ్గే అవకాశం కూడా ఉంది.

FTA ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

భారత్‌ - ఈయూ ఎఫ్‌టీఏపై చర్చలు 2007లో మొదలయ్యాయి. 2013లో నిలిచిపోయిన ఈ చర్చలు 2022లో మళ్లీ ప్రారంభమై, 2025 అక్టోబర్‌లో తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినా, అన్ని లీగల్‌ ప్రక్రియలు పూర్తి చేసుకుని 2028 మధ్య నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తుది నిబంధనల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి, India EU FTA వల్ల భారత్‌లో లగ్జరీ కార్ల మార్కెట్‌లో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.